
మావోయిస్టులు జనజీవనంలో కలవాలి: సీఎం
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర పోలీసు శాఖ గోషామహల్‌లో నిర్వహించిన పోలీస్ ఫ్లాగ్ డే పరేడ్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరులను స్మరిస్తూ వారికి శ్రద్ధాంజలి ఘటించారు. అమరులైన పోలీసు కుటుంబాల సభ్యులను పరామర్శించారు.
శాంతిభద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీసులు దేశానికి ఆదర్శంగా నిలిచారని ముఖ్యమంత్రి అభినందించారు. శాంతిని పరిరక్షిస్తూ, తెలంగాణ పోలీస్ శాఖ దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 ప్రకారం, దేశంలోనే తెలంగాణ పోలీస్ శాఖకు ప్రథమ స్థానం లభించిందని, పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ విధానంలోనూ విదేశాంగ శాఖ నుంచి ప్రత్యేక అభినందనలు పొందిందని ఆయన గుర్తుచేశారు. ఈ విజయాలు పోలీస్ సిబ్బంది నిరంతర కృషి, అంకితభావానికి నిదర్శనమని కొనియాడారు. పారదర్శకత, జవాబుదారీతనం, నైతిక విలువలు పాటించడమే పోలీసింగ్‌కు మూల స్తంభాలని, సమాజానికి దగ్గరగా ఉండే పోలీసింగ్ మోడల్‌ను అనుసరించాలని కోరారు.
మావోయిస్టులకు పిలుపు
పోలీసింగ్ పై స్పష్టత వామపక్ష తీవ్రవాద భావజాల ఉద్యమాల్లో ఉన్న అజ్ఞాత నాయకులు జన జీవన స్రవంతిలో కలిసి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఇటీవలి కాలంలో కొందరు మావోయిస్టు నాయకులు లొంగిపోయిన అంశాన్ని ప్రస్తావిస్తూ, మిగిలిన మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలో కలవాలని కోరారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే చట్టాన్ని గౌరవించే పౌరుల కోసమే తప్ప, చట్టాన్ని ఉల్లంఘించే వారికి కాదని ఆయన స్పష్టం చేశారు. పోలీస్ అంటే సమాజానికి ఒక నమ్మకం, భరోసా. పోలీసు ఉద్యోగం కత్తి మీద సాము వంటిదే. విధి నిర్వహణలో ఒక్కోసారి ప్రాణాలను సైతం ఫణంగా పెడతారు, అని ముఖ్యమంత్రి పోలీసుల సేవలను ప్రశంసించారు. విధి నిర్వహణలో పోలీసులు ఎదుర్కొంటున్న సవాళ్లు, పోలీసు సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు.
పోలీసు సంక్షేమం, ఎక్స్‌గ్రేషియా పెంపు
తెలంగాణ ప్రభుత్వం పోలీసుల సంక్షేమం కోసం అనేక చర్యలను చేపట్టిందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 16 వేల మంది కానిస్టేబుల్స్, ఎస్ఐలను రిక్రూట్ చేసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. సంఘ విద్రోహ శక్తులు, తీవ్రవాదులు, ఉగ్రవాదుల దాడుల్లో వీరమరణం పొందిన లేదా గాయపడి అంగవైకల్యం పొందిన పోలీసు సిబ్బందికి దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అత్యధిక నష్టపరిహారం అందిస్తున్నామని పేర్కొన్నారు. విధి నిర్వహణలో వీరమరణం పొందిన పోలీసు కుటుంబాలకు సంబంధించిన పథకాలను ముఖ్యమంత్రి వివరిస్తూ, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇంటి స్థలం, పిల్లలకు రెసిడెన్షియల్ స్కూళ్ళలో ఉచిత విద్య, వైద్యం, బస్ పాస్ సౌకర్యం, మెడికల్ సీట్లలో ప్రత్యేక కేటాయింపులు ఉన్నట్లు తెలిపారు. తీవ్రవాదులు, ఉగ్రవాదుల హింసలో చనిపోయిన వారికి అందించే ఎక్స్‌గ్రేషియాను ప్రభుత్వం పెంచిందని కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐల వరకు రూ. 1 కోటి ఎస్సై, సీఐలకు రూ. 1.25 కోట్లు డీఎస్పీ, అడిషనల్ ఎస్పీలకు రూ. 1.50 కోట్లు ఎస్పీలు, ఇతర ఐపీఎస్ అధికారులకు రూ. 2 కోట్లు రూపాయలకు పెంచుతూ మా ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుందని తెలిపారు.
ప్రమోద్ కుటుంబానికి ఆర్థిక సహాయం
ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా 191 మంది పోలీసు సిబ్బంది విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించగా, అందులో తెలంగాణలో ఆరుగురు పోలీసులు ఉన్నారు. 3 రోజుల కింద నిజామాబాద్ లో విధి నిర్వహణలో వీర మరణం చెందిన సీసీఎస్ కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ కుటుంబాన్ని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రమోద్ భార్య ప్రణీతకు, అతని ముగ్గురు కుమారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వారికి రూ. 1 కోటి ఎక్స్‌గ్రేషియా, అమరుడైన కానిస్టేబుల్ పదవీ విరమణ వరకు లాస్ట్ పే డ్రాన్ వేతనంతో పాటు కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 300 గజాల ఇంటి స్థలం మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. వీటితోపాటు పోలీస్ భద్రత సంక్షేమం నుండి రూ. 16 లక్షలు, పోలీస్ సంక్షేమం నుండి రూ. 8 లక్షల ఎక్స్‌గ్రేషియాను కూడా చెల్లిస్తామని తెలిపారు.
తెలంగాణ పోలీసు అకాడమీ, జైళ్ల శాఖ, ఎస్ఐబీ, ఏసీబీ, సీఐడీ, విజిలెన్స్, ఆర్మ్‌డ్ రిజర్వ్, సీసీఎస్, సైబర్ సెక్యూరిటీ బ్యూరోలకు మహిళా ఐపీఎస్‌ల సారధ్యం వహించడం, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో జోన్ డీసీపీలుగా ఏడుగురు మహిళా అధికారులు ఉండడం గర్వకారణమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పోలీసు సిబ్బంది పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందించే ఉద్దేశంతో రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌ను ప్రారంభించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ డీజీపీ బి. శివధర్ రెడ్డితో ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి పోలీసు సురక్ష రూపొందించిన "అమరులువారు" పుస్తకాన్ని ఆవిష్కరించారు.
