
మా వివాహం పరస్పర గౌరవంపై ఆధారపడి ఉంది: అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్
తన భార్య ఉషాతో ఉన్న వివాహ విషయంపై, ఆమె మత ఆచారాలపై వస్తోన్న విమర్శలకు అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్ స్పష్టమైన సమాధానం ఇచ్చారు. ఉషా హిందూ మతానికి చెందినదని, ఆమెకు క్రైస్తవ మతంలోకి మారే ఆలోచనలేదని, తాను ఆ విషయాన్ని గౌరవిస్తున్నానని తెలిపారు.నా భార్య ఎప్పటికైనా క్రైస్తవ విశ్వాసాన్ని స్వీకరిస్తే ఆనందంగా ఉంటుంది. కానీ అది ఆమె వ్యక్తిగత నిర్ణయం. నేను ఒత్తిడి చేయను అని తెలిపారు.
కెనడా జర్నలిస్ట్ ఎజ్రా లెవాంట్ తన వ్యాఖ్యలను విమర్శించడంతో వాన్స్ ప్రతిస్పందిస్తూ మా వివాహం నమ్మకం, పరస్పర గౌరవం, సంభాషణలపై నిలబడింది. ఉషా నన్ను మళ్లీ నా విశ్వాసానికి దగ్గర చేసింది అన్నారు. ఆమెలాంటి భార్య దక్కడం అదృష్టం. వాన్స్ గతంలో ప్రోటెస్టెంట్ మతంలో ఉండేవారు. ఆయన తన చిన్ననాటి నుంచి ఇవాంజెలికల్ క్రైస్తవ విశ్వాసంలో పెరిగారు. కానీ పెద్దయ్యాక కొంతకాలం మతం నుంచి దూరమయ్యారు. కానీ 2019లో కేథలిక్ మతంలోకి మారారు. ఉషా హిందూ కుటుంబంలో పెరిగినా, అధికంగా ఆ మత సంప్రదాయాలను ఆచరించదని వివరించారు. ఇద్దరం కలిసి తమ ముగ్గురు పిల్లలను క్రైస్తవ మతంలో పెంచాలని నిర్ణయించుకున్నామని వెల్లడించారు. ఇద్దరు పెద్ద పిల్లలు క్రైస్తవ పాఠశాలలో చదువుతున్నారని, 8 ఏళ్ల కుమారుడు ఇప్పటికే ఫస్ట్ కమ్యూనియన్ పూర్తి చేశాడని తెలిపారు. జె.డి. వాన్స్, ఉషా చిలుకూరి 2014 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. వీరు ఇద్దరూ యేల్ లా స్కూల్ లో చదువుతున్న సమయంలో పరిచయం అయ్యారు. అక్కడి నుంచి వారి స్నేహం ప్రేమగా మారి, తరువాత పెళ్లి చేసుకున్నారు.
మిస్సిసిప్పిలోని ‘టర్నింగ్ పాయింట్ యూఎస్ఏ’ కార్యక్రమంలో ఓ ప్రేక్షకుడు వాన్స్ భార్య గురించి ప్రశ్నించారు. మీ భార్య హిందూవు కదా? మరి క్రైస్తవం స్వీకరిస్తుందా? అని అడిగారు. అందుకు ఆయన మాట్లాడుతూ‘ఉషా చాలాసార్లు నాతో చర్చికి వస్తుంది. నేను నమ్మే సువార్త నిజమని ఆమె కూడా ఒకరోజు అర్థం చేసుకుంటే సంతోషిస్తాను. అయినా, నేను ఆమెను ప్రేమిస్తూ, గౌరవిస్తూ, నమ్మకాలపై చర్చిస్తూ జీవిస్తాను. అది భర్తగా నా బాధ్యత అని పేర్కొన్నారు. ఆమె నిర్ణయం పూర్తిగా ఆమె ఇష్టప్రకారమే ఉంటుందని స్పష్టం చేశారు.
