Let's talk: editor@tmv.in
మార్చి 9 నుంచి ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ

మార్చి 9 నుంచి ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ

Panthagani Anusha
25 ఫిబ్రవరి, 2026

భారతీయ వాయుసేనలో కొలువుదీరాలనుకునే తెలుగు రాష్ట్రాల యువతకు సువర్ణావకాశం లభించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన మహిళా, పురుష అభ్యర్థుల కోసం 'అగ్నివీర్ వాయు' ఓపెన్ రిక్రూట్‌మెంట్ ర్యాలీని మార్చి 9వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు. గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ప్రాంగణం ఈ భారీ ఎంపిక ప్రక్రియకు వేదిక కానుంది.

మూడు విడతల్లో ఎంపిక ప్రక్రియ

హైదరాబాద్ ఎయిర్ ఫోర్స్ రిక్రూటింగ్ డైరెక్టర్ వింగ్ కమాండర్ షేక్ యాకూబ్ అలీ మాట్లాడుతూ అభ్యర్థులు తమ కేటగిరీని బట్టి నిర్ణీత తేదీల్లో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల లోపు రిపోర్ట్ చేయాలని సూచించారు. మార్చి 9, 10 తేదీలలో రెండు రాష్ట్రాల మహిళా అభ్యర్థులకు, మార్చి 12, 13 తేదీలలో ఆంధ్రప్రదేశ్ పురుష అభ్యర్థులకు చివరగా మార్చి 15, 16 తేదీలలో తెలంగాణ పురుష అభ్యర్థులకు ఓపెన్ ర్యాలీ నిర్వహించనున్నారు. దేశ సేవ చేయాలనే తపన ఉన్న యువతకు ఇది ఒక మంచి వేదిక అని ఆయన పేర్కొన్నారు.

వయోపరిమితి, విద్యార్హతలు

ఈ ర్యాలీలో పాల్గొనే అభ్యర్థులు 2005 జూలై 2 నుంచి 2009 జనవరి 2వ తేదీ మధ్య జన్మించిన వారై ఉండాలి. అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు మాత్రమే దీనికి అర్హులు. విద్యార్హతల విషయానికొస్తే.. ఇంటర్మీడియట్ (10+2) లేదా తత్సమాన పరీక్షలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. అదేవిదంగా ఇంగ్లీష్ సబ్జెక్టులో తప్పనిసరిగా 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. మూడేళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా లేదా రెండేళ్ల వొకేషనల్ కోర్సు చేసిన వారు కూడా హాజరుకావచ్చు. అభ్యర్థుల కనీస ఎత్తు 152 సెం.మీ. ఉండాలని అధికారులు స్పష్టం చేశారు.

ఎంపిక విధానం ఇలా..

అభ్యర్థులకు ముందుగా 1.6 కిలోమీటర్ల పరుగు పందెం, ఆపై ఇతర శారీరక దారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. వీటిలో అర్హత సాధించిన వారికి రాత పరీక్ష ఉంటుంది. రాత పరీక్ష ప్రశ్న పత్రం ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఉంటుందని నెగిటివ్ మార్కింగ్ (ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత) అమలులో ఉంటుందని అధికారులు తెలిపారు. శారీరక సామర్థ్యంతో పాటు మేధస్సును కూడా పరీక్షించే విధంగా ఈ ఎంపికలు ఉంటాయని వెల్లడించారు.

నేరుగా ర్యాలీకి హాజరుకావచ్చు

ఈ ర్యాలీకి ఎలాంటి ముందస్తు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ అవసరం లేదని, అభ్యర్థులు నేరుగా నిర్ణీత తేదీల్లో హాజరుకావచ్చని జాయింట్ కలెక్టర్ తెలిపారు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఆధార్ కార్డు, నివాస ధృవీకరణ పత్రం 10 పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు, ప్రతి సర్టిఫికెట్‌కు సంబంధించి 6 సెట్ల జిరాక్స్ కాపీలు తీసుకురావాలి. ఈ సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి ఖాజావలి డీఎంహెచ్‌ఓ విజయలక్ష్మి, రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ సీతారామి రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.