
మిజోరంలో రూ. 28 కోట్లకు పైగా విలువైన మెత్ మాత్రల స్వాధీనం, ఒకరి అరెస్ట్
మిజోరం సరిహద్దుల్లో మాదకద్రవ్యాల స్మగ్లింగ్‌పై అస్సాం రైఫిల్స్ మరోసారి ఉక్కుపాదం మోపింది. భారీ ఆపరేషన్‌లో భాగంగా దాదాపు రూ. 28.17 కోట్ల విలువైన మెతాంఫేటమిన్ మాత్రలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి అస్సాంకు చెందిన ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
విడి చక్రంలో రహస్యంగా రవాణా
తూర్పు మిజోరంలోని చంపై జిల్లా, న్గుర్ గ్రామం మీదుగా ఒక పికప్ వ్యాన్ అనుమానాస్పదంగా వెళ్తుండటాన్ని అస్సాం రైఫిల్స్ దళాలు గమనించాయి. వెంటనే అప్రమత్తమైన జవాన్లు వాహనాన్ని ఆపి సోదాలు నిర్వహించారు. వాహనంలోని విడి చక్రం లోపల అత్యంత చాకచక్యంగా దాచి ఉంచిన 9.391 కిలోల బరువున్న మెతాంఫేటమిన్ మాత్రలను గుర్తించారు. అంతర్జాతీయ మార్కెట్లో వీటి విలువ రూ. 28.17 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
నిందితుడి అరెస్ట్
ఈ డ్రగ్స్‌ను తరలిస్తున్న వ్యక్తిని అస్సాం నివాసిగా గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు. స్వాధీనం చేసుకున్న సరకుతో పాటు నిందితుడిని తదుపరి విచారణ నిమిత్తం చంపై జిల్లా పోలీసులకు అప్పగించారు. ఈ ముఠా వెనుక ఎవరెవరు ఉన్నారనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.
నాలుగు రోజుల్లో రెండో భారీ సీజ్
అస్సాం రైఫిల్స్ కేవలం నాలుగు రోజుల వ్యవధిలో ఇంత భారీ స్థాయిలో డ్రగ్స్‌ను పట్టుకోవడం ఇది రెండోసారి.
జనవరి 14న ఐజ్వాల్ శివార్లలోని జెంబాక్ ప్రాంతంలో రూ. 29.4 కోట్ల విలువైన 9.8 కిలోల మెత్ మాత్రలను స్వాధీనం చేసుకున్నారు. కాగా జనవరి 18న తాజా ఘటన ప్రకారం, చంపై జిల్లాలో రూ. 28.17 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడ్డాయి.
సరిహద్దు రాష్ట్రాల ద్వారా జరుగుతున్న ఈ మాదకద్రవ్యాల రవాణా నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు భద్రతా బలగాలు నిరంతరం నిఘా కొనసాగిస్తున్నాయి.
అంతర్-సరిహద్దు మాదకద్రవ్యాల రవాణా, గోల్డెన్ ట్రయాంగిల్
మిజోరంలో రూ. 28 కోట్లకు పైగా విలువైన మెతాంఫేటమిన్ మాత్రలు పట్టుబడటం అనేది భారతదేశ జాతీయ భద్రతకు పొంచి ఉన్న ముప్పును మరోసారి స్పష్టం చేస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద అక్రమ డ్రగ్ ఉత్పత్తి కేంద్రాలైన గోల్డెన్ క్రెసెంట్ (ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్, ఇరాన్), గోల్డెన్ ట్రయాంగిల్ మధ్య భారతదేశం ఉండటం వల్ల ఈ ముప్పు మరింత ఎక్కువగా ఉంది.
గోల్డెన్ ట్రయాంగిల్ ఈశాన్య భారతం
మయన్మార్, థాయిలాండ్ మరియు లావోస్ దేశాల సరిహద్దు ప్రాంతాలను కలిపి 'గోల్డెన్ ట్రయాంగిల్' అని పిలుస్తారు. ఇక్కడి నుంచే మెతాంఫేటమిన్ (యబా) వంటి సింథటిక్ డ్రగ్స్ భారతదేశంలోకి ప్రవేశిస్తాయి.
మయన్మార్‌తో భారతదేశానికి 1,643 కి.మీ పొడవైన సరిహద్దు ఉంది. కష్టతరమైన భూభాగాలు, పారగమ్య సరిహద్దుల వల్ల మిజోరం, మణిపూర్ వంటి రాష్ట్రాలు సున్నితమైన సరిహద్దులు కావడం వల్ల డ్రగ్ స్మగ్లింగ్‌కు ప్రధాన మార్గాలుగా మారుతున్నాయి.
గతంలో నల్లమందుకు ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతం, ఇప్పుడు లాభసాటి సింథటిక్ డ్రగ్స్ వైపు మళ్లింది. 2025 మొదటి ఆరు నెలల్లోనే ఈశాన్య రాష్ట్రాల్లో 58 కిలోలకు పైగా యాంఫేటమిన్ రకం డ్రగ్స్ పట్టుబడ్డాయి, ఇది గత ఏడాదితో పోలిస్తే ఇది మూడు రెట్లు ఎక్కువ.
భారతదేశ వ్యూహాత్మక చర్యలు
మాదకద్రవ్యాల పట్ల భారత ప్రభుత్వం " జీరో టాలరెన్స్" (సహించబోం) విధానాన్ని అమలు చేస్తోంది. ఆపరేషన్ సాగర్ మంథన్ పేరుతో తీర ప్రాంతాలు సరిహద్దుల్లో నిఘా పెంచడం ద్వారా 2024లో దాదాపు రూ. 25,000 కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.
అక్రమ రవాణాను అడ్డుకోవడానికి ఇండో-మయన్మార్ సరిహద్దులో కంచె (సరిహద్దు ఫెన్సింగ్) ఏర్పాటు పనులను వేగవంతం చేశారు. అలాగే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో , అస్సాం రైఫిల్స్, రాష్ట్ర పోలీసు బలగాలు ఉమ్మడి నిఘాతో పనిచేస్తున్నాయి.
2025లో రికార్డు స్థాయి స్వాధీనం
ఫిబ్రవరి 2025లో నార్కోటిక్ నెట్‌వర్క్‌పై భద్రతా బలగాలు అతిపెద్ద దెబ్బ కొట్టాయి. మిజోరంలోని జోఖవ్తార్ సరిహద్దు వద్ద అస్సాం రైఫిల్స్, పోలీసులు జరిపిన ఉమ్మడి ఆపరేషన్‌లో 57.9 కిలోల మెతాంఫేటమిన్ మాత్రలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ అంతర్జాతీయ మార్కెట్లో సుమారు రూ.173.73 కోట్లు. భారతదేశానికి డ్రగ్స్ సరఫరా చేసే అతిపెద్ద గొలుసుకట్టును ఈ ఆపరేషన్ విచ్ఛిన్నం చేసింది. ఇది మాదకద్రవ్యాల వెనుక ఉన్న ఉగ్రవాద మూలాలను అరికట్టడంలో కీలకమైన మైలురాయి.
