Let's talk: editor@tmv.in
మాస్కో చమురు పైపులైన్‌పై ఉక్రెయిన్ దాడి

మాస్కో చమురు పైపులైన్‌పై ఉక్రెయిన్ దాడి

Pinjari Chand
2 నవంబర్, 2025

రష్యా సైన్యానికి ఇంధన సరఫరా చేసే కీలక పైపులైన్‌పై ఉక్రెయిన్‌ దళాలు మెరుపు దాడి చేశాయని ఆ దేశ సైనిక గూఢచార సంస్థ ప్రకటించింది. శుక్రవారం అర్ధరాత్రి ఈ దాడి జరిగినట్లు తెలిపింది. మాస్కో ప్రాంతంలోని రమెన్‌స్కీ జిల్లా సమీపంలో ఉన్న ‘కొల్ట్సేవోయ్‌’ పైపులైన్‌ లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడించింది. ఈ పైపులైన్‌ సుమారు 400 కిలోమీటర్ల పొడవున విస్తరించి, ర్యాజాన్‌, నిఝ్నీ నోవ్‌గోరోడ్‌, మాస్కో రిఫైనరీల నుంచి పెట్రోలు, డీజిల్‌, జెట్‌ ఇంధనం రష్యా సైన్యానికి సరఫరా చేస్తోందని సంస్థ తెలిపింది. దాడిలో మూడు ఇంధన లైన్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ పైపులైన్‌ ద్వారా ప్రతి సంవత్సరం సుమారు 3 మిలియన్‌ టన్నుల జెట్‌ ఇంధనం, 2.8 మిలియన్‌ టన్నుల డీజిల్‌, 1.6 మిలియన్‌ టన్నుల పెట్రోలు రవాణా చేయబడుతోందని వివరించింది.

మా దాడులు రష్యాపై విధించిన ఆంక్షల కంటే ఎక్కువ ప్రభావం చూపుతున్నాయి అని హెచ్యూఆర్ అధిపతి కిరిలో బుడానోవ్‌ వ్యాఖ్యానించారు. శనివారం ఉదయం రష్యా దళాలు దక్షిణ ఉక్రెయిన్‌లోని మైకోలైవ్‌ ప్రాంతంపై ఇస్కాండర్‌ క్షిపణితో దాడి చేశాయి. ఒక పౌరుడు మరణించగా, 15 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒక చిన్నారి కూడా ఉన్నట్లు స్థానిక అధికారి విటాలీ కిమ్‌ తెలిపారు. అలాగే మధ్య ఉక్రెయిన్‌లోని పోల్టావా ప్రాంతంలో గ్యాస్‌ ప్లాంట్‌పై రష్యా దాడి చేయగా, భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.

క్రమంగా ఉక్రెయిన్‌ విద్యుత్‌ వ్యవస్థపై రష్యా విస్తృతంగా డ్రోన్‌, క్షిపణి దాడులు కొనసాగిస్తోంది. దీని వల్ల దేశవ్యాప్తంగా విద్యుత్‌ అంతరాయాలు చోటు చేసుకున్నాయి. ఉక్రెయిన్‌ వైమానిక దళం తెలిపిన వివరాల ప్రకారం గత రాత్రి రష్యా 223 డ్రోన్లు ప్రయోగించగా, వాటిలో 206 కూల్చివేశారు. అయితే 17 డ్రోన్లు ఏడు ప్రాంతాల్లో లక్ష్యాలను తాకినట్లు తెలిపారు.