Let's talk: editor@tmv.in
మిన్నెసోటా కాల్పుల ఘటనలో వెలుగులోకి మరో వీడియో

మిన్నెసోటా కాల్పుల ఘటనలో వెలుగులోకి మరో వీడియో

Pinjari Chand
11 జనవరి, 2026

మిన్నెసోటాలో ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసీఈ) అధికారి జరిపిన కాల్పుల్లో రెనీ గుడ్ మృతి చెందిన ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆమెతో జరిగిన చివరి క్షణాలను చూపించే కొత్త వీడియో వెలుగులోకి రావడంతో ఈ ఘటనపై మరోసారి తీవ్ర చర్చ, విమర్శలు మొదలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి తమ వద్ద ఉన్న వీడియోలు, ఆధారాలను దర్యాప్తు అధికారులతో పంచుకోవాలని మిన్నెసోటా ప్రాసిక్యూటర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మినియాపోలిస్‌లో జరిగిన ఈ కాల్పుల ఘటనతో పాటు, దానికి మరుసటి రోజు ఒరెగాన్‌లోని పోర్ట్‌లాండ్‌లో బోర్డర్ గస్తీ అధికారి జరిపిన మరో కాల్పుల ఘటన దేశవ్యాప్తంగా ఆందోళనలకు దారితీసింది. వలస నియంత్రణ విధానాలపై ట్రంప్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పలు నగరాల్లో నిరసనలు చోటుచేసుకున్నాయి. అయితే గుడ్‌ను కాల్చిన అధికారి తనను, సహచరులను కాపాడుకోవడానికే కాల్పులు జరిపాడని ట్రంప్ ప్రభుత్వం సమర్థిస్తోంది.

ఇప్పటివరకు ఈ ఘటనపై ప్రధానంగా ప్రత్యక్షసాక్షులు తీసిన సెల్‌ఫోన్ వీడియోలే చర్చకు కేంద్రంగా ఉన్నాయి. అయితే తాజాగా మిన్నెసోటాకు చెందిన కన్‌సర్వేటివ్ న్యూస్ వెబ్‌సైట్ ‘ఆల్ఫా న్యూస్’ ఆన్‌లైన్‌లో ప్రచురించిన 47 సెకన్ల వీడియో కొత్త మలుపు తీసుకొచ్చింది. ఈ వీడియోను అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ కూడా అనంతరం సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ దృశ్యాలు కాల్పులు జరిపిన ఐసీఈ అధికారి జోనాథన్ రాస్ దృష్టికోణంలో నుంచి రికార్డు అయినవిగా చెబుతున్నారు. వీడియోలో సైరన్లు మోగుతున్న శబ్దాల మధ్య, రాస్ రోడ్డుపై ఆగి ఉన్న గుడ్ వాహనం చుట్టూ తిరుగుతూ తన సెల్‌ఫోన్‌తో వీడియో తీస్తున్నట్లు కనిపిస్తుంది. అదే సమయంలో గుడ్ భార్య కూడా ఈ ఘటనను రికార్డు చేస్తూ, వాహనం చుట్టూ తిరుగుతూ అధికారిని సమీపిస్తోంది.

వీడియోలో ఉన్న సంభాషణ

సరే, నాకు మీ పై కోపం లేదు, అని గుడ్ అంటుంది. ఆమె ఒక చేయి స్టీరింగ్‌పై, మరో చేయి డ్రైవర్ సైడ్ కిటికీ వెలుపల ఉంచి ఉంటుంది.

ప్యాసింజర్ వైపు నిలబడి ఫోన్ ఎత్తి పట్టుకున్న ఆమె భార్య,

యూఎస్ పౌరురాలు, మాజీ వెటరన్. మా మీదకు రావాలనుకుంటున్నారా? రావాలంటే రండి. ముందుగా లంచ్‌కు వెళ్లండి బిగ్ బాయ్ అంటూ వ్యాఖ్యానిస్తుంది.

అదే సమయంలో మరికొందరు అధికారులు డ్రైవర్ వైపు చేరుకుంటారు. వారిలో ఒకరు,

కారు నుంచి దిగు, వెంటనే కారు నుంచి దిగు అని కేకలు వేస్తారు.

ఈ సమయంలో రాస్ కారు ముందు డ్రైవర్ వైపు ఉంటాడు. గుడ్ కారు కొద్దిగా వెనక్కి తీసి, తర్వాత స్టీరింగ్‌ను ప్యాసింజర్ వైపు తిప్పి ముందుకు వెళ్లడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడే రాస్ కాల్పులు ప్రారంభిస్తాడు.

వీడియో కుదుపులకు గురై, కొద్దిసేపు ఆకాశం వైపు తిరిగి, తర్వాత మళ్లీ రోడ్డును చూపిస్తుంది. గుడ్ వాహనం అదుపు తప్పి దూరంగా దూసుకెళ్తుంది.

ఎఫ్— బీ— అని అక్కడ ఎవరో అరుస్తారు.

ఆ తర్వాత గుడ్ కారు రోడ్డుపై నిలిపి ఉన్న ఇతర వాహనాలను ఢీకొట్టిన శబ్దం వినిపిస్తుంది.

వలస అమలు చర్యల సమయంలో ప్రజలు జోక్యం చేసుకునే అవకాశం ఉన్నప్పుడు వాటిని రికార్డు చేయాలని ఫెడరల్ ఏజెన్సీలు అధికారులను ప్రోత్సహిస్తున్నాయి. అయితే చేతిలో సెల్‌ఫోన్‌తో వీడియో తీయడం వంటి చర్యలు ఉద్రిక్త పరిస్థితుల్లో అధికారుల దృష్టిని చెదరగొట్టి, వేగంగా నిర్ణయం తీసుకోవాల్సిన సమయంలో ప్రమాదకరంగా మారవచ్చని పోలీసింగ్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఐసీఈ విధానాల ప్రకారం, అమలు చర్యలు ప్రారంభమైన వెంటనే అధికారులు బాడీ కెమెరాలను ఆన్ చేయాలి. మరణాలు లేదా బలవంత వినియోగం జరిగిన ఘటనల్లో ఆ ఫుటేజ్‌ను తప్పనిసరిగా భద్రపరచాలి. అయితే ఈ ఘటన సమయంలో కాల్పులు జరిపిన అధికారి లేదా అక్కడున్న ఇతరులు బాడీ కెమెరాలు ధరించారా లేదా అన్న విషయంపై హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ ఇప్పటివరకు స్పందించలేదు.

స్వీయరక్షణలోనే కాల్పులు:హోంల్యాండ్ సెక్యూరిటీ

ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, హోంల్యాండ్ సెక్యూరిటీ ప్రతినిధి ట్రిషియా మెక్‌లాఫ్లిన్ ‘ఎక్స్’లో పోస్టులు చేస్తూ, ఈ వీడియో అధికారి స్వీయరక్షణలోనే కాల్పులు జరిపాడన్న తమ వాదనకు మద్దతిస్తుందని అన్నారు. ఈ అధికారి కారుతో ఢీకొనలేదని, అతడిని వేధించలేదని, ఒక నిర్దోషిని హత్య చేశాడని చాలా మందికి చెప్పారు. కానీ వాస్తవం ఏమిటంటే అతడి ప్రాణాలకు ముప్పు ఏర్పడింది. అందుకే స్వీయరక్షణ కోసమే కాల్పులు జరిపాడని వాన్స్ వ్యాఖ్యానించారు.

అయితే మినియాపోలిస్ మేయర్ జేకబ్ ఫ్రే ఈ వాదనను పూర్తిగా ఖండిస్తూ, స్వీయరక్షణ అన్న వాదన పూర్తిగా అర్థరహితమని అన్నారు. పోలీసింగ్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ వీడియో కాల్పుల న్యాయసమ్మతిపై తమ అభిప్రాయాన్ని మార్చలేదని, కానీ అధికారి శిక్షణపై కొత్త ప్రశ్నలు లేవనెత్తిందని చెప్పారు. ఒక చేతిలో తుపాకీ, మరో చేతిలో సెల్‌ఫోన్ పట్టుకుని వీడియో తీస్తూ ఉన్నాడు. ఇలాంటి చర్యకు అనుమతిచ్చే శిక్షణ ఏదో చూడాలనుందని సౌత్ కరోలైనా విశ్వవిద్యాలయ క్రిమినాలజీ ప్రొఫెసర్ జెఫ్ ఆల్పర్ట్ అన్నారు. విస్కాన్సిన్ లా స్కూల్‌కు చెందిన ప్రొఫెసర్ జాన్ పి. గ్రాస్ మాట్లాడుతూ ఆమెను నిజంగా ప్రమాదంగా భావిస్తే, ఒక చేయితో సెల్‌ఫోన్ పట్టుకుని చుట్టూ తిరగరు. అలా నిర్లక్ష్యంగా వీడియో తీయరని వ్యాఖ్యానించారు. 43 ఏళ్ల జోనాథన్ రాస్ ఇరాక్ యుద్ధంలో పాల్గొన్న వెటరన్. దాదాపు రెండు దశాబ్దాలుగా బోర్డర్ గస్తీ, ఐసీఈలో సేవలందిస్తున్నాడు. గత ఏడాది వలస అరెస్ట్ నుంచి పారిపోతున్న ఓ డ్రైవర్ అతడిని ఈడ్చుకెళ్లడంతో గాయపడ్డాడు. రాస్‌ను సంప్రదించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

ప్రాసిక్యూటర్ విజ్ఞప్తి

హెనెపిన్ కౌంటీ అటార్నీ మేరీ మోరియార్టీ మాట్లాడుతూ ఈ కేసులో ఎఫ్‌బీఐతో గతంలో కలిసి పనిచేసినా, ఈ ఘటన దర్యాప్తులో రాష్ట్ర, స్థానిక సంస్థలకు పాత్ర ఇవ్వకుండా ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కేసులో ఏమి జరిగిందన్న దానిపై నిర్ణయం తీసుకునే అధికార పరిధి మాకు ఉంది. ఇది ఫెడరల్ అధికారి అయినా సరే అని ఆమె స్పష్టం చేశారు. ప్రజలు తమ వద్ద ఉన్న వీడియోలను సమర్పించేందుకు లింక్‌ను విడుదల చేస్తామని, అయితే వాటి వల్ల ఎలాంటి న్యాయపరమైన ఫలితాలు వస్తాయో ఇప్పుడే చెప్పలేమని అన్నారు.

గుడ్ భార్య బెక్కా గుడ్ మిన్నెసోటా పబ్లిక్ రేడియోకు విడుదల చేసిన ప్రకటనలో, ఆమె నుంచి దయ వెలువడేదని చెప్పారు.

జనవరి 7న మా పొరుగువారికి మద్దతుగా మేము అక్కడ నిలిచాం. మా చేతుల్లో విసిల్స్ ఉన్నాయి. వారి చేతుల్లో తుపాకులు ఉన్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

దేశవ్యాప్తంగా నిరసనలు

2020లో జార్జ్ ఫ్లాయిడ్ మృతి చెందిన నగరమైన మినియాపోలిస్‌లో ఈ ఘటనతో వెంటనే నిరసనలు చెలరేగాయి. వందలాది మంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. భద్రతా కారణాలతో పాఠశాలలు వారం రోజుల పాటు మూసివేశారు. పోర్ట్‌లాండ్‌లో జరిగిన మరో కాల్పుల ఘటనపై కూడా వందలాది మంది ఐసీఈ భవనం ముందు ర్యాలీలు నిర్వహించారు. మినియాపోలిస్ ఘటన ట్రంప్ పాలనలో ఇప్పటివరకు వలస అరెస్టుల సమయంలో చోటుచేసుకున్న ఐదో హత్య. దేశవ్యాప్తంగా మరిన్ని నిరసనలు జరగనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.