Let's talk: editor@tmv.in
మా డాడీ ఎవరో తెలుసా? అంటే ఇక కుదరదు: సీపీ సజ్జనార్

మా డాడీ ఎవరో తెలుసా? అంటే ఇక కుదరదు: సీపీ సజ్జనార్

Gaddamidi Naveen
29 డిసెంబర్, 2025

హైదరాబాద్ నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కట్టడిపై హైదరాబాద్ పోలీసులు క‌మిష‌న‌ర్ సజ్జనార్ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేసిన ట్వీట్లు సరికొత్త పద్ధతిలో, అత్యంత కఠినంగా హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా పట్టుబడినప్పుడు పలుకుబడిని ఉపయోగించి తప్పించుకోవాలని చూసే వారికి సోషల్ మీడియా వేదికగా చమత్కారంతో కూడిన హెచ్చరికను పంపారు.

“మా డాడీ ఎవరో తెలుసా?”, “మా అంకుల్ ఎవరో తెలుసా?”, అన్న ఎవరో తెలుసా? వంటి మాటలు చెప్పి పోలీసులను బెదిరించే ప్రయత్నాలు చేయవద్దని సూచించారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారులు ఎవరిపట్లా ప్రత్యేక ప్రాధాన్యం చూపరని, చట్టం ముందు అందరూ సమానమేనని క‌మిష‌న‌ర్ పేర్కొన్నారు. సీపీ స‌జ్జనార్ ట్వీట్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది.

పోలీసులు ప్రజల గౌరవం, గోప్యతను ఎల్లప్పుడూ గౌరవిస్తారని, కానీ చట్ట ఉల్లంఘన జరిగితే మాత్రం చర్యలు తప్పవని పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనం నడిపినట్లు గుర్తించినప్పుడు వాహనాన్ని పక్కకు నిలిపించి, కేసు నమోదు చేసి, కోర్టు ఇచ్చిన తేదీన హాజరుకావాల్సి ఉంటుందని క‌మిష‌న‌ర్ తెలిపారు. ఆ రోజు కోర్టులోనే అధికారులతో పరిచయం అవుతారని వ్యంగ్యంగా పేర్కొన్నారు.

గూగుల్‌లో 'లాయర్' కోసం కాదు.. 'క్యాబ్' కోసం వెతకండి!

మందు తాగి వాహనం నడిపే వారికి క‌మిష‌న‌ర్ ఒక విలువైన సూచన చేశారు. మియా.. డ్రింక్ చేశావా? అయితే స్టీరింగ్‌కు సలాం కొట్టి క్యాబ్ ఎక్కండి అని సూచించారు. పట్టుబడిన తర్వాత కోర్టులు, లాయర్ల కోసం గూగుల్‌లో వెతకడం కంటే, తాగిన వెంటనే ఇంటికి వెళ్ళడానికి 'క్యాబ్' కోసం వెతకడం ఉత్తమమని హితవు పలికారు.

ప్రజల భద్రత దృష్ట్యా క‌మిష‌న‌ర్ చేపట్టిన ఈ వినూత్న ప్రచారం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. నిబంధనలు అతిక్రమిస్తే ఎంతటి వారైనా చట్టానికి లోబడి ఉండాల్సిందేనని క‌మిష‌న‌ర్ తెలిపారు. అలాగే డ్రంక్ డ్రైవింగ్ వల్ల జరిగే ప్రమాదాలు కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

మా డాడీ ఎవరో తెలుసా? అంటే ఇక కుదరదు: సీపీ సజ్జనార్ - Tholi Paluku