
మా మధ్య ఎలాంటి భేదాలు లేవు: డీకే శివకుమార్
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీ.కే. శివకుమార్ మరోసారి ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో తనకు ఎలాంటి భేదాలు లేవని స్పష్టం చేశారు. నాయకత్వ మార్పు ప్రచారాల నేపథ్యంలో ఢిల్లీకి ఎమ్మెల్యేలను తీసుకెళ్లలేదని, తీసుకెళ్లి ఉంటే 10-12 మందినైనా తీసుకెళ్లేవాడినని ఆయన తెలిపారు. పార్టీ అధ్యక్షుడిగా నాకు ఉన్న హద్దులు నాకు బాగా తెలుసు. నేను ఎక్కడా సీఎంపై వ్యాఖ్య చేయలేదు, భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయలేదు. మేమంతా కలిసి పనిచేస్తున్నాం. కర్ణాటక ప్రజలకు ఎన్నో అంచనాలు ఉన్నాయి. వాటిని నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నాం. మా లక్ష్యం 2028, 2029 ఎన్నికలు. వాటి కోసం ఇప్పటికే వ్యూహం సిద్ధం చేస్తున్నామని ఆయన చెప్పారు. శనివారం సిద్దరామయ్యతో శివకుమార్ ఉదయం అల్పాహారం చేసిన అనంతరం ఇద్దరూ ఏకంగా మీడియా ముందుకు వచ్చి ఐక్యతను చాటారు.
నేనేవరిని ఢిల్లికి తీసుకువెళ్లలేదు
మాకు ఎప్పుడూ అభిప్రాయ భేదాలు లేవు. నేను ఢిల్లీ వెళ్లినప్పుడు ఒక్క ఎమ్మెల్యేనూ తీసుకెళ్లలేదు. తీసుకెళ్తే కనీసం 10-12 మందిని తీసుకెళ్లేవాడిని. అలాంటివి ఎటువంటి ప్రయోజనం ఉండదు అని శివకుమార్ మీడియాతో అన్నారు.కర్ణాటక పీసీసీ అధ్యక్షుడిగా తాను పార్టీ సభ్యులందరికీ తండ్రి స్థానంలో ఉన్నానని, అందరినీ కలుపుకుపోవాల్సిన బాధ్యత తనపై ఉందని ఆయన పేర్కొన్నారు. మా 140 మంది ఎమ్మెల్యేలందరూ నాకు చాలా ప్రియమైనవారు. ఎవరినీ విభజించి చూడను. ఎవరితోనూ నాకు అభిప్రాయ భేదాలు లేవు అని స్పష్టం చేశారు.
2018 మే నుంచి ఏడాది పాటు హెచ్.డీ. కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాంగ్రెస్-జేడీఎస్ పొత్తు ప్రభుత్వాన్ని కాపాడేందుకు తాను ఎంత కష్టపడ్డానో తనకు, దేవుడికి మాత్రమే తెలుసని, అది కుమారస్వామికి, ఆయన తండ్రి మాజీ ప్రధాని దేవేగౌడకూ తెలిసిన విషయమేనని గుర్తు చేసుకున్నారు.
నేను వారి మద్దతు కోరలేదు
కుమారస్వామి చేసిన ఆరోపణలపై స్పందించిన శివకుమార్ అధికార పోరులో పీఠాధిపతుల మద్దతు కోరినట్లు ఆయన చెప్పిన మాట వాస్తవం కాదని, తాను ఎప్పుడూ అడగలేదని చెప్పారు. నేను అన్ని కులాలను ప్రేమిస్తాను. చాలా మంది స్వామీజీలు నా పక్షాన మాట్లాడారు. నేను వాళ్లను మాట్లాడమని అడిగానా? లేదు. అది వాళ్ల ప్రేమ, నమ్మకం. దాన్ని తప్పు అనాలా? అని ప్రశ్నించారు. కుమారస్వామి ఏమైనా అనుకోవచ్చు, నేను బాధపడను. నేను ఎప్పుడూ వెన్నుపోటు పొడవను. ముందు నుంచి పోరాడతానని శివకుమార్ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ విమర్శలను కొట్టిపారేస్తూ బీజేపీ జీవించడం కోసం ఏమైనా మాట్లాడొచ్చు. మనం దాన్ని సీరియస్‌గా తీసుకోవాలా? అని ప్రశ్నించారు.
రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ముఖ్యంగా రైతుల ఇబ్బందులు, మేకెదాటు ప్రాజెక్ట్ విషయాలను పార్లమెంట్ సమావేశం ప్రారంభమయ్యే డిసెంబర్ 1కు ముందే ఢిల్లీలో అన్ని పార్టీల సమావేశంలో చర్చించేందుకు తాను ప్రయత్నిస్తానని వెల్లడించారు.
