
మియాపూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్: అక్రమార్కుల నుంచి రూ.3వేల కోట్ల భూమికి రక్షణ
నగరంలోని భూ ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా. తాజాగా రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మియాపూర్ గ్రామంలో హైడ్రా సిబ్బంది చేపట్టిన ఆపరేషన్‌లో ప్రభుత్వ భూమిని ఆక్రమణ నుంచి రక్షించారు. మక్తా మహబూబ్ పేటలోని సర్వే నంబర్ 44లో 15 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురై వచ్చినట్లు హైడ్రా ప్రజావాణికి గతంలో ఫిర్యాదు అందింది. ఈ ప్రాంతంలో సకాలంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు 5 ఎకరాలను ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు.
హైడ్రా బృందం మియాపూర్, బాచుపల్లి ప్రధాన రహదారికి సమాంతరంగా ఉన్న చెరువు కట్టపై 200 మీటర్ల మేరకు నిర్మించిన 18 షెట్టర్లను తొలగించడం ద్వారా పాత ఆక్రమణలను తొలగించిన సంగతి తెలిసిందే. తాజాగా మక్తా మహబూబ్ పేటలోని సర్వే నంబర్ 44లోని ప్రభుత్వ భూమికి సంబంధించి అక్రమ రిజిస్ట్రేషన్లు, సబ్ రిజిస్ట్రార్ సస్పెన్షన్ వార్తల నేపథ్యంలో హైడ్రా మరోసారి విచారణ చేపట్టింది.
గతంలో తప్పుడు పత్రాలతో 43 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నాలు జరిగుతున్నట్లు నిర్ధారించారు. దీంతో 159 సర్వే నంబర్‌లోని భూమి పత్రాలతో సర్వే నంబర్ 44లోని ప్రభుత్వ భూమిలో 1.5 ఎకరాల వరకు కబ్జా చేసుకున్న ఇమ్రాన్ అనే వ్యక్తిపై ఇప్పటికే కేసు నమోదు చేశారు.
హైడ్రా సిబ్బంది స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, భూభాగాన్ని ప్రభుత్వ భూమిగా గుర్తిస్తూ బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. ఈ ఆపరేషన్ ద్వారా సుమారు 3,000 కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ భూమిని రక్షించడమే కాకుండా భవిష్యత్తులో వచ్చే ఆక్రమణలను కూడా నివారించడంలో విజయాన్ని సాధించారు.హైడ్రా ఈ విధమైన చర్యల ద్వారా భూమి అక్రమ రిజిస్ట్రేషన్ సమస్యను సమర్థవంతంగా ఎదుర్కొంటూ, ప్రభుత్వ ఆస్తులను రక్షించడంలో ముందంజ తీస్తున్నట్లు అధికారులు తెలిపారు.
