
మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్
దండకారణ్యంలో మూడు దశాబ్దాలకు పైగా ఉద్యమంలో ఉంటూ, 20 సంవత్సరాలకు పైగా మావోయిస్టు దాడులకు రూపకర్తగా ఉన్న టాప్ మావోయిస్ట్ కమాండర్ మడవి హిడ్మా అలియాస్ సంతోష్, అలియాస్ దేవా, అలియాస్ హిడమలు మంగళవారం ఉదయం భద్రతా దళాలకు, మావోయిస్ట్ లకు మధ్య జరిగిన ఎన్ కౌంటర్ లో నేలకొరిగాడు. భద్రతా బలగాలకు తుటాలకు బలయ్యాడు. ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హిడ్మా, అతడి భార్య రాజే, మరో నలుగురు నక్సల్స్ మృతి చెందినట్లు బస్తర్ పోలీసు ఉన్నతాధికారులు ధ్రువీకరించారు. హిడ్మా (44) ఆంధ్రప్రదేశ్–ఛత్తీస్‌గఢ్–తెలంగాణ త్రి సరిహద్దులోని పుల్లగండి కొండ అడవుల్లో జరిగిన ఆపరేషన్‌లో హతమయ్యాడు. హిడ్మా మరణించడంతో బస్తర్ ప్రాంతంలో దాదాపు మావోయిస్ట్ ఉద్యమం ముగింపు దశకు చేరుకున్నట్టేనని ఛత్తీస్‌గఢ్ పోలీసు వర్గాలు అభివర్ణించాయి. హిడ్మా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం వచ్చిందని, ఇది అత్యంత కీలక పరిణామమని ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ రాయపూర్‌లో తెలిపారు. హిడ్మా మరణంతో ఉద్యమంలో ఓ శకం ముగిసినట్టేనని అన్నారు.
సుక్మా జిల్లా పువర్తి గ్రామానికి చెందిన హిడ్మా, మావోయిస్టుల పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్ నం.1 కు ఎన్నో ఏళ్లుగా అధినేతగా కొనసాగుతున్నారు. దండకారణ్యంలో అత్యంత శక్తివంతమైన సైనిక విభాగంగా పేరుపొందిన ఈ బెటాలియన్‌కు అతడు కీలకమైన నాయకుడు. గతేడాది మావోయిస్టుల సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ప్రమోట్ అయ్యాడు. హిడ్మా 1990ల చివర్లో మావోయిస్ట్ గా అడుగుపెట్టి, 2010లో తాడ్‌మెట్లా దాడిలో (76 మంది భద్రతా సిబ్బంది మృతి) పాపారావుకు సహకరించడం ద్వారా భద్రతా సంస్థల దృష్టిలో పడ్డాడు. తరువాత బస్తర్‌లో జరిగిన దాదాపు ప్రతీ పెద్ద అంబుష్(దాడి) వెనక అతడి పాత్రే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
గెరిల్లా యుద్ధ నైపుణ్యంలో నిపుణుడైన హిడ్మా ఎప్పుడూ ఏకే–47తో సంచరిస్తూ, తన చుట్టూ నాలుగు-అంచెల భద్రతా వలయం ఏర్పరచుకునేవాడు. రెండు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం వేగంగా చేపడుతున్న ఆపరేషన్లతో అతడి భద్రతా వలయం దెబ్బతిని, ఛత్తీస్‌గఢ్–తెలంగాణ, ఛత్తీస్‌గఢ్–ఏపీ సరిహద్దు అడవుల్లోకి వెళ్లి దాక్కోవాల్సి వచ్చింది. భద్రతా దళాలు కోర్ ఏరియాల్లో కొనసాగించిన ఆపరేషన్లు హిడ్మా సహా అనేక టాప్ నాయకులపై భారీ ఒత్తిడి తెచ్చాయి. 2013లో కాంగ్రెస్ టాప్ నాయకత్వాన్ని ఊచకోత కోసిన జీరమ్ ఘాట్ దాడి, 2017లో 24 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందిన బుర్కాపాల్ దాడి వంటి ఘోర దాడుల్లో కూడా అతడి ప్రత్యక్ష ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
హిడ్మా భార్య రాజే కూడా అదే బెటాలియన్‌లో చురుకుగా పనిచేస్తూ, అనేక మావోయిస్టు దాడుల్లో పాల్గొనేదని అధికారులు పేర్కొన్నారు. ఈ ఎన్‌కౌంటర్‌తో కలిపి ఈ ఏడాది ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్‌లలో భద్రతా దళాలు మొత్తం తొమ్మిది మంది సెంట్రల్ కమిటీ సభ్యులను తుదముట్టించాయి. వీరిలో ముఖ్యులైన జనరల్ సెక్రటరీ నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు (70) కూడా ఉన్నారు. అధికారులు హిడ్మా మరణించడంతో దండకారణ్యంలో నక్సల్ శక్తి దాదాపు నిర్వీరమవుతున్న దశకు సంకేతమని అభిప్రాయపడుతున్నారు.
మడవి హిడ్మా నేపథ్యం
హిడ్మా అసలు పేరు మడవి హిడ్మా. స్వస్థలం — దండకారణ్యం గుండెకాయగా పిలిచే సుక్మా జిల్లాలోని పువర్తి గ్రామం చిన్నప్పటి నుంచే నక్సల్ ప్రభావిత ప్రాంతంలో పెరిగినందున, మావోయిస్టు సిద్ధాంతాలతో పరిచయం త్వరగానే ఏర్పడింది. 1990ల చివర్లో గ్రౌండ్ లెవల్ కేడర్, 'కోట్వాల్' తరహా స్థానిక నిర్వాహకుడిగా నక్సలిజంలో చేరాడు. చదివింది కొద్దిగానే అయినా ఇతడికి హిందీ, ఇంగ్లీష్ భాషలు వచ్చేవని అధికారులు చెబుతున్నారు.
ఎదిగిన తీరు
పీఎల్జీఏ బెటాలియన్–1 కమాండర్
దండకారణ్యంలో మావోయిస్టుల అత్యంత శక్తివంతమైన దాడుల కోసం ప్రత్యేకంగా ఉద్దేశించిన యుద్ధ విభాగం –పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ. ఈ బెటాలియన్‌కు కమాండర్‌గా హిడ్మా ఎదగడం అతడి ఆలోచన తీరును, యుద్ధ వ్యూహాలను తెలుపుతోంది. హిడ్మా ప్లాన్ వేశాడంటే అది పక్కా అమలు కావాల్సిందే. ప్రత్యేకత ఎంటంటే అంబుష్ దాడులు చేయడం. అంటే భద్రతా బలగాలు దండకారణ్యంలోకి వచ్చినప్పుడు వారికి ఎదురుపడి దాడులు చేయడం. వారు తేరుకునేలోపే చేరుకోవాల్సిన లక్ష్యాన్ని పూర్తి చేయడం. ఇతడి వెంట భారీ సంఖ్యలో సిబ్బంది, అత్యాధునిక ఆయుధాలు, అడవుల్లో వేగంగా కదిలే ప్రత్యేక స్క్వాడ్లపై పూర్తి నియంత్రణ ఉండేది. 2024లో మావోయిస్టుల సెంట్రల్ కమిటీకి ప్రమోట్ అయ్యాడు. ఇది మావోయిస్టు సంస్థలో అత్యున్నత రహస్య నిర్ణయాధికార సంస్థ.
అతడి పేరు ఎలా బయటికొచ్చింది?
2010లో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని, సుక్మా జిల్లాలో, దక్షిణ బస్తార్ డివిజన్‌లో ఉన్నతాడ్‌మెట్లా దగ్గర జరిగిన దాడితో హిడ్మా పేరు జాతీయస్థాయిలో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఈ దాడిలో 76 మంది సీఆర్ఫీఎఫ్ , కోబ్రా, ఎస్టీఎఫ్ సిబ్బంది మృతి చెందారు.అతడు అప్పట్లో టాప్ కమాండర్ పాపారావుకు కీలక సహయకారిగా ఉన్నాడు.
బస్తర్‌లో జరిగిన దాడుల్లో హిడ్మా పాత్ర
2010 — తాడ్‌మెట్లా దాడి
76 మంది భద్రతా సిబ్బంది మృతి.
2013 — జీరమ్ ఘాట్ ఘటన (దర్భా)
కాంగ్రెస్ నేతలు మహేంద్ర కర్మ, కేంద్ర మాజీ మంత్రి విద్యాచరణ్ శుక్లా, నంద్ కుమార్ పటేల్, తదితర ముఖ్యనాయకులు చేస్తున్న పాదయాత్రపై దాడి చేసి ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ కీలక నాయకత్వాన్ని పూర్తిగా ఊచకోత కోశాడు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సల్వాజుడుంకు ప్రాణం పోశారని కాంగ్రెస్ నాయకులను హతమార్చారు.
2017 — బుర్కాపాల్ అంబుష్
24 మంది సీఆర్పీఎఫ జవాన్లు మృతి.
2020–2023 మధ్యలో జరిగిన పలు చిన్న, పెద్ద దాడులు
తాడిబోడి, మిన్పా, సిల్గర్ ప్రాంతాల్లో భద్రతా దళాలపై పలు దాడుల్లో హిడ్మా స్క్వాడ్ల ప్రమేయం. అతడి స్క్వాడ్ల ప్రత్యేకత ఎంటంటే రాత్రిపూట అడవుల్లో 20–30 కిలోమీటర్ల దూరం నడిచి దాడి పాయింట్లను మార్చడం. 150–200 మంది ఉన్న ప్రధాన అంబుష్(దాడి) యూనిట్. అడవుల్లో ‘L-షేప్’ ‘U-షేప్’ అంబుష్ పద్ధతులను వినియోగిస్తూ భీబత్సం సృష్టించేవారు. అలాగే హిడ్మా, అతడి బృందం గెరిల్లా యుద్ధ నైపుణ్యం, అడవుల భౌగోళిక నిర్మాణంపై పూర్తి పట్టు ఉండేది. దాడి చేయడం, వెనక్కి తిరిగి రావడం, తిరిగి దాడి చేయడం లాంటి విషయంలో అద్భుత నైపుణ్యం కలిగి ఉన్నారు.
2025లో మొదటి ఫోటో
ఇప్పటి వరకు హిడ్మాకు సంబంధించి యుక్త వయస్సులో ఉన్న ఫోటోనే అందరికీ అందుబాటులో ఉండేది. హిడ్మా శరీరాకృతికానీ, వయసుగానీ అన్ని రహస్యంగానే ఉండేవి. కానీ అతడి ఫొటో 2025లో మొదటిసారి వెలుగులోకి రావడం వరకు భద్రతా దళాలకు ఖచ్చితమైన సమాచారం లేదు. దాని ప్రకారం వయసు 40–45 మధ్యలో ఉంటుందని మాత్రమే అంచనాకు వచ్చారు. ఎల్లప్పుడూ ఏకే–47 లేదా వేరే అధునాతన రైఫిల్స్ వాడేవాడు. అతడి వెంటనున్న యూనిట్ సభ్యులు ఇన్‌సాస్, ఎల్.ఎం.జీ., రాకెట్ లాంచర్లు కూడా తీసుకెళ్లేవారు.
వరుస కూంబింగ్ లతో బలహీనం
కేంద్ర ప్రభుత్వం వరుసగా భారీ స్థాయిలో ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా సరిహద్దుల్లో రెండేళ్లుగా భారీ స్థాయి వరుస కూంబింగ్ లు నిర్వహిస్తుండడంతో దళంలో చీలికలు వచ్చాయి. అలాగే టాప్ కమాండర్లు ఎదురు కాల్పుల్లో మరణించడం, మావోయిస్టుల లొంగుబాటు తదితర పరిణామాలతో ఉద్యమం బలహీనమైంది. అలాగే వారి మధ్య మనస్పర్థలు కూడా ఓ కారణంగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే గత ఏడాది 9 మంది సెంట్రల్ కమిటీ సభ్యుల ఎన్ కౌంటర్ లో మరణించడం పార్టీని నైరాశ్యంలోకి నెట్టింది.దీంత హిడ్మా కొత్త అంబుష్‌లను ప్లాన్ చేసుకోలేకపోయాడు. చివరకు ఏపీ–ఛత్తీస్‌గఢ్ సరిహద్దు వైపు వెళ్లాలని నిర్ణయం తీసుకుని కాల్పుల్లో మరణించాడు. అలాగే ఆయన భార్య రాజీ అలియాస్ రాజక్క కూడా ఈ కాల్పుల్లో మరణించింది. హిడ్మాపై రూ.కోటి రివార్డు, ఆయన భార్యపై రూ.50 లక్షల రివార్డు ఉంది. అయితే ఈమె హిడ్మా బెటాలియన్–1 వ్యూహాలలో నేరుగా పాల్గొనేది. దాడుల సమయంలో మహిళా స్క్వాడ్‌లను సమన్వయం చేసేది. పలు దాడుల్లో ప్రత్యక్ష పాత్ర ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
అమిత్ షా ఇచ్చిన గడువుకు 12 రోజుల ముందే
దేశంలో మావోయిస్టుల సమస్యను నిర్మూలించేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిర్ణయించిన గడువుకు 12 రోజుల ముందే అత్యంత మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ నాయకుడు మడవి హిడ్మా భద్రతా దళాల చేతిలో మరణించాడు. నవంబర్ 30లోపు హిడ్మాను నిర్మూలించాలని షా భద్రతా సంస్థలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టు విశ్వసనీయ వర్గాలు మంగళవారం వెల్లడించాయి.
ఉన్నత స్థాయి అధికారుల వివరాల ప్రకారం
మావోయిస్టు వ్యవస్థను 2026 మార్చి 31లోపు దేశం నుంచి పూర్తిగా నిర్మూలించాలని కేంద్ర హోం మంత్రి నిర్ణయించారు. ఇదే సమావేశంలో నవంబర్ 30లోపు హిడ్మాను ఎట్టి పరిస్థితుల్లోనూ అంతమొందించాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఆ గడువుకు 12 రోజుల ముందే హిడ్మా మరణించాడని తెలిపింది. మావోయిస్టులపై దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆపరేషన్ల దృష్ట్యా, లెఫ్ట్ వింగ్ తీవ్రవాదం ఇంతకుముందు నిర్ణయించిన మార్చి గడువు కంటే ముందే పూర్తిగా చివరి అంకానికి చేరే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.
1981లో సుక్మాలో జన్మించిన హిడ్మా, మావోయిస్టుల పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్ కమాండర్. మావోయిస్టుల సెంట్రల్ కమిటీలో సభ్యుడిగా కూడా ఉన్నాడు.
బస్తర్ ప్రాంతం నుంచి మావోయిస్టుల అగ్రశ్రేణి నాయకత్వంలో చేరిన ఒకే ఒక్క గొండు జాతి నాయకుడు హిడ్మానే అని సంస్థల అంచనా. 26కిపైగా ప్రధాన నక్సల్ దాడుల్లో అతడి ప్రత్యక్ష పాత్ర బయటపడటం వల్లనే అతడు దేశంలో అత్యంత భయంకర నక్సల్ నాయకుడిగా గుర్తించబడ్డాడు.
ఇటీవల హిడ్మా తల్లిని కలిసిన డిప్యూటీ సీఎం
చత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ ఇటీవల హిడ్మా తల్లిని పువర్తి గ్రామంలో నవంబర్ 10న ఆమెతో సమావేశమయ్యాడు. ఈ సందర్భంగా ఆ సమయంలో వారు కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా అతడిని లొంగిపోయేలా కోరాలని తల్లికి సూచించారు. ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలోకి రావాలని ఆహ్వానించారు. ఉప ముఖ్యమంత్రి కలిసిన 8 రోజుల్లోనే ఎన్ కౌంటర్ లో మరణించాడు.
తరువాత ఎవరు?
బెటాలియన్ కమాండర్–1గా ఉన్న అగ్రనాయకుడు హిడ్మా మరణించడంతో ఆ బాధ్యతలు ఎవరు స్వీకరిస్తారన్నదానిపైనే చర్చ నడుస్తోంది. గత ఏడాదిలో జరిగిన ఎన్ కౌంటర్ల వల్ల టాప్–10 నాయకుల్లో తొమ్మిది మంది చనిపోయారు. ఇప్పుడు హిడ్మా మరణంతో ఉద్యమం తీవ్రమైన సంధి దశను ఎదుర్కోంటుంది. ఉద్యమానికి మళ్లీ కాలం కలిసి రావడం ప్రస్తుతం పరిస్థితుల్లో కష్టమే. అలాగే అడవిని వీడి ప్రజా స్రవంతి కలుస్తున్నవారు రోజు,రోజూకీ పెరిగిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో తరువాత ఉద్యమ బాధ్యతలు ఎత్తుకునే అవకాశం ఉన్న తిప్పిరి తిరుపతి కూడా లొంగిపోయే అవకాశం లేకపోలేదు. తరువాత ఎవరూ ఉద్యమాన్ని ముందుకు నడుపుతారన్నది వేచిచూడాల్సిందే.
ఆంధ్రలో 28మంది అనుమానిత మావోయిస్ట్ లు అదుపులో
ప్రముఖ మావోయిస్టు కమాండర్ మడివి హిడ్మా మట్టుపడిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు భారీ కూంబింగ్ చేపట్టి 28మంది మావోయిస్టు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ సమీపంలో ఈ ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఈ ఉదయం ఆల్లూరి సీతారామ రాజు జిల్లా – మారేడుమిల్లి మండలంలో జరిగిన కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు హతమయ్యారు. హిడ్మా మరణించడంతో మావోయిస్టు బలగాలు చెదిరిపోయాయన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
హిడ్మా, దేవుజి బృందానికి లింకులు
అదుపులోకి తీసుకున్న 28 మందిలో 9 మంది హిడ్మా సన్నిహితులు ఉన్నట్లు క్రిష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. అలాగే వీరిలో కొందరు తిప్పిరి తిరుపతి (దేవుజి)కి సెక్యూరిటీ గార్డులుగా పనిచేసినట్టు భావిస్తున్నారు. హిడ్మా బెటాలియన్ సభ్యులు ఆటోనగర్ ప్రాంతంలో ఆశ్రయం పొందినట్టుగా ఇంటెలిజెన్స్ అధికారులు చెబుతున్నారు. దీంతో సంయుక్త ఆపరేషన్‌లో వారికి చెక్ పెట్టినట్టు వివరించారు. అదుపులోకి తీసుకున్నవారు ఛత్తీస్‌గఢ్ నుంచి క్రిష్ణా జిల్లాలోకి వచ్చారని పోలీసులు గుర్తించారు. కాకినాడలోనూ ఇద్దరు మహిళా మావోయిస్టులను అరెస్ట్ చేసినట్లు కాకినాడ ఎస్పీ జి. బిందుమాధవ్ వెల్లడించారు.
