
మా అభ్యర్థులను బెదిరించారు..అయినా వెనక్కి తగ్గం: ప్రశాంత్ కిశోర్
బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జన్ సురాజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ ఎన్డీయేపై ముఖ్యంగా బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. మూడు–నాలుగు రోజులలో జన్ సురాజ్ పార్టీకి చెందిన ముగ్గురు అభ్యర్థులను బలవంతంగా నామినేషన్లు వెనక్కి తీసుకునేలా చేశారని ఆయన ఆరోపించారు. పట్నాలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ రాష్ర్టంలో భయానక వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తోంది. మేం వెనక్కి తగ్గం. బీహార్‌లో బీజేపీని ఓడించి ఎన్డీయేని పాతాళంలోకి తొక్కేస్తామని హెచ్చరించారు. కొన్ని సంవత్సరాలుగా బీజేపీ ఎవరు గెలిచినా ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే పార్టీగా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు బీహార్‌లో కొత్త వ్యూహంతో ముందుకు వస్తోంది. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. కానీ ఈసారి అత్యధికంగా భయపడుతున్నది బీజేపీనే అని ప్రశాంత్ కిశోర్ అన్నారు.
మా పోరాటం ఆగదు
మా ముగ్గురు అభ్యర్థులను, వారి కుటుంబాలను, స్నేహితులను బెదిరించి నామినేషన్లు వెనక్కి తీసుకునేలా ఒత్తిడి తెచ్చారు. మేము భయపడం. ఎంత మంది అభ్యర్థులను కొనుగోలు చేసినా, ఎవరినైనా బెదిరించినా, జన్ సురాజ్ పోరాటం ఆగదు. ఈ ఎన్నికల్లో మేము గట్టిగా పోరాడతామని తెలిపారు. ప్రశాంత్ కిశోర్ గతంలో తాను ఎన్నికల్లో పోటీ చేయబోనని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
నామినేషన్ ఉపసంహరించుకున్న జన్ సురాజ్ పార్టీ అభ్యర్థుల వివరాలు
గోపాలగంజ్ సదర్: డాక్టర్ శశి శేఖర్ సింగ్ ఈయన ప్రముఖ వైద్యుడు, ఆరోగ్య కారణాలతో తన నామినేషన్‌ను వెనక్కి తీసుకున్నారు.
బ్రహ్మపూర్ (బక్సర్): ఈ నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థి, అనేక కారణాల వల్ల తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు.
డానాపూర్: అఖిలేష్ కుమార్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి నామినేషన్ దాఖలు చేయడానికి ముందు, అనూహ్యంగా కనిపించకుండా పోయారు. తన ఫోన్ స్విచ్ ఆఫ్ కావడం, ఆయనతో సంప్రదింపులు విఫలమవడం, ఈ ఘటనపై అనేక అనుమానాలకు దారితీసింది.
