Let's talk: editor@tmv.in
మియాపూర్ ప్రభుత్వ భూమిలో 5 అంతస్తుల నిర్మాణం – హైడ్రా కూల్చివేత

మియాపూర్ ప్రభుత్వ భూమిలో 5 అంతస్తుల నిర్మాణం – హైడ్రా కూల్చివేత

Gaddamidi Naveen
2 నవంబర్, 2025

మియాపూర్ పరిధిలోని ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించబడిన ఐదు అంతస్తుల భవనాన్ని శనివారం హైడ్రా అధికారులు కూల్చివేశారు. హైడ్రా, స్థానిక రెవెన్యూ, హెచ్‌ఎండీఏ, మున్సిపల్ అధికారులతో కలిసి నిర్వహించిన సంయుక్త పరిశీలనలో ఈ నిర్మాణం ప్రభుత్వ భూమిలోకి చొరబడి నిర్మించబడిందని నిర్ధారించారు.

వివరాల ప్ర‌కారం అమీన్పూర్ సర్వే నంబర్లు 337, 338లలో హెచ్‌యూడీఏ ఆమోదించిన లే అవుట్‌లో 400 గజాల 126 నంబర్ ప్లాట్ కొనుగోలు చేసిన భాను కన్స్ట్రక్షన్స్ యజమానులు, దానికి ఆనుకొని ఉన్న మియాపూర్ సర్వే నంబర్ 101లోని ప్రభుత్వకి చెందిన భూమిలోకి చొరబడి అక్రమంగా 126/డీ, 126/భాగం, 126/సీ పేర్లతో కొత్త ప్లాట్లు సృష్టించారు. ఈ ప్రక్రియలో సుమారు 473 గజాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి, మొత్తం 873 గజాల విస్తీర్ణంలో ఐదు అంతస్తుల భవనాన్ని నిర్మించారు.

ఇక, నిర్మాణానికి చట్టబద్ధత చూపించేందుకు భాను కన్స్ట్రక్షన్స్ యజమానులు నకిలీ ఎల్ఆర్ఎస్ పత్రాలు సృష్టించినట్లు విచారణలో తేలింది. వారు చెల్లించారని పేర్కొన్న డిమాండ్ డ్రాఫ్ట్ కూడా నకిలీ అని అధికారులు గుర్తించారు. 2014లోనే ఈ ఫేక్ పత్రాలు తయారు చేసినట్టు హైడ్రా దర్యాప్తులో వెల్లడైంది.

ఈ అక్రమ నిర్మాణంపై హెచ్‌ఎండీఏ అధికారులు ఫిర్యాదు చేయడంతో, హైడ్రా బృందం క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి, ప్రభుత్వ భూమిలోకి ఆక్రమణ జరిగిందని నిర్ధారించింది. అనంతరం, ప్రభుత్వ భూమిలోకి చొరబడిన 473 గజాల మేర భాగాన్ని కూల్చివేసింది. అమీన్పూర్ పోలీస్ స్టేషన్‌లో ఇప్పటికే ఈ వ్యవహారంపై కేసు నమోదు చేశారు.ప్రభుత్వ భూమిపై అక్రమ నిర్మాణాలకు తావివ్వబోమని అధికారులు హెచ్చరిస్తూ, భవిష్యత్తులో ఇలాంటి నిర్మాణాలు చేపట్టేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

నిర్మాణాన్ని పట్టించుకోకుండా వదిలేయడంలో ఏదైనా అధికారుల పాత్ర ఉందా?

భాను కన్స్ట్రక్షన్స్ 2014లోనే ఫేక్ ఎల్ఆర్ఎస్ పత్రాలు సృష్టించారని దర్యాప్తులో తేలింది.అంతే ఇంతకాలం రెవెన్యూ, మున్సిపల్ అధికారులు గుర్తించకపోవడం లేదా చర్యలు తీసుకోకపోవడం వారి నిర్లక్ష్యనికి కారణం.ఐదు అంతస్తుల భవనం నిర్మాణానికి తప్పనిసరిగా బిల్డింగ్ పర్మిట్, ప్లాన్ అనుమతి, పన్ను రికార్డులు అవసరం ఉంటుంది.కానీ స్థానిక మున్సిపాలిటీ నుంచి ఎలాంటి పర్మిట్ ఇవ్వబడలేదు.అయినా కూడా నిర్మాణం పూర్తి కావడం, ఆ తర్వాత కూడా ఉపయోగంలోకి రావడం పరిశీలన వ్యవస్థ విఫలమైందని సూచిస్తుంది.