Let's talk: editor@tmv.in
మిథున్ రెడ్డీ.. కపట నాటకాలు చాలు!

మిథున్ రెడ్డీ.. కపట నాటకాలు చాలు!

FL - SUNL
2 అక్టోబర్, 2025

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల జీవితాలను దెబ్బతీసిన మద్యం కుంభకోణం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైందని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. ఈ కుంభకోణంలో వేలాది కుటుంబాలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా 30 వేల మహిళల తాళి బొట్లు తెగిపోవడం వంటి విషాదకర పరిణామాలు రాష్ట్ర చరిత్రలో మిగిలిపోయాయని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాన నిందితుడిగా నిలిచిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, జైలు నుంచి విడుదలైన తరువాత కూడా నిస్సిగ్గుగా వ్యాఖ్యలు చేయడం విచారకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం కాలంలో జరిగిన రూ.3,500 కోట్ల మద్యం కుంభకోణం గురించి యావత్ దేశం ఇప్పటికే తెలుసుకుందన్నారు.

ఈ వ్యవహారంలో ప్రతి దశలోనూ మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించారని అనేక వర్గాలు స్పష్టం చేస్తున్నాయని పేర్కొన్నారు. మద్యం పాలసీ రూపకల్పన నుంచి సరఫరా ఆర్డర్లు మలచడం, కంపెనీల నుంచి లంచాలు వసూలు చేయడం, వాటిని తాడేపల్లి కేంద్రానికి మళ్లించడం వంటి అంశాలన్నీ వెలుగులోకి వచ్చాయని వ్యాఖ్యానించారు.ముఖ్యంగా కొన్ని సంస్థలకు మాత్రమే ప్రత్యేక ఆర్డర్లు ఇవ్వడం, బంగారం–నగదు రూపంలో లాభాలు పొందడం, హవాలా నెట్‌వర్క్ ద్వారా కోట్ల రూపాయల లావాదేవీలు జరగడం వంటివి మద్యం కుంభకోణం తీవ్రతను చూపిస్తున్నాయన్నారు.

ఈ వ్యవహారంలో అదాన్ డిస్టిలరీస్ వంటి సంస్థలతో సంబంధం కూడా ప్రశ్నలు రేకెత్తిస్తోందని పేర్కొన్నారు. ప్రజల రక్తం– చెమటతో వచ్చిన సొమ్మును కుంభకోణాల ద్వారా దోచుకోవడమే కాకుండా, విషపూరిత మద్యం విక్రయించి బలహీన వర్గాలను దెబ్బతీసిన చరిత్ర మిథున్ రెడ్డిదని లావు మండిపడ్డారు. ప్రజల నుంచి సానుభూతి పొందేందుకు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

మిథున్ రెడ్డీ.. కపట నాటకాలు చాలు! - Tholi Paluku