Let's talk: editor@tmv.in
మావోయిస్టులతో చర్చల ప్రసక్తే లేదు

మావోయిస్టులతో చర్చల ప్రసక్తే లేదు

Shaik Mohammad Shaffee
5 అక్టోబర్, 2025

మావోయిస్టులతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా శనివారం తేల్చి చెప్పారు. ఆయుధాలు వదిలిపెట్టి జనజీవన స్రవంతిలో కలవాలని వారికి పిలుపునిచ్చారు. దసరా పండుగను పురస్కరించుకొని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం నిర్వహించిన స్వదేశీ మేళా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, బస్తర్‌లో శాంతి భద్రతలకు భంగం కలిగించవద్దని హెచ్చరించారు. అలా చేస్తే రాష్ట్ర యంత్రాంగం గట్టిగా సమాధానం ఇస్తుందని స్పష్టం చేశారు. ఈ దేశం నుంచి నక్సలిజాన్ని పూర్తిగా తొలగించడానికి మార్చి 31, 2026 గడువుగా నిర్ణయించామని ఆయన ప్రకటించారు.

ఆయుధాలు వదిలి మావోయిస్టులు ప్రభుత్వ చర్చలకు వచ్చే స్వాగతిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఇలా లొంగిపోయే వారందరికీ పునరావాసం, ఇతర రకాల ప్రయోజనాలు, సౌకర్యాలు అందిస్తామని హామీ ఇచ్చారు. మావోయిస్టులు చర్చలు కోరుతున్నప్పటికీ, ఆయుధాలు వదిలొస్తేనే వారితో చర్చలు ఉంటాయని పునరుద్ఘాటించారు. ఆయుధాలతో శాంతి భద్రతలకు భంగం కలిగించే వ్యక్తులపై భద్రతా సిబ్బంది తగిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం దేశంలోనే ఉత్తమ సరెండర్ పాలసీని అమలు చేస్తోందని కేంద్ర హోం మంత్రి ప్రశంసించారు. చర్చలకు ముందుకు రాకుండా, మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల అభివృద్ధిని అడ్డుకోవడానికి చూస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. బస్తర్ అభివృద్ధికి ప్రధాన అడ్డంకి నక్సలిజమే అని, ఈ ప్రాంతంలో మావోయిజాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు కేంద్రం, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయని తెలిపారు.

నక్సల్ ఉద్యమంలో చేరవద్దని సలహా ఇస్తూ, హింస మార్గాన్ని విడనాడాలని బస్తర్‌లోని యువతకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా విజ్ఞప్తి చేశారు. నక్సలిజం ఎవరికీ ప్రయోజనం చేకూర్చదని హితవు పలికారు. నక్సల్ రహిత గ్రామాల అభివృద్ధి పనుల కోసం కోటి రూపాయలు కేటాయిస్తామని ఆయన హామీ ఇచ్చారు. గత పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్ అభివృద్ధికి రూ.4 లక్షల కోట్లకు పైగా నిధులు కేటాయించిందని, భవిష్యత్తులో మరిన్ని నిధులు మంజూరు చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.

మావోయిస్టులతో చర్చల ప్రసక్తే లేదు - Tholi Paluku