Let's talk: editor@tmv.in
మా బాధ్యత మరింత పెరిగింది.. ప్రజల తీర్పుకు సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు

మా బాధ్యత మరింత పెరిగింది.. ప్రజల తీర్పుకు సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు

Gaddamidi Naveen
14 ఫిబ్రవరి, 2026

రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఘన విజయం అందించడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు,7 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో జరిగిన ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం ప్రజల విశ్వాసానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఈ విజయం లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తల నిరంతర శ్రమ, అంకితభావానికి ప్రతిఫలమని అన్నారు. గ్రామాలు, పట్టణాల్లో ప్రజలతో మమేకమై పార్టీ సిద్ధాంతాలను, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లిన ప్రతి కార్యకర్తకు ఈ విజయాన్ని అంకితం చేస్తున్నామని తెలిపారు. పార్టీ జెండాను భుజాలపై మోసుకుంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసిన కార్యకర్తలే ఈ విజయానికి అసలు కారణమని ఆయన స్పష్టం చేశారు.

అలాగే రాష్ట్రంలో గత రెండేళ్లుగా అమలవుతున్న ప్రజాపాలన, పేదలు, మధ్యతరగతి ప్రజల సంక్షేమానికి తీసుకున్న చర్యలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల మన్ననలు పొందాయని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రపంచ స్థాయి ప్రణాళికలు, పారదర్శక విధానాలు, అభివృద్ధి లక్ష్యాలతో ప్రభుత్వం ముందుకు సాగుతున్నదనే విషయాన్ని ప్రజలు తమ తీర్పు ద్వారా మరోసారి స్పష్టంచేశారని అన్నారు.

ఈ విజయంతో తమపై బాధ్యత మరింత పెరిగిందని పేర్కొన్న ముఖ్యమంత్రి, రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం మరింత కట్టుబడి పనిచేస్తుందని చెప్పారు. ప్రతి మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్‌ను సమగ్ర అభివృద్ధి దిశగా తీసుకెళ్లి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పారదర్శక పాలన అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని ఆయన పేర్కొన్నారు.

మున్సిపల్ ఫలితాలు ప్రజా పాలనకు లభించిన ఆశీర్వాదం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలో సాగుతున్న ప్రజా పాలనపై ప్రజలకున్న అచంచల విశ్వాసానికి ప్రతీక అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కొనియాడారు. ఈ ఘన విజయాన్ని ప్రజల ఆశీర్వాదంగా, ఒక గొప్ప బాధ్యతగా స్వీకరిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

అభివృద్ధికి పట్టం కట్టిన ఓటర్లు

గత రెండేళ్లుగా విద్య, వైద్యం, ఉపాధి మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని భట్టి విక్రమార్క తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మంత్రివర్గం అంతా కలిసికట్టుగా అమలు చేసిన అభివృద్ధి కార్యాచరణకు ఈ ఫలితాలు మద్దతుగా నిలిచాయని ఆయన విశ్లేషించారు. ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను ప్రజలు తమ ఓటుతో తిప్పికొట్టారని, అభివృద్ధి, సంక్షేమానికే పెద్దపీట వేశారని ఆయన స్పష్టం చేశారు. కార్యకర్తల అలుపెరుగని శ్రమకు, ప్రజల అపారమైన మద్దతుకు కృతజ్ఞతలు తెలుపుతూ.. ఈ విజయం తమ బాధ్యతను మరింత పెంచిందని డిప్యూటీ సీఎం అన్నారు. భవిష్యత్తులో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మరింత పారదర్శకతతో, బాధ్యతాయుతంగా ప్రజా పాలనను బలోపేతం చేస్తామని ఆయన పునరుద్ఘాటించారు.

మా బాధ్యత మరింత పెరిగింది.. ప్రజల తీర్పుకు సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు - Tholi Paluku