
మాలీలో భారతీయుల కిడ్నాప్.. విడుదలకు ఎంబసీ తీవ్ర ప్రయత్నాలు
పశ్చిమ ఆఫ్రికా దేశమైన మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ వార్త కలకలం రేపింది . నవంబర్ 6, 2025న (గురువారం) పశ్చిమ మాలిలోని కోబ్రి ప్రాంతం సమీపంలో విద్యుదీకరణ ప్రాజెక్టులో పనిచేస్తున్న ఐదుగురు భారతీయ పౌరులను సాయుధ దుండగులు కిడ్నాప్ చేశారు. దేశంలో అశాంతి, ఉగ్రవాద హింస పెరిగిపోతున్న తరుణంలో జరిగిన ఈ ఘటన తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది.
ఈ దురదృష్టకర సంఘటనను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సోమవారం అధికారికంగా ధృవీకరించింది. కిడ్నాప్‌నకు గురైన వారిని సురక్షితంగా తిరిగి తీసుకురావడానికి తక్షణ దౌత్య ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలిపింది. మాలి రాజధాని బమాకోలోని భారత రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా స్పందిస్తూ "నవంబర్ 6న జరిగిన ఐదుగురు మన జాతీయుల కిడ్నాప్ దురదృష్టకర సంఘటన గురించి రాయబార కార్యాలయానికి తెలుసు. వీలైనంత త్వరగా వారిని సురక్షితంగా విడుదల చేయడానికి మాలియన్ అధికారులు, సంబంధిత కంపెనీతో సన్నిహితంగా పనిచేస్తోంది" అని పేర్కొంది. ఈ పోస్ట్‌లో విదేశాంగ శాఖ, పీఎంవో ఇండియాలను ట్యాగ్ చేయడం ద్వారా ఈ విషయం ప్రభుత్వంలోని అత్యున్నత స్థాయిలో పర్యవేక్షించబడుతోందని స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, బమాకోలోని రాయబార కార్యాలయం మాలియన్ భద్రతా సంస్థలతో "నిరంతర సంప్రదింపులు" జరుపుతోంది. విదేశాంగ శాఖ ప్రధాన కార్యాలయం ఇతర విదేశీ మిషన్లు, ఈ ప్రాంత భద్రతా పరిస్థితిపై అవగాహన ఉన్న అంతర్జాతీయ భాగస్వాములతో కూడా సమన్వయం చేసుకుంటోంది. "వీలైనంత త్వరగా వారి విడుదలకు అవసరమైన అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి" అని విదేశాంగ శాఖ ప్రకటించింది. పరిస్థితిని "నిశితంగా, నిరంతరం" పర్యవేక్షిస్తూనే ఉన్నట్లు కూడా తెలిపింది.
కిడ్నాప్ వివరాలు
భద్రతా వర్గాలు, కంపెనీ ప్రతినిధుల ద్వారా అందిన వివరాల ప్రకారం, కిడ్నాప్‌నకు గురైన ఐదుగురు భారతీయులు కోబ్రి ప్రాంతంలో ఒక విద్యుదీకరణ ప్రాజెక్టుకు సంబంధించి స్థానికంగా పనిచేస్తున్న కంపెనీ ఉద్యోగులు. గురువారం ఆయుధాలు ధరించిన దుండగులు ఈ ఉద్యోగులపై అకస్మాత్తుగా దాడి చేసి, తుపాకులతో బెదిరించి వారిని అపహరించుకుపోయారు. ఈ ఘటన నేపథ్యంలో, ఆ కంపెనీలో పనిచేసే మిగతా భారతీయ ఉద్యోగులందరినీ ముందుజాగ్రత్త చర్యగా వెంటనే రాజధాని బమాకోలోని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు కంపెనీ ప్రతినిధి ధృవీకరించారు. అయితే కిడ్నాప్‌నకు గురైన బాధితుల పూర్తి వివరాలను మాత్రం కంపెనీ వెల్లడించలేదు.
ఈ కిడ్నాప్‌నకు బాధ్యత వహిస్తున్నట్లు ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించనప్పటికీ, దీని వెనుక అల్-ఖైదా, ఇస్లామిక్ స్టేట్ వంటి సంస్థలతో సంబంధం ఉన్న ఉగ్రవాద గ్రూపుల కోసం పనిచేసే క్రిమినల్ గ్యాంగ్‌ల హస్తం ఉండవచ్చని స్థానిక పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇటీవలి కాలంలో మాలిలో భద్రతా పరిస్థితులు తీవ్రమవుతున్న నేపథ్యంలో రాజధాని బమాకో చుట్టుపక్కల అల్‍ఖైదా అనుబంధ ఉగ్రవాద గ్రూప్ తమ ప్రభావాన్ని పెంచుకుంటోంది.
జమాత్ నుస్రత్ అల్ ఇస్లామ్ వల్ ముస్లిమిన్ (జేఎన్‌ఐఎం) అనే ఈ గ్రూప్ రహదారులపై, ఇంధన రవాణా వాహనాలపై, భద్రతా దళాలపై దాడులను పెంచి దేశ రాజధాని బమాకో చుట్టూ తన పట్టును బిగిస్తోంది. ఉగ్రవాదులు కీలక సరఫరా మార్గాలను మూసివేయడం, ట్యాంకర్ ట్రక్కులపై దాడి చేయడం, సైనిక పెట్రోలింగ్‌లపై దాడి చేయడంతో బమాకోలో ఇంధన కొరత ప్రారంభమైంది.
సీఎన్ఎన్ ప్రకారం, అమెరికా, ఇంగ్లాండ్, జర్మనీ వంటి దేశాలు తమ పౌరులకు మాలిని వీలైనంత త్వరగా విడిచిపెట్టాలని సూచిస్తూ అత్యవసర హెచ్చరికలు జారీ చేశాయి. గత వారం యుకే ప్రభుత్వం తన పౌరులకు “భద్రంగా అనిపిస్తే వాణిజ్య విమానాల ద్వారా వెంటనే దేశం విడిచిపెట్టండి” అని సూచించింది. అమెరికా విదేశాంగ శాఖ కూడా అమెరికన్లను మాలి విడిచిపెట్టాలని సూచించింది.
సీఎన్ఎన్ నివేదిక ప్రకారం, ఇటీవలే జేఎన్‌ఐఎం ఉగ్రవాదులు ఐవరీ కోస్ట్ నుండి వస్తున్న 100కి పైగా ఇంధన ట్యాంకర్ల కాన్వాయ్‌పై దాడి చేసి, వాటిలో సగానికి పైగా వాహనాలకు నిప్పంటించారు. 2017లో స్థాపించబడిన ఈ అల్‍ఖైదా అనుబంధ సంస్థ ఇప్పుడు మాలి, మొత్తం సాహెల్ ప్రాంతం అంతటా తన ప్రభావాన్ని విస్తరించింది. వీరు తరచుగా విదేశీ కార్మికులు, సహాయ సంస్థల సిబ్బంది, పారిశ్రామిక ప్రాంతాలపై దాడి చేస్తుంటారు.
మాజీ ఫ్రెంచ్ కాలనీ అయిన మాలిలో గత కొన్నేళ్లుగా హింస, సైనిక తిరుగుబాట్లు, రాజకీయ గందరగోళం కొనసాగుతోంది. 2021 నుండి రష్యా “వాగ్నర్ గ్రూప్” మాలీ సైన్యంతో కలిసి పనిచేస్తున్నప్పటికీ, హింసను అణచడంలో విఫలమైంది.
గత జూలైలో పశ్చిమ మాలిలోని కేయ్స్ ప్రాంతంలో ఉన్న డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీపై ఉగ్రదాడి జరిగిన తర్వాత, ముగ్గురు భారతీయులు కిడ్నాప్‌నకు గురైనట్లు భారత విదేశాంగ మంత్రిత్వశాఖ ధృవీకరించింది. ఆ సమయంలో భారత్ ఈ ఘటనను “తీవ్రంగా ఖండించి”, మాలీ ప్రభుత్వాన్ని వారి విడుదల కోసం చర్యలు తీసుకోవాలని కోరింది. “విదేశాల్లో ఉన్న భారతీయ పౌరుల భద్రత, రక్షణ, సంక్షేమం భారత ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన విషయం” అని మంత్రిత్వశాఖ పేర్కొంది. మాలీలో ఉన్న భారతీయులు జాగ్రత్తగా ఉండాలని, బమాకోలోని భారత రాయబార కార్యాలయంతో నిరంతరం సంప్రదింపులో ఉండాలని సూచించింది. ఈ తాజా ఘటనతో ఈ ఏడాదిలో మాలిలో కిడ్నాప్ చేయబడిన భారతీయుల సంఖ్య ఎనిమిదికి చేరింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ప్రస్తుతం మాలిలో దాదాపు 600 మంది భారతీయులు ఉన్నారని అంచనా. వీరిలో ఎక్కువ మంది నిర్మాణ, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో పనిచేస్తున్నారు.
