Let's talk: editor@tmv.in
మావోయిస్టు పార్టీపై నిషేధం ఎత్తివేయాలి: దేవ్‌జీ

మావోయిస్టు పార్టీపై నిషేధం ఎత్తివేయాలి: దేవ్‌జీ

Pinjari Chand
15 మార్చి, 2026

ఇటీవల తెలంగాణ పోలీసులకు లొంగిపోయిన మావోయిస్టు నేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ , కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్‌) పై విధించిన నిషేధాన్ని ఎత్తివేసి దానిని రాజకీయ పార్టీగా గుర్తించాలని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉద్దేశం తమకు లేదని ఆయన తెలిపారు. ‘మేము బ్యాలెట్ మార్గాన్ని అనుసరించాలనుకోవడం లేదు. పార్లమెంట్ లేదా అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొనడం మా ఉద్దేశం కాదు’ అని ఆయన హైదరాబాద్‌లో టీవీ చానళ్లతో మాట్లాడుతూ చెప్పారు. తమ సంస్థ ఇప్పటికే రాజకీయ పార్టీగానే ఉందని, కాబట్టి దానిపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ‘అర్బన్ నక్సల్స్’ అంటూ జైళ్లలో ఉన్న మావోయిస్టు అనుచరులను రాజకీయ ఖైదీలుగా గుర్తించి విడుదల చేయాలని కూడా కోరారు. మావోయిస్టు ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి అనేక మంది ‘మార్టీర్లు’ అయ్యారని పేర్కొన్న ఆయన, వారి కుటుంబాలకు సహాయం చేసేందుకు దీర్ఘకాలిక కార్యక్రమాన్ని చేపట్టాలని తాము భావిస్తున్నామని తెలిపారు.

తాజాగా లొంగిపోయిన మావోయిస్టు నాయకులతో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసిన విషయాన్ని ఆయన వెల్లడించారు. ఆ సమావేశంలో మావోయిస్టు సంస్థపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసి, దానిని చట్టబద్ధమైన రాజకీయ పార్టీగా గుర్తించాలని కోరినట్లు చెప్పారు. అలాగే ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు సిఫారసు చేయాలని ముఖ్యమంత్రిని కోరినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం ఉన్నప్పటికీ, ఆ సమావేశ ఫలితాలపై తనకు సమాచారం లేదని దేవ్‌జీ అన్నారు.

పీఎల్‌జీఏనూ రద్దు చేస్తాం

కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టు సంస్థను చట్టబద్ధ రాజకీయ పార్టీగా గుర్తించే ప్రక్రియను ప్రారంభిస్తామని హామీ ఇస్తే, తమ సాయుధ విభాగమైన పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ) ను రద్దు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. ‘అర్బన్ నక్సల్’ అనే పదానికి చట్టపరమైన నిర్వచనం లేదని, అందువల్ల ఆ పదం సరైనది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. మావోయిస్టు దాడుల్లో పోలీసుల మరణాలపై ప్రశ్నించగా, వ్యవస్థను కూల్చాలని ప్రయత్నించినప్పుడు యుద్ధం తప్పదని, అందులో రెండు వైపులా నష్టాలు జరుగుతాయని చెప్పారు. ఫిబ్రవరి 24న నాలుగు దశాబ్దాలపాటు అండర్‌గ్రౌండ్ జీవితాన్ని గడిపిన తర్వాత దేవ్‌జీ తెలంగాణ పోలీసులకు లొంగిపోయారు. ఆయనతో పాటు మరో కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి , అలాగే బడే చొక్కారావు అలియాస్ జగన్, నూనె నరసింహరెడ్డి అలియాస్ గంగన్న కూడా ఆయుధాలు అప్పంగించారు. దేవ్‌జీ తెలంగాణలోని జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణానికి చెందినవారు. ఆయన తండ్రి వెంకట నర్సయ్య రైతు. 1982 జనవరిలో సీపీఐ(ఎంఎల్) పీపుల్స్‌వార్‌‌లో చేరిన దేవ్‌జీ ప్రధానంగా ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర ప్రాంతాల్లో పనిచేశారు.

మావోయిస్టు పార్టీపై నిషేధం ఎత్తివేయాలి: దేవ్‌జీ - Tholi Paluku