Let's talk: editor@tmv.in
మాల్దాలో అసలు నిందితులు తప్పించుకున్నారు: మమతా బెనర్జీ

మాల్దాలో అసలు నిందితులు తప్పించుకున్నారు: మమతా బెనర్జీ

Pinjari Chand
5 ఏప్రిల్, 2026

మాల్దా జిల్లా మోతాబారి ప్రాంతంలో న్యాయాధికారుల గెరావో ఘటనలో అసలు నిందితులు తప్పించుకున్నారని, ఇప్పుడు దర్యాప్తు సంస్థలు అమాయకులైన స్థానికులను వేధిస్తున్నాయని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. మాల్దాలోని మణిక్‌చక్‌లో జరిగిన ఎన్నికల సభలో మాట్లాడిన ఆమె, ఈ కేసు దర్యాప్తు కోసం నియమించిన ఎన్‌ఐఏ పేరుతో స్థానికులను వేధిస్తున్నారని విమర్శించారు. ఈ ఘటనకు బాధ్యులైన రెండు మతపర పార్టీలు న్యాయమూర్తులను గెరావో చేసి తప్పించుకున్నాయని, ఇప్పుడు సుమారు 50 మంది అమాయకులను విచారణ పేరుతో అదుపులోకి తీసుకున్నారని ఆమె అన్నారు. ఇదిలా ఉండగా, ఓటర్ల జాబితాలో నుంచి పేర్లు తొలగించిన అంశంపై ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన మమతా, న్యాయాధికారులను గెరావో చేయకుండా ట్రైబ్యునల్‌లకు దరఖాస్తు చేసి తమ పేర్లు తిరిగి చేర్చించుకోవాలని సూచించారు. ఎన్నికల జాబితా నుంచి పొరపాటున తొలగించిన పేర్లను మళ్లీ చేర్చేందుకు పార్టీ నేతలు ప్రజలకు సహాయం చేయాలని తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలకు ఆదేశించారు.

దమ్ముంటే ప్రజలను కలవాలి

కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను ఉద్దేశిస్తూ, ఎన్నికల జాబితా ప్రక్షాళన పేరుతో ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని ఆరోపించారు. మాల్దాకు వచ్చి పేర్లు తొలగించిన ప్రజలను కలవాలని ఆయనకు సవాల్ విసిరారు. ఈ నిర్ణయానికి ప్రజల ముందు బీజేపీ క్షమాపణ చెప్పాలని కూడా అన్నారు. ఎన్నికల అనంతరం ఈవీఎంలు, వీవీప్యాట్‌ యంత్రాలను మహిళలు కాపాడాలని మమతా పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు రాష్ట్రంలో డబ్బు అక్రమంగా తరలిస్తున్నారని కూడా ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగా హింసను రెచ్చగొట్టి తర్వాత కేంద్ర దర్యాప్తు సంస్థలను వినియోగించి ప్రజలను అరెస్ట్ చేయాలనే బీజేపీ ప్రయత్నిస్తోందని ఆమె అన్నారు.

ఇదే సమయంలో గాజోల్‌లో జరిగిన మరో సభలో వక్ఫ్ చట్టంపై తప్పుడు ప్రచారం జరుగుతోందని మమతా అన్నారు. చట్టం అమలుకు వ్యతిరేకంగా తాము పోరాడినట్లు ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ విషయం ఇమామ్‌ల పరిధిలో ఉందని తెలిపారు. ముర్షీదాబాద్ జిల్లాలో 2025 ఏప్రిల్‌లో వక్ఫ్ సవరణ చట్టం అమలుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున హింస జరిగిన విషయం తెలిసిందే. అనంతరం 2025 నవంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఆ చట్టాన్ని అమలు చేయడానికి అంగీకరించి, రాష్ట్రంలోని 82 వేలకుపైగా వక్ఫ్ ఆస్తుల వివరాలను కేంద్ర ప్రభుత్వ ఉమీద్‌ పోర్టల్లో నమోదు చేయాలని అధికారులకు ఆదేశించింది.

మాల్దా జిల్లా మోతాబారి ప్రాంతంలో ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించినందుకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలో స్థానిక బీడీఓ కార్యాలయంలో ఏడుగురు న్యాయాధికారులను బందీలుగా ఉంచగా, మరొకరిని వాహనంలో సుమారు తొమ్మిది గంటల పాటు నిర్బంధించారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు 35 మందిని రాష్ట్ర క్రిమినల్‌ ఇన్వెస్టిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌ (సీఐడీ) అరెస్టు చేసింది. ఈ ఘటనపై సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తును ఎన్‌ఐఏకు అప్పగించినట్లు ఎన్నికల సంఘం తెలిపింది.