Let's talk: editor@tmv.in
మా నాన్న వ్యాఖ్యల్లో తప్పులేదు: ప్రియాంక్ ఖర్గే

మా నాన్న వ్యాఖ్యల్లో తప్పులేదు: ప్రియాంక్ ఖర్గే

Pinjari Chand
9 ఏప్రిల్, 2026

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే చేసిన ‘విషసర్పం’ వ్యాఖ్యలను కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే. సమర్థించారు. అదే సమయంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌పై తన తండ్రి చేసిన వ్యాఖ్యలలో తప్పేమీ లేదని అన్నారు. ఒక విషసర్పం కనిపిస్తే దానికి పాలు పోసి పెంచుతారా? లేక దూరంగా కొడతారా? అని ఆయన మీడియాతో మాట్లాడారు. సమాజంలో విభజన విత్తనాలు చల్లే సిద్ధాంతాలను ప్రోత్సహించకూడదని, దేశ అభివృద్ధికి అనుకూలం కాని ఆలోచనలను తిరస్కరించాల్సిందేనని ఖర్గే పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతాలు రాజ్యాంగం, అల్పసంఖ్యాకులు, వెనుకబడిన వర్గాలు, ఆదివాసీలు, దళితులు, మహిళలను సమగ్రంగా అంగీకరించవని ఆయన విమర్శించారు. వారు మను స్మృతి సిద్ధాంతాన్ని అనుసరిస్తారు, మేము రాజ్యాంగాన్ని అనుసరిస్తామని చెప్పారు. ఇటీవల అస్సాంలోని శ్రీభూమి జిల్లాలో జరిగిన ఎన్నికల సభలో మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ, నమాజ్ చేస్తున్నప్పుడు విషసర్పం కనిపిస్తే ప్రార్థన ఆపి దాన్ని చంపాలని ఖురాన్‌లో ఉందని చెప్పారు. అదే ఉదాహరణగా తీసుకుని ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ ఆ విషసర్పం లాంటివని వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ తీవ్రంగా స్పందించారు. ఖర్గే వయస్సు కారణంగా విచిత్రంగా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. దీనిపై ప్రియాంక్ ఖర్గే స్పందిస్తూ శర్మ వ్యాఖ్యలు నిరాశతో చేసినవని విమర్శించారు.

కులాహకారంతో దళిత నేతలపై వ్యాఖ్యలు చేస్తున్నారు

మల్లికార్జున ఖర్గే దాదాపు 50 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. పార్లమెంట్‌లో ఆయన లేవనెత్తే ప్రశ్నలకు బీజేపీ నుంచి సమాధానాలు లేవని అన్నారు. అలాగే శర్మ బ్రాహ్మణ వర్గానికి చెందినవారని, కులాధికారం భావనతోనే దళిత నేతలపై వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. ఇది ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతాలలోని చతుర్వర్ణ భావన ప్రతిబింబమని అన్నారు. ఇక ఖర్గే వ్యాఖ్యలపై ఆర్‌ఎస్‌ఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడాన్ని కూడా ఆయన ప్రశ్నించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ నమోదు కాని సంస్థ అని చెబుతారు. అయితే అది ఎలా ఫిర్యాదు చేస్తుంది? ఒకవైపు నమోదు కాలేదంటారు, మరోవైపు సంస్థను అవమానించారని చెబుతారు. అయితే ఆ సంస్థ ఉందా లేదా? అని ప్రశ్నించారు. ఆర్‌ఎస్‌ఎస్‌కు నిర్మాణం ఉన్నప్పటికీ ఆదాయ పన్ను చెల్లించడంలేదని కూడా ఆయన ఆరోపించారు. పన్ను ఎగ్గొట్టడం దేశభక్తి అవుతుందా? అలా అయితే అందరూ అదే చేస్తారని ప్రియాంక్ ఖర్గే వ్యాఖ్యానించారు.