Let's talk: editor@tmv.in
‘మియా’ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు తీర్పు చదవాలి: అస్సాం సీఎం

‘మియా’ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు తీర్పు చదవాలి: అస్సాం సీఎం

Pinjari Chand
30 జనవరి, 2026

‘మియా’ వ్యాఖ్యలపై తనపై విమర్శలు చేస్తున్నవారు అస్సాంలో అక్రమ వలసలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును చదవాలని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ గురువారం అన్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న నిశ్శబ్దమైన, ప్రమాదకర జనాభా ఆక్రమణపై సుప్రీంకోర్టే స్పష్టంగా వ్యాఖ్యానించిందని ఆయన గుర్తు చేశారు. ఇటీవల అస్సాంలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో ‘మియా’లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అక్రమంగా వచ్చిన బంగ్లాదేశ్ ముస్లింలకు ఓటు హక్కు ఇవ్వలేమని హిమంత వ్యాఖ్యానించారు. అయితే అస్సామీ హిందువులు గానీ, ముస్లింలు గానీ ఈ ప్రక్రియలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొనట్లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు గుప్పించాయి.

ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా స్పందించారు. అక్రమ వలసదారుల నిర్ణయ చట్టం (ఐఎండీటీ యాక్ట్ , 1983)ను 2005లో రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆయన ఉదహరించారు. అక్రమ వలసల వల్ల ఈ ప్రాంతాలు ముస్లిం మెజారిటీగా మారుతున్నాయి. భవిష్యత్తులో బంగ్లాదేశ్‌తో విలీన డిమాండ్లు వచ్చే అవకాశమూ ఉంది. ఇది దేశ భౌగోళిక సమగ్రతకు తీవ్రమైన ముప్పు అని సుప్రీంకోర్టు హెచ్చరించినట్లు గుర్తు చేశారు.

ఇది ద్వేషం గానీ, సామూహిక విద్వేషం గానీ కాదని, అస్సాం ఎన్నో దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యను అత్యున్నత న్యాయస్థానమే గుర్తించిందని సీఎం తెలిపారు. ఇది నా భాష కాదు, నా ఊహ కాదు, రాజకీయ అతిశయోక్తి కూడా కాదు. సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగానే నేను మాట్లాడుతున్నాను అని స్పష్టం చేశారు. అస్సాం గుర్తింపు, భద్రత, భవిష్యత్తును కాపాడేందుకు తమ ప్రభుత్వం పనిచేస్తోందని, సుప్రీంకోర్టు హెచ్చరికలను విస్మరించడం అస్సాంకు, దేశానికి అన్యాయం అవుతుందని అన్నారు.

వారే మియా అని పిలుచుకుంటారు

గోలాఘాట్‌లోని ఒక కార్యక్రమంలో మీడియాతో మాట్లాడుతూ బంగ్లాదేశ్ నుంచి వచ్చినవారే తమను తాము ‘మియా’ అని పిలుచుకుంటారు. ఈ పేరు నేను పెట్టింది కాదు. వాళ్లు మమ్మల్ని ‘అస్సామీ’ అని పిలిస్తే తప్పేముంది? అని వ్యాఖ్యానించారు. ‘మియా’ అనే పదం ప్రజాస్వామ్య విరుద్ధమా? అనే ప్రశ్నకు స్పందించిన సీఎం సుప్రీంకోర్టే అస్సాంలో జనాభా ఆక్రమణ జరుగుతోందని చెప్పినప్పుడు, ఇది ప్రజాస్వామ్య విరుద్ధం ఎలా అవుతుంది? తేడా ఏమిటంటే, సుప్రీంకోర్టు ‘ముస్లిం’ అనే పదం వాడింది, నేను అస్సామీ ముస్లింలకు అభ్యంతరం కలగకుండా ‘మియా’ అన్న పదం వాడుతున్నాను అని అన్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ముస్లిం జనాభా గణనీయంగా పెరిగినట్టు సుప్రీంకోర్టే గణాంకాలు చూపించిందని, తాను ఏమీ కల్పించలేదని హిమంత చెప్పారు. ఒకప్పుడు 10 శాతం ముస్లిం జనాభా ఉన్న జిల్లాలు, ఇప్పుడు 60 శాతానికి చేరాయి. ఈ వాస్తవాన్ని ఎవరు కాదనగలరు? అని ప్రశ్నించారు. ఇటీవల ‘మియా’ ఓటర్ల పేర్లు తొలగించడం కేవలం ప్రారంభమేనని, భవిష్యత్తులో జరగబోయే ప్రత్యేక సర్వే లో నాలుగు నుంచి ఐదు లక్షల మంది బంగ్లాదేశీ ముస్లింల ఓట్లు రద్దు అవుతాయని హిమంత పేర్కొన్నారు. అయితే ప్రతిపక్షాలు, ఈ ఓటర్ల జాబితా సవరణను మత మైనారిటీలను వేధించేందుకు ఉపయోగిస్తున్నారని ఆరోపిస్తున్నాయి. ఫారం–7 ద్వారా నిజమైన పౌరులపైనా ఫిర్యాదులు చేస్తున్నారని విమర్శలు చేస్తున్నాయి. ఎన్నికల సంఘం మాత్రం, తప్పులేని ఓటర్ల జాబితా తయారీ కోసమే ఈ ప్రత్యేక సవరణ ప్రక్రియ చేపట్టామని స్పష్టం చేసింది. డిసెంబర్ 27న ముసాయిదా జాబితా విడుదల కాగా, జనవరి 22 వరకు అభ్యంతరాలు స్వీకరించారు. తుది ఓటర్ల జాబితాను ఫిబ్రవరి 10న విడుదల చేయనున్నారు.