Let's talk: editor@tmv.in
మావోయిస్టు కమాండర్ బడ్సే సుక్కా సహా 20 మంది లొంగుబాటు

మావోయిస్టు కమాండర్ బడ్సే సుక్కా సహా 20 మంది లొంగుబాటు

Gaddamidi Naveen
4 జనవరి, 2026

నిషేధిత సీపీఐ (మావోయిస్టు) పార్టీకి తెలంగాణలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీలో అత్యంత కీలకమైన హై-ర్యాంకింగ్ కమాండర్ బడ్సే సుక్కా అలియాస్ దేవాతో పాటు మరో 19 మంది సభ్యులు శనివారం తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ పరిణామం మావోయిస్టు పార్టీకి చెందిన పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్‌, తెలంగాణ రాష్ట్ర కమిటీకి కోలుకోలేని దెబ్బ అని అధికారిక వర్గాలు వెల్లడించాయి. రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ పిలుపు మేరకు మావోయిస్టులు జనజీవనంలోకి వస్తున్నారని డీజీపీ తెలిపారు.

ఈ ఏడాది ప్రారంభంలోనే 20 మంది లొంగిపోయిన వారిలో పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్ కమాండర్ బడ్సే సుక్కా, రాష్ట్ర కమిటీ సభ్యుడు కనకాల రాజిరెడ్డి సహా 20 మంది ఉన్నారు. గతేడాది కూడా 509 మంది మావోయిస్టులు సాధారణ జీవనంలోకి తిరిగి వచ్చారు అని డీజీపీ తెలిపారు.

ఎవరీ బడ్సే సుక్కా?

మావోయిస్టు అగ్రనేత మాడవి హిడ్మాకు సమకాలికుడైన బడ్సే సుక్కా, మావోయిస్టు లో రెండవ అత్యంత ముఖ్యమైన నాయకుడు.2003లో అప్పటి పీపుల్స్ వార్ గ్రూప్ లో చేరిన బడ్సే, సైనిక వ్యూహాలు, బాంబులు, ఆయుధాల తయారీలో నిపుణుడు. 2013 జిరాం ఘాతి అంబుష్‌లో ఛత్తీస్‌గఢ్ మాజీ మంత్రి మహేంద్ర కర్మ ఇతర కాంగ్రెస్ నాయకులు హతమయ్యిన ఘటనలో బడ్సే కీలక సూత్రధారి. అతనిపై రూ.75 లక్షల భారీ రివార్డు ఉన్నది.

లొంగిపోయిన ఇతర నేతలు

మరో సీనియర్ నేత కంకనాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేష్ కూడా పోలీసులకు లొంగిపోయారు. ఛత్తీస్‌గఢ్, తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్టల వద్ద గెరిల్లా స్థావరాన్ని ఏర్పాటు చేయడంలో రాజిరెడ్డిది కీలక పాత్ర. లొంగిపోయిన బృందం హిడ్మా, బడ్సేకు చెందిన రహస్య ఆయుధలను పోలీసులకు అప్పగించింది.

పునరావాసం, భరోసా

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పునరావాస విధానం ప్రకారం, లొంగిపోయిన 20 మంది మావోయిస్టులపై ఉన్న రివార్డులతో కలిపి మొత్తం రూ.1.82 కోట్లను అందజేయనున్నారు. వీరందరికీ ప్రభుత్వం తరపున అందాల్సిన అన్ని ప్రయోజనాలను తక్షణమే అందిస్తామని, వారు గౌరవప్రదమైన జీవితం గడిపేలా భద్రత కల్పిస్తామని తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ హామీ ఇచ్చింది.