
మినీ మాల్స్ తరహాలో రేషన్ దుకాణాలు
రాష్ట్రంలో రేషన్ దుకాణాలను ప్రజలకు మరింత చేరువ చేసేలా కూటమి ప్రభుత్వం సంస్కరణలు తీసుకొస్తోంది. ఇప్పటికే స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు రోజులో 12 గంటలపాటు రేషన్ సరఫరా చేసేలా కొత్త విధానానికి శ్రీకారం చుడుతోంది. అందుకు చౌకధర దుకాణాలను మినీమాల్స్‌గా మార్చనుంది. ఇందుకుగాను రాజమహేంద్రవరం, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, విజయవాడ నగరాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది.
ప్రస్తుతం 8 గంటలే..
ప్రస్తుతం రేషన్ దుకాణాల్లో ప్రతి నెలా 1-15 వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు బియ్యం, ఇతర నిత్యావసరాలు ఇస్తున్నారు. ఈ విధానంలో కొందరు డీలర్లు సరిగా దుకాణాలు తీయకపోవడం, తీసినా సమయపాలన పాటించకపోవడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి సమస్యలను సకాలంలో పరిష్కరించేందుకు మినీమాల్స్ విధానంలో రోజంతా (సుమారు 12 గంటలు) దుకాణాలను తెరిచి ఉంచే విధంగా ఏర్పాట్లను చేస్తున్నారు.
కొలిక్కి వస్తున్న ప్రక్రియ
మినీమాల్స్‌లో జాతీయ వ్యవసాయ కో-ఆపరేటివ్ సొసైటీ, గిరిజన కార్పొరేషన్ నుంచి చౌకధర దుకాణాలకు ఆయా నిత్యావసరాలను సరఫరా చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అయితే ఈ వస్తువులను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందా? లేక డీలర్లే కొనుగోలు చేయాలా? సంబంధిత నిత్యావసరాలపై లబ్ధిదారులకు రాయితీ ఉంటుందా? లేదా? అనే అంశాలపై స్పష్టత ఇంకా రావాల్సి ఉంది. ఈ పైలట్ ప్రాజెక్టులో భాగంగా రేషన్ దుకాణాల్లో రేషన్ బియ్యంతో పాటు ఈ నిత్యావసరాలను అందించేందుకు అనువుగా ఒక్కో నగరంలో 15 చొప్పున 75 దుకాణాలను అధికారులు ఎంపిక చేస్తున్నారు. ఇప్పటివరకు రేషన్ డీలర్లు రోజులో కొంత సమయం మాత్రమే దుకాణాల్లో ఉంటూ మిగతా సమయాల్లో ఇతరత్రా పనులను చేసుకునేవారు. మినీమాల్స్ విధానంలో మాత్రం వారు రోజంతా అక్కడే ఉండాలి. అయితే డీలర్లు ఆర్ధికంగా నష్టపోకుండా ఉపాధిని పొందేలా మినీమాల్స్‌లో అన్నిరకాల నిత్యావసరాలను అందుబాటులో ఉంచనున్నారు.
