Let's talk: editor@tmv.in
మావోయిస్టుల నిర్మూలన ఈ రోజు నుంచి మొదలైంది:సీఎం ఫడ్నవీస్

మావోయిస్టుల నిర్మూలన ఈ రోజు నుంచి మొదలైంది:సీఎం ఫడ్నవీస్

Pinjari Chand
16 అక్టోబర్, 2025

దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా మావోయిస్టు ఉద్యమంలో పార్టీ అగ్రనేతగా ఎదిగిన మల్లోజుల వేణుగోపాల్ రావు@సోను అడవి జీవితానికి విరామమిచ్చారు. సీపీఐ(మావోయిస్టు)లో జిల్లా కమిటీ నుంచి రాష్ర్ట, పోలిట్ బ్యూరో సభ్యుడిగా అంచెలంచెలుగా పదవులు చేపట్టిన ఉద్యమబావుటా జనజీవన స్రవంతిలో కలిశారు. మంగళవారం మహారాష్ట్రలోని గడ్చిరోలిలో 60మంది మావోయిస్టు దళ సభ్యులతో కలిసి ఆయుధాలు పోలీసుల ఎదుట లొంగిపోయారు. బుధవారం ఫడ్నవీస్ సమక్షంలో ఆయధాలను అప్పగించారు. ఈ సందర్భంగా సీఎం ఫడ్నవీస్ మాట్లాడారు. 2025 అక్టోబర్ 15న మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించిన ప్రకారం గడ్చిరోలి జిల్లాలో మావోయిజం నిర్మూలన ప్రక్రియ ఈ రోజు నుంచి మొదలైంది అని అన్నారు. ఈ ప్రకటనకు కారణం సీపీఐ (మావోయిస్టు) పొలిట్ బ్యూరో సభ్యుడు, సీనియర్ నక్సలైట్ నాయకుడు మల్లోజుల వేణుగోపాల్ రావు (అలియాస్ సోను, భూపతి)తో సహ మరో 60 మంది మావోయిస్టులతో కలిసి లొంగిపోయారు.గడ్చిరోలి పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ముఖ్యమంత్రి సమక్షంలో వారు జనజీవన స్రవంతి కలిసిపోయారు. ఈ సందర్భం గా సీఎం ఫడ్నవీస్ మాట్లాడుతూ గడ్చిరోలి జిల్లాలో నాలుగు దశాబ్దాలుగా మావోయిజం బీభత్సం కొనసాగించింది. చంద్రపూర్, భండారా, గోండియా జిల్లాలు కూడా మొదట్లో దాని ప్రభావంలోనే ఉన్నాయి. చత్తీస్‌గఢ్, తెలంగాణ సరిహద్దుల్లోనూ నక్సలిజం విస్తరించింది. అభివృద్ధి పూర్తిగా ఆగిపోయింది. యువతను తప్పుదారి పట్టించారు. కానీ ఈ రోజు ఒక కొత్త దిశ మొదలైందన్నారు. భూపతి లొంగిపోవడాన్ని ఆయన “చారిత్రాత్మక పరిణామం”గా పేర్కొన్నారు. ఎందుకంటే, 40 ఏళ్ల క్రితం గడ్చిరోలి లో ‘అహెరీ-సిరోంచా గ్రూప్’ను ప్రారంభించిన వ్యక్తి భూపతే. ఆయన ఉద్యమానికి మేధోబలాన్ని, లాజిస్టిక్ మద్దతును ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఎంఎల్ఏ డాక్టర్ మిలింద్ నరోటే, రాష్ట్ర డీజీపీ, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

శాంతిమార్గంలో పోరాటం చేస్తాం:భూపతి

నేను ఇప్పుడు ఆయుధాలను వదిలి పీడితుల కోసం శాంతియుత మార్గాల్లో పోరాటం చేస్తాను. మార్చి 2025 నుంచి కేంద్ర ప్రభుత్వంతో శాంతి చర్చలకు మేం సిద్ధంగా ఉన్నాం. మే నెలలో మా ప్రధాన కార్యదర్శి బసవరాజు కాల్పుల విరమణ ప్రతిపాదించారు. కానీ ప్రభుత్వ సమాధానం ఇవ్వలేదు. మరింతగా దాడులు పెంచారు. అయినా మేం చర్చల మార్గాన్ని వదలలేదని తెలిపారు. ప్రధానమంత్రి, హెం మంత్రి , పోలీస్ మిషన్ మధ్యలోనే మేం ఈ నిర్ణయం తీసుకున్నాం. మేము ఇప్పుడు ప్రధాన స్రవంతిలో భాగమవుతాం. కేంద్ర హెంశాఖ మంత్రివర్గం నియమించిన ప్రతినిధులతో చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. అయితే మల్లోజుల వేణుగోపాల్, భూపతిల తలపై దాదాపు రూ.6 కోట్ల రివార్డు ఉంది.

ఈ పరిణామం కేంద్ర ప్రభుత్వంతో శాంతి చర్చల దిశగా కీలక అడుగుగా భావిస్తున్నారు. ఈసందర్భంగా వేణుగోపాల్ రావు మాట్లాడుతూ నేను ఆయుధాలు వదిలి, దేశంలోని అణగారిన వర్గాల కోసం శాంతియుత ఉద్యమాల్లో భాగం అవుతున్నాను. ఈ ఏడాది మార్చి చివరి వారం నుంచి మా పార్టీ ప్రభుత్వం‌తో శాంతి చర్చలకు సంసిద్ధత వ్యక్తం చేసింది. మేలో మా పార్టీ ప్రధాన కార్యదర్శి సీజ్‌ఫైర్‌కు సిద్ధమని తెలిపి, ఒక నెల గడువు కోరారు. కానీ కేంద్రం స్పందించకపోగా దాడులను తీవ్రతరం చేసిందని తెలిపారు. ఆయన మరికొన్ని ముఖ్య విషయాలు వెల్లడిస్తూ ఇదే సంవత్సరం మే 21న సీమా సురక్షా బలగాల దాడిలో మా ప్రధాన కార్యదర్శి బసవరాజు సహా పలువురు మృతి చెందారు. అయినా ఆయన ఇచ్చిన శాంతి పిలుపును మధ్యలో వదిలిపెట్టకుండా ముందుకు తీసుకెళ్తున్నాం. మేం ప్రధానమంత్రి, హోం మంత్రి, పోలీసు బలగాల కూంబింగ్ మధ్యలోనూ ప్రధాన స్రవంతిలో భాగం కావాలని నిర్ణయించుకున్నాం. హోం మంత్రి నియమించిన ప్రతినిధులతో చర్చలకు సిద్ధంగా ఉన్నాం అని చెప్పారు.

ఒకనెల సమయమివ్వండి

మా సహచరులు ఉన్న వివిధ రాష్ట్రాల్లో, అలాగే జైళ్లలో ఉన్న వారితో సంప్రదించడానికి ఒక నెల సమయం ఇవ్వాలని కోరుతున్నాం. ఈ కాలంలో రక్తపాతం నిలిపివేయాలి. వీడియో కాల్స్ ద్వారా కూడా చర్చలకు సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ పరిణామం కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో ‘అపరేషన్ కగార్’ దేశవ్యాప్తంగా మావోయిస్టులపై కొనసాగుతున్న సమయంలో మధ్య చోటు చేసుకోవడం విశేషం. సెప్టెంబర్ లోనే వేణుగోపాల్ రావు లొంగిపోవడానికి సిద్ధమని సంకేతాలు ఇచ్చారు. ఈ విషయమై ఛత్తీస్‌గఢ్‌ సహా అనేక ప్రాంతాల్లోని మావోయిస్టు సభ్యుల నుంచి మద్దతు తీసుకున్నారు

‘ఆపరేషన్ కగార్’ తో క్యాడర్ కకావికలం

దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా అంతమొందించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2024లో ఆపరేషన్ కగార్ ను చేపట్టింది. తిరుగుబాటు దారులను అణచివేసేందుకు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్), ఎలైట్ కోబ్రా యూనిట్లు, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్, రాష్ట్ర పోలీసులతో సహా దాదాపు 1 లక్ష మంది పారామిలిటరీ దళాలను వామపక్ష ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం మోహరించింది. దీంతో ఛత్తీస్ ఘడ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఏపీ, ఒడిశా తదితర రాష్ట్రాల్లో బలంగా వేళ్లూనుకున్న వామపక్ష తీవ్రవాదాన్ని పెకిలించే ఉద్దేశంతో కేంద్ర అడవులను జల్లెడ పట్టింది. అందుకు సమాచారాన్ని సేకరించడానికి అత్యాధునిక డ్రోన్లు , శాటిలైట్​ పరికరాలు, ఏఐ వంటి ఆధునిక టెక్నాలజీ వాడి మావోయిస్టులపై లక్ష్యాలను గురిపెట్టింది. సాయుధ దళాలు కూంబింగ్ చేపట్టినప్పటి నుంచి వరుస ఎదురు దెబ్బలు తగిలాయి. వందలాది మంది మావోయిస్టులు బలగాల తూటాలకు బలయ్యారు. దీంతో క్రమంగా ఉద్యమంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. కొంతమంది పోలీసులకు లొంగిపోయి జనజీవన స్రవంతి కలిశారు.దాంట్లో భాగంగా మల్లోజుల భార్య విమల సిడాం అలియాస్ తారక్క కూడా 2024 చివరలో మహరాష్ట్ర పోలీసుల ముందు తన అనుచరులతో కలిసి లొంగిపోయారు. ఆమె తలపై రూ.25 లక్షల రివార్డు ఉండేది. 2026 నాటికి మావోయిస్టులను సమూలంగా ఏరివేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకుంది.

లొంగిపోతామని లేఖలు రాసిన స్పందించని కేంద్రం

• మావోయిస్టు పార్టీ 2025 మార్చి చివరి వారంలో ప్రభుత్వంతో శాంతి చర్చలు జరుపుతామని సంకేతం ఇచ్చారు.

• మే 2025 (ప్రారంభం)

లేఖ/ప్రకటన

- మల్లూజుల వేణుగోపాల్ రావు కేంద్రానికి లేఖ రాశారు, ఆయుధాలు వదిలి శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

• మే 21, 2025

రక్షణ దళాల దాడి

- సీమా సురక్షా బలగాల దాడిలో పార్టీ ప్రధాన కార్యదర్శి బసవరాజు, ఇతర సిబ్బంది మృతి చెందారు.

• లేఖ వచ్చినప్పటికీ ముమ్మరంగా దాడులు

• సెప్టెంబర్ 2025 వేణుగోపాల్ రావు ఆయుధాలు సమర్పించడానికి సిద్ధమని తెలిపారు. ఇందుకు అనేక మంది మావోయిస్టు నాయకులు మద్దతు తెలిపారు. చతీస్గఢ్, ఇతర ప్రాంతాల మావోయిస్టులు కూడా ఈ నిర్ణయాన్నే ఎంచుకున్నారు.

మల్లోజుల నేపథ్యం

మల్లోజుల వేణుగోపాల్ రావు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లిలో మల్లోజుల వెంకటయ్య, మధురమ్మలకు జన్మించారు. వీరికి ముగ్గురు కుమారులు. వేణుగోపాల్ చిన్నవారు. సుదీర్ఘకాలం పాటు మావోయిస్ట్ పార్టీలో పని చేసిన కిషన్ జీ( మల్లోజుల కోటేశ్వర్ రావు) కి వేణుగోపాల్ తమ్ముడు. ఈయన 2011 లో బెంగాల్ జరిగిన ఓ ఎన్ కౌంటర్ లో మరణించారు. లొంగిపోవడం ద్వారా గడ్చిరోలిలో శాంతి , అభివృద్ధికి కొత్త ఆశలను రేకెత్తించింది. ఈ లొంగుబాటు కేవలం ఒక రాజకీయ సంఘటన మాత్రమే కాదు. అది ఒక చరిత్ర ముగింపు, నేటి నుంచి ఒక కొత్త అధ్యాయం ఆరంభం.

మావోయిస్టుల నిర్మూలన ఈ రోజు నుంచి మొదలైంది:సీఎం ఫడ్నవీస్ - Tholi Paluku