
మాల్టాలో భారత్ తదుపరి హైకమిషనర్‌గా రచితా భండారి
మాల్టా రిపబ్లిక్‌లో భారత తదుపరి హైకమిషనర్‌గా సీనియర్ దౌత్యవేత్త రచితా భండారి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. 2005 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారిణి అయిన రచిత, ప్రస్తుతం విదేశీ వ్యవహారాల శాఖలో జాయింట్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆమె త్వరలోనే మాల్టాలో బాధ్యతలను చేపట్టనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
భారత్-మాల్టా మధ్య చిరకాల మైత్రి
భారతదేశం, మాల్టా దేశాల మధ్య స్నేహం దశాబ్దాల నాటిది . 1964లో మాల్టాకు స్వాతంత్ర్యం వచ్చినప్పుడు, ఆ దేశాన్ని గుర్తించిన మొదటి దేశాలలో భారత్ ఒకటి. ఈ రెండు దేశాల మధ్య 1965 నుంచే అధికారిక సంబంధాలు మొదలయ్యాయి. మాల్టా దేశం 2007లోనే ఢిల్లీలో తన రాయబార కార్యాలయాన్ని (హైకమిషన్) ఏర్పాటు చేయడమే కాకుండా, దేశంలోని కోల్‌కతా, చెన్నై, ముంబై నగరాల్లో కూడా తన సేవలను అందిస్తోంది. అలాగే, భారత్ కూడా 2017లో మాల్టాలో తన కార్యాలయాన్ని తెరిచి, 2018 నుంచి అక్కడి భారతీయులకు పూర్తిస్థాయిలో సేవలు అందిస్తోంది.
విడదీయలేని సాంస్కృతిక అనుబంధం
భారతదేశం-మాల్టా దేశాల మధ్య 1992 నుంచి కొనసాగుతున్న సాంస్కృతిక ఒప్పందం ద్వారా ఇరు దేశాల ప్రజల మధ్య అనుబంధం మరింత బలపడుతోంది. మాల్టాలో మహాత్మా గాంధీ విగ్రహం ఉండటం, బాపూజీ 150వ జయంతికి ఆ దేశం ప్రత్యేక పోస్టల్ స్టాంపులు విడుదల చేయడం భారత్ పట్ల వారికన్న గౌరవానికి నిదర్శనం. ప్రతి ఏటా అక్కడ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. అంతేకాకుండా, భారతీయ చలనచిత్ర ఉత్సవాలు, భారత్‌కు చెందిన 'అస్తిత్వ' వంటి సంగీత బృందాల ప్రదర్శనలు, భారతీయ ఆహార వేడుకల ద్వారా భారత సంస్కృతి మాల్టాలో ప్రతిధ్వనిస్తోంది.
విస్తరిస్తున్న భారత సంతతి
మాల్టాలో భారత సంతతి ప్రజల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం అక్కడ దాదాపు 18,000 మంది భారతీయులు నివసిస్తున్నట్లు అంచనా. కేవలం ఆరోగ్య రంగమే కాకుండా.. హాస్పిటాలిటీ, నిర్మాణం, ఐటీ వంటి కీలక రంగాల్లో భారతీయులు తమ ప్రతిభను చాటుతున్నారు. మాల్టా మలయాళీ అసోసియేషన్, తమిళ సంఘం, బెంగాలీ, గుజరాతీ సంఘాల వంటి పలు సంస్థలు అక్కడ భారతీయ సంస్కృతిని కాపాడుతూ సమిష్టిగా వేడుకలు జరుపుకుంటున్నాయి.
