Let's talk: editor@tmv.in
మియామి ఓపెన్ విజేత సబలెంకా

మియామి ఓపెన్ విజేత సబలెంకా

Shaik Mohammad Shaffee
30 మార్చి, 2026

టెన్నిస్ ప్రపంచంలో బెలారస్‌ క్రీడాకారిణి, ప్రపంచ నంబర్ వన్ అరీనా సబలెంకా తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. శనివారం జరిగిన మియామి ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో సబలెంకా సంచలన విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన తుది పోరులో అమెరికా యువ సంచలనం, నాలుగో సీడ్ కోకో గఫ్‌ను 6-2, 4-6, 6-3 తేడాతో మట్టికరిపించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ విజయంతో ఒకే సీజన్‌లో ఇండియన్ వెల్స్, మియామి ఓపెన్ టైటిళ్లను గెలుచుకుని ప్రతిష్ఠాత్మక 'సన్‌షైన్ డబుల్' సాధించిన క్రీడాకారిణిగా సబలెంక రికార్డు సృష్టించింది. 2022లో ఇగా స్వైటెక్ తర్వాత ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్‌గా ఆమె నిలిచింది.

హోరాహోరీ పోరు

సుమారు 2 గంటల 11 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. తొలి సెట్‌ను 6-2తో సునాయాసంగా గెలుచుకున్న సబలెంకకు, రెండో సెట్‌లో గఫ్ గట్టి పోటీనిచ్చింది. సొంతగడ్డపై ఆడుతున్న గఫ్‌నకు స్టేడియం నిండా ఉన్న అభిమానులు భారీ మద్దతు తెలపడంతో ఆమె పుంజుకుని 6-4తో సెట్‌ను గెలిచి మ్యాచ్‌ను నిర్ణయాత్మక మూడో సెట్‌కు తీసుకెళ్లింది. అయితే మూడో సెట్ ఆరంభంలోనే గఫ్ డబుల్ ఫాల్ట్ చేయడంతో సబలెంకకు బ్రేక్ పాయింట్ లభించింది. అదే ఊపులో సబలెంక తన పవర్‌ఫుల్ బ్యాక్‌హ్యాండ్ షాట్లతో విరుచుకుపడి సెట్‌తో పాటు టైటిల్‌ను సొంతం చేసుకుంది.

అభిమానుల అల్లరి.. సబలెంక క్షమాపణ

మ్యాచ్ మధ్యలో గఫ్ అభిమానుల ప్రవర్తన సబలెంకను తీవ్ర అసహనానికి గురిచేసింది. ఆట జరుగుతున్న సమయంలో ఒక అభిమాని 'అవుట్' అని అరవడంతో సబలెంక ఏకాగ్రత దెబ్బతిని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఆమె నోరు జారడంతో అంపైర్ కోడ్ ఉల్లంఘన హెచ్చరిక జారీ చేశారు. అయితే అవార్డు ప్రదానోత్సవంలో సబలెంక స్పందిస్తూ.. "నేను అలా ప్రవర్తించి ఉండాల్సింది కాదు, కానీ ఆట మధ్యలో అలా చేయడం సరికాదు. మన ఇద్దరిదీ తప్పే, క్షమించండి" అంటూ సరదాగా వ్యాఖ్యానించింది. తన ఆటను మెరుగుపరుచుకోవడానికి గఫ్ వంటి క్రీడాకారులు నిరంతరం స్ఫూర్తినిస్తారని ఆమె కొనియాడింది.

ఈ ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మనవరాలు, గోల్ఫ్ క్రీడాకారిణి కై మాడిసన్ ట్రంప్ హాజరయ్యారు. ఆమె సబలెంకతో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ విజయంతో సబలెంక తన కెరీర్‌లో 24వ ప్రొఫెషనల్ టైటిల్‌ను ఖాతాలో వేసుకుంది. మరోవైపు సొంత గడ్డపై టైటిల్ చేజారినప్పటికీ, తొలిసారి సెమీఫైనల్ దాటి ఫైనల్ చేరడం పట్ల గఫ్ సంతోషం వ్యక్తం చేసింది.