Let's talk: editor@tmv.in
మావోయిస్ట్ నేత అంత్యక్రియలకు హాజరైన వారికి ఎన్‌ఐఏ నోటీసులు

మావోయిస్ట్ నేత అంత్యక్రియలకు హాజరైన వారికి ఎన్‌ఐఏ నోటీసులు

Gaddamidi Naveen
9 మార్చి, 2026

గత ఏడాది జరిగిన ఒక నిషేధిత మావోయిస్టు నేత అంత్యక్రియలకు హాజరైన వారిపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) నోటీసులు జారీ చేసింది. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నకె. రామచంద్రారెడ్డి అంత్యక్రియల సందర్భంగా ప్రసంగించిన వారిని కూడా విచారించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నట్లు సమాచారం.

ఈ నోటీసులు అందుకున్న వారిలో ఒక ప్రముఖ న్యాయవాదితో పాటు కనీసం ఏడుగురు ఉన్నట్లు తెలుస్తోంది. నిషేధిత సీపీఐ (మావోయిస్ట్) పార్టీలో కీలక నేతగా ఉన్న రామచంద్రారెడ్డి, గత ఏడాది సెప్టెంబర్‌లో ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాల చేతిలో మరణించారు. అక్టోబర్ లో సిద్దిపేట జిల్లాలోని ఆయన స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ జరిగిన సభలో మావోయిస్టు సిద్ధాంతాలను ప్రోత్సహించేలా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో మాజీ నక్సలైట్, సామాజిక కార్యకర్త గాదె ఇన్నయ్య (64)ను ఎన్‌ఐఏ ఇప్పటికే అరెస్టు చేసింది.

నోటీసులు అందుకున్న వ్యక్తులను ఈ నెలలో హైదరాబాద్‌లోని ఎన్‌ఐఏ కార్యాలయానికి విచారణకు హాజరుకావాలని ఆదేశించినట్లు సమాచారం. కేసుకు సంబంధించి వారి పాత్ర, సభలో చేసిన ప్రసంగాలు, ఇతర వివరాలపై అధికారులు ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. కాగా, రామచంద్రా రెడ్డి తన తండ్రి మృతిని ఫేక్ ఎన్‌కౌంటర్‌గా ప్రకటించారని ఆయన కుమారుడు రాజా చంద్ర గతంలో కోర్టును ఆశ్రయించారు. ఈ అంశంపై న్యాయపరమైన విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ఎన్‌ఐఏ అధికారులు ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. విచారణ ప్రక్రియ కొనసాగుతున్నట్లు మాత్రమే వర్గాలు తెలిపాయి.