
మా మంత్రులను బద్నాం చేయకండి: సీఎం రేవంత్‌రెడ్డి
ఖమ్మం జిల్లా అభివృద్ధిలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం భారీ ఎత్తున అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. దాదాపు 362 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులతో ఖమ్మం రూపురేఖలు మార్చేలా ప్రభుత్వం అడుగులు వేసింది. ఈ సందర్భంగా ప్రాంత అభివృద్ధికి కీలకమైన పలు మౌలిక వసతుల పనులను ఆయన ప్రజలకు అంకితం చేశారు.
మున్నేరు నుంచి పాలేరు వరకు లింక్ కెనాల్ నిర్మాణానికి, ఏదులాపురంలో జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాల నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా కూసుమంచిలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి, మద్దులపల్లిలో నూతన మార్కెట్ యార్డు, ఏదులాపురంలో తాజాగా నిర్మాణం పూర్తి చేసుకున్న నర్సింగ్ కాలేజీని ఆయన ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులన్నీ ప్రాంత ప్రజలకు వైద్య, విద్య, ఉపాధి రంగాల్లో మెరుగైన అవకాశాలు కల్పించనున్నాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమాల్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వాకిటి శ్రీహరి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
అనంతరం ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ విద్యార్థులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొని నర్సింగ్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా నర్సింగ్ రంగానికి ఉన్న డిమాండ్‌ను వివరిస్తూ, జపాన్, జర్మనీ వంటి దేశాల్లో నర్సింగ్ విద్యార్థులకు ఇంజినీరింగ్ కంటే కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయని తెలిపారు. భాష మాత్రమే ప్రధాన అడ్డంకిగా ఉన్న నేపథ్యంలో, ఆ సమస్యను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిందని సీఎం వెల్లడించారు.
నర్సింగ్ విద్యార్థులకు జపనీస్, జర్మన్ భాషలను బోధించేందుకు సంబంధిత దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని, త్వరలోనే నర్సింగ్ కాలేజీలకు ఆ భాషల ఉపాధ్యాయులను పంపించి శిక్షణ ప్రారంభిస్తామని సీఎం చెప్పారు. దీంతో రాష్ట్రంలోని విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకునే వీలుంటుందని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేస్తూ, పేద ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించడమే తమ లక్ష్యమని సీఎం అన్నారు. వైద్య వృత్తికి సమాజంలో ఉన్న గౌరవాన్ని గుర్తుచేస్తూ, వ్యక్తిగత ఇబ్బందులు ఉన్నప్పటికీ నిరుపేదలకు సేవలందించడంలో నిర్లక్ష్యం వహించకూడదని నర్సింగ్ విద్యార్థులకు సూచించారు. నిరుపేదల సేవనే బాధ్యతగా భావిస్తూ నర్సింగ్ వృత్తిలో రాణించి దేశ ప్రతిష్టను పెంచాలని సీఎం పిలుపునిచ్చారు.
అనంతరం మద్దులపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మంత్రివర్గ సహచరులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. రాష్ట్రంలో రేషన్ కార్డు లేని అర్హులెవరైనా దరఖాస్తు చేసుకుంటే తప్పకుండా కార్డులు మంజూరు చేస్తామని ప్రకటించారు. అలాగే అయోధ్యలోని రామమందిరాన్ని తలపించే విధంగా భద్రాచలం శ్రీరామాలయాన్ని అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
సింగరేణి బ్లాక్ టెండర్ అంశంపై మీడియా వ్యాసాలు, గాసిప్ లపై మాట్లాడుతూ, సింగరేణి లో కుంభకోణం, బొగ్గు మాయమైందని ప్రచారం చేస్తున్నారు. మా ప్రభుత్వంలో ఎలాంటి అవకతవకలకు స్థానం లేదు.నా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఏవైనా ఆరోపణలు రాసే ముందు నన్ను సంప్రదించాలి. ఇది నా గౌరవానికి సంబంధించిన విషయం అని ఆయన స్పష్టం చేశారు.
రెండేళ్ల పాలనలో అవకతవకలకు తావు ఇవ్వలేదు. సింగరేణి కాంట్రాక్టులు చట్టపరంగా, పారదర్శకంగా మాత్రమే కేటాయిస్తామని, ఏదైనా వివాదానికి అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. మీడియా యాజమానుల గొడవలలో ప్రభుత్వం భాగస్వామ్యం కాకూడదని, తలుపులు పెట్టుకొని కొట్టుకోవడం వారి సమస్య, మమ్ములని అందులో కి లాగకండి అని పేర్కొన్నారు. మంత్రులమంతా సమన్వయంతో పనిచేస్తున్నాం. వచ్చే పదేళ్లు కాంగ్రెస్సే అధికారంలో ఉంటుందని సీఎం తెలిపారు. ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలతో, సింగరేణి చుట్టూ వస్తున్న దుమారపు వార్తలను నిరసిస్తూ, అధికారులపట్ల భద్రత, పారదర్శకత, చట్టపరమైన విధానాలను మరింత కఠినంగా అమలు చేస్తారని హామీ ఇచ్చారు.
పాలేరు ప్రజల రుణం తీర్చుకుంటా..మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
పాలేరు నియోజకవర్గ ప్రజల రుణాన్ని తీర్చుకోవడమే తన ప్రధాన లక్ష్యమని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రోత్సాహం, సహచర మంత్రుల సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలుపుతానని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. పాలేరు అభివృద్ధికి అడిగిన తడువే వరాలుగా మార్చి మంజూరు చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలేరు ప్రజల తరఫున, మంత్రి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాసంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే ఇందుకు నిదర్శనమని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలతో పాటు ప్రతి ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు ఇస్తున్నారని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా అదే విధంగా ఆశీర్వదించాలని మంత్రి కోరారు. పేదల సంక్షేమం, అభివృద్ధిని అడ్డుకునే శక్తులకు మున్సిపల్ ఎన్నికల్లో మరోసారి గట్టిగా బుద్ధి చెప్పాలని ప్రజలకు మంత్రి పిలుపునిచ్చారు.
