
మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడి... బీఆర్ఎస్వీ నేతల అరెస్టులు
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ వేధింపులకు పాల్పడుతోందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ విద్యార్థి విభాగం (బీఆర్ఎస్వీ) ఆదివారం నిరసనతో హోరెత్తించింది. బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో విద్యార్థి నేతలు నగరంలోని మినిస్టర్స్ క్వార్టర్స్‌ను ముట్టడించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్, 65 ఏళ్ల ఏళ్ల వయసున్న కేసీఆర్ ని సిట్ విచారణ పేరుతో మానవత్వం లేకుండా వేధించడం కాంగ్రెస్ ప్రభుత్వ మూర్ఖత్వానికి నిదర్శనమన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావులను కూడా సిట్ విచారణ పేరిట ఇబ్బంది పెట్టడం నీచమైన చర్యగా అభివర్ణించారు. ఫోన్ ట్యాపింగ్ కేసుతో కేసీఆర్‌కి ఎలాంటి సంబంధం లేకున్నా, మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు.
రేవంత్ రెడ్డి పాలన 25 మాసాలు 65 మోసాలుగా మారిందని, ఇప్పటి వరకు ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించలేదని ఆయన విమర్శించారు. నిరుద్యోగులు, విద్యార్థులు, రైతులు, రిటైర్డ్ ఉద్యోగులను మోసం చేస్తూ పాలన సాగుతోందన్నారు. ఈ నిరసనలో పాల్గొన్న గెల్లు శ్రీనివాస్‌తో పాటు కడారి స్వామి యాదవ్, తుంగ బాలు, చాటారి దశరథ్ ,ఇతర నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.
