Let's talk: editor@tmv.in
మాల్దీవుల్లో యువత ధూమపానంపై నిషేధం

మాల్దీవుల్లో యువత ధూమపానంపై నిషేధం

Shaik Mohammad Shaffee
5 నవంబర్, 2025

మాల్దీవులు చరిత్ర సృష్టించింది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ‘జనరేషనల్ స్మోకింగ్ బ్యాన్‌’ (తరాల వారీ ధూమపాన నిషేధం) చట్టాన్ని అమల్లోకి తెచ్చిన దేశంగా నిలిచింది. నవంబర్‌ 1వ తేదీ నుంచి ఈ చట్టం అధికారికంగా అమలులోకి వచ్చినట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ చట్టం ప్రకారం 2007 జనవరి 1 తర్వాత జన్మించిన ఎవరైనా పొగాకు ఉత్పత్తులను కొనుగోలు చేయడం, విక్రయించడం, ఉపయోగించడం పూర్తిగా నిషేధం. ఈ నిబంధన అన్ని రకాల పొగాకు ఉత్పత్తులకే కాకుండా ఇ-సిగరెట్లు, వేపింగ్ పరికరాలకు కూడా వర్తిస్తుంది.

“యువతను పొగాకు హానికర ప్రభావాల నుంచి కాపాడటానికి ప్రభుత్వపు కట్టుబాటును ఈ నిర్ణయం ప్రతిబింబిస్తుంది” అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మాల్దీవుల పొగాకు నియంత్రణ బోర్డు ఉపాధ్యక్షుడు అహ్మద్ అఫాల్ మాట్లాడుతూ, గత సంవత్సరం అమలు చేసిన వేపింగ్‌ నిషేధం “పొగాకు రహిత తరం వైపు తీసుకున్న సానుకూల అడుగు” అని చెప్పారు.

ఈ కొత్త నిబంధన అన్ని రకాల పొగాకు ఉత్పత్తులకు వర్తిస్తుందని, విక్రేతలు అమ్మకానికి ముందు కొనుగోలుదారుల వయస్సును ధృవీకరించాల్సి ఉంటుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రోత్సహించిన “తంబాకు నియంత్రణ చట్టం”కు అనుగుణంగా ఉందని కూడా పేర్కొంది.

అఫాల్ మాట్లాడుతూ, యువతను ఆకర్షించడానికి వేపింగ్‌ పరికరాలను కంపెనీలు కొత్త మోసపూరిత పద్ధతులుగా ఉపయోగిస్తున్నాయని, ఇవి ఆరోగ్యానికి తీవ్ర హానిని కలిగిస్తాయని చెప్పారు. గత సంవత్సరం నుంచే మాల్దీవుల్లో ఎవరైనా వయస్సుతో సంబంధం లేకుండా ఇ-సిగరెట్, వేపింగ్‌ ఉత్పత్తులను దిగుమతి చేయడం, అమ్మడం, కలిగి ఉండడం లేదా ఉపయోగించడం నిషేధంగా మారింది.

పర్యాటకులు కూడా ఈ చట్టానికి లోబడాల్సి ఉంటుంది. అయితే ఈ నిషేధం పర్యాటక రంగంపై ప్రతికూల ప్రభావం చూపదని అఫాల్ పేర్కొన్నారు. “మాల్దీవులకు పర్యాటకులు పొగ తాగటానికి రారు. వారు ఇక్కడి సముద్రతీరాలు, సూర్యకాంతి, ప్రశాంత వాతావరణం కోసం వస్తారు” అని ఆయన అన్నారు. పర్యాటక గణాంకాలను ఉటంకిస్తూ, కొత్త నిబంధనల తర్వాత కూడా పర్యాటకుల సంఖ్య పెరిగిందని, వచ్చే ఏడాదిలో రెండు మిలియన్లకుపైగా పర్యాటకులను ఆశిస్తున్నామని తెలిపారు.

జరిమానాలు

ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వారికి భారీ జరిమానాలు విధించనున్నారు. మైనర్‌లకు పొగాకు ఉత్పత్తులు విక్రయించినవారికి 50,000 మాల్దీవియన్‌ రుఫియాలు (దాదాపు రూ.2.88 లక్షలు), వేపింగ్ పరికరాలు ఉపయోగించినవారికి 5,000 రుఫియాలు (రూ.28,000) జరిమానా విధించనున్నారు. కేవలం స్థానిక పౌరులకే కాదు, మాల్దీవులకు వచ్చే పర్యాటకులకూ ఈ నిషేధం వర్తిస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా ఇదే తరహా ప్రయత్నాలు

2023లో న్యూజిలాండ్‌ ప్రభుత్వం ప్రతిపాదించిన “జనరేషనల్ స్మోకింగ్ బ్యాన్‌” చట్టాన్ని కొత్త ప్రభుత్వం రద్దు చేసింది. అధిక ధూమపాన రేట్లు ఉన్న మావోరీ ప్రజలతో సహా ఆరోగ్య నిపుణులకు ఇది పెద్ద ఎదురుదెబ్బ. అలాగే, గత సంవత్సరం యునైటెడ్ కింగ్‌డమ్ మాజీ ప్రధాని రిషి సునాక్ కూడా 2009 తర్వాత పుట్టిన వారికి పొగతాగడం నిషేధించే చట్టం తీసుకురావాలని యోచించారు. ప్రస్తుత ప్రభుత్వం ఆ చట్టాన్ని ముందుకు తీసుకెళ్లి, హౌస్ ఆఫ్ కామన్స్‌ దశను పూర్తి చేసి, ప్రస్తుతం హౌస్ ఆఫ్ లార్డ్స్ కమిటీ దశలో ఉందని, త్వరలో రాజముద్ర పొందే అవకాశం ఉందని సమాచారం.

భారత్‌లో “జనరేషనల్ స్మోకింగ్ బ్యాన్” సాధ్యమా?

మాల్దీవులు తీసుకున్న “జనరేషనల్ స్మోకింగ్ బ్యాన్” విధానం ప్రజారోగ్య పరిరక్షణలో కీలక అడుగుగా ప్రశంసలు పొందుతోంది. అయితే ఇలాంటి నిషేధం భారత్‌లో అమలవుతుందా అన్నది పెద్ద ప్రశ్న.

భారతదేశంలో ధూమపానం, పొగాకు వినియోగం చాలా విస్తృతంగా ఉంది. సుమారు 26 కోట్ల మంది వివిధ రూపాల్లో పొగాకు ఉత్పత్తులను వాడుతున్నారు. బీడీలు, సిగరెట్లు, గుట్కా, ఖైనీ వంటి ఉత్పత్తులు గ్రామీణ ప్రాంతాల్లోనూ ఎక్కువగా ప్రాచుర్యం పొందాయి. అంతేకాక, లక్షలాది మంది పొగాకు సాగు, బీడీ తయారీ ద్వారా జీవనోపాధి పొందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పూర్తిస్థాయి నిషేధం అమలు చేయడం కష్టసాధ్యం.

అదనంగా వయస్సు ధృవీకరణ, చట్ట అమలు, పన్ను ఆదాయం కోత వంటి సమస్యలు కూడా ఎదురవుతాయి. అయినప్పటికీ పొగాకు వాడకం తగ్గించేందుకు భారత్‌లో చట్టాలను క్రమంగా కఠినతరం చేయడం, వయస్సు పరిమితిని పెంచడం, అవగాహన కార్యక్రమాలను బలోపేతం చేయడం వంటి చర్యలు తీసుకోవచ్చు. మొత్తంగా చెప్పాలంటే, మాల్దీవుల తరహా జనరేషనల్ బ్యాన్‌ భారత్‌లో తక్షణం సాధ్యం కాకపోయినా, దీర్ఘకాల ప్రణాళికతో “పొగాకు రహిత భారత్” దిశగా అడుగులు వేయడం మాత్రం తప్పనిసరి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 80 లక్షల మంది ధూమపానం కారణంగా మరణిస్తున్నారు. భారతదేశంలో ప్రతి ఏడాదీ 13.5 లక్షల మంది ధూమపాన సంభందిత కారణాల వల్ల మరణిస్తున్నారు.