Let's talk: editor@tmv.in
మాల్దీవుల్లో భారత్ సహాయంతో నిర్మించిన విమానాశ్రయం ప్రారంభం

మాల్దీవుల్లో భారత్ సహాయంతో నిర్మించిన విమానాశ్రయం ప్రారంభం

Shaik Mohammad Shaffee
11 నవంబర్, 2025

మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు భారత ప్రభుత్వ లైన్ ఆఫ్ క్రెడిట్ సహాయంతో నిర్మించిన హనిమాధూ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. ఈ విమానాశ్రయాన్ని ముయిజ్జు దేశంలోని ఉత్తర ప్రాంతానికి "శ్రేయస్సుకు ముఖ ద్వారం"గా అభివర్ణించారు. అధ్యక్షుడి కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఉత్తర మాల్దీవులలోని ఆర్థిక సామర్థ్యాన్ని వెలికితీయడానికి, ప్రపంచ కనెక్టివిటీని మెరుగుపరచడానికి ఈ విమానాశ్రయం ఒక ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని ముయిజ్జు తెలిపారు.

ముయిజ్జు మాట్లాడుతూ "ఇది కేవలం ఒక రవాణా సదుపాయం కాదు, ఆర్థిక పరివర్తనకు చిహ్నం" అని పేర్కొన్నారు. ఈ నూతన విమానాశ్రయం ప్రారంభం వలన ఉత్తర అటోల్స్‌లో పర్యాటకం, వ్యవసాయం, మత్స్య పరిశ్రమ, ఆర్థిక వ్యవస్థ, సామాజిక అభివృద్ధి మరింతగా పుంజుకుంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి భారత పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఇరు దేశాల సీనియర్ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు ముయిజ్జు మాట్లాడుతూ, రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం అవుతున్నాయనేందుకు ఈ విమానాశ్రయం ఒక చిహ్నమని పేర్కొన్నారు. ఈ ఏడాది ఇరు దేశాలు దౌత్య సంబంధాలకు 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాయి.

మాల్దీవులలోని భారత హైకమిషన్ తమ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ ద్వారా స్పందిస్తూ ఈ ప్రాజెక్టును "పురోగతి, శ్రేయస్సుకు ఇదొక చిహ్నం. పొరుగు వారికి తొలి ప్రాధాన్యం, మహాసాగర్ విజన్‌లో భారతదేశ నిబద్ధతకు నిదర్శనం”గా అభివర్ణించింది.

ప్రాజెక్టు వివరాలు

హనిమాధూ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టుకు నిధులు భారత ఎగ్జిమ్ బ్యాంక్ 2019లో మాల్దీవుల ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం, అందించిన 800 మిలియన్ డాలర్ల లైన్ ఆఫ్ క్రెడిట్ నుండి సమకూర్చబడ్డాయి. ఈ విమానాశ్రయ అభివృద్ధి కాంట్రాక్టును భారతదేశానికి చెందిన జేఎంసీ ప్రాజెక్ట్స్ సంస్థ 136.6 మిలియన్ డాలర్ల వ్యయంతో చేపట్టింది.

ఈ విమానాశ్రయంలో ప్రస్తుతం 2,465 మీటర్ల రన్‌వే ఉంది. కొత్తగా నిర్మించిన 10,380 చదరపు మీటర్ల ప్రయాణికుల టెర్మినల్ సంవత్సరానికి 1.3 మిలియన్ల మంది ప్రయాణికులను నిర్వహించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇక్కడ అటాల్‌లో మొట్టమొదటి ఏరోబ్రిడ్జ్ సౌకర్యం కూడా ఉంది.

ద్వైపాక్షిక సహకారంపై చర్చ

ప్రారంభోత్సవానికి ముందు భారత పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, మాల్దీవుల విదేశాంగ మంత్రి డాక్టర్ అబ్దుల్లా ఖలీల్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఖలీల్ భారతదేశం అందిస్తున్న నిరంతర మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇరు మంత్రులు ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి, కనెక్టివిటీని మెరుగుపరచడానికి, పరస్పరం ప్రయోజనకరమైన అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడానికి తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు. కాగా ఈ ప్రాజెక్టుతో ఉత్తర మాల్దీవుల్లో పర్యాటకం మెరుగుపడి, స్థానిక ఆర్థిక వృద్ధికి, ఉపాధి అవకాశాలకు పెద్దపీట వేయబడుతుందని భావిస్తున్నారు.

మాల్దీవుల్లో భారత్ సహాయంతో నిర్మించిన విమానాశ్రయం ప్రారంభం - Tholi Paluku