Let's talk: editor@tmv.in
మార్చి 3న చంద్రగ్రహణం: శ్రీవారి ఆలయం మూసివేత

మార్చి 3న చంద్రగ్రహణం: శ్రీవారి ఆలయం మూసివేత

Panthagani Anusha
5 జనవరి, 2026

వచ్చే మార్చి 3వ తేదీన సంభవించనున్న చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయ తలుపులను సుమారు 10 గంటల పాటు మూసివేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం గ్రహణ సమయంలో ఆలయంలో నిత్య కైంకర్యాలను నిలిపివేయాల్సి ఉండటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. మార్చి 3వ తేదీ మధ్యాహ్నం 3.20 గంటలకు ప్రారంభమయ్యే చంద్రగ్రహణం సాయంత్రం 6.47 గంటలకు ముగియనుంది. దాదాపు మూడున్నర గంటల పాటు ఈ చంద్రగ్రహణం కొనసాగనుంది.

సాధారణంగా గ్రహణం ప్రారంభానికి ఆరు గంటల ముందుగానే ఆలయ ద్వారాలను మూసివేయడం తిరుమలలో అనాదిగా వస్తున్న ఆనవాయితీ. దీని ప్రకారం మార్చి 3వ తేదీ ఉదయం 9 గంటలకే ఆలయ తలుపులను మూసివేస్తారు. తిరిగి సాయంత్రం 7.30 గంటలకు తలుపులు తెరిచి ఆలయ శుద్ధి, పుణ్యహవచనం వంటి వైదిక కార్యక్రమాలను అర్చకులు నిర్వహిస్తారు. ఈ సంప్రోక్షణ ప్రక్రియలన్నీ పూర్తయిన తర్వాతే అంటే రాత్రి 8.30 గంటల నుంచి భక్తులను సర్వదర్శనానికి అనుమతించనున్నారు.

గ్రహణం కారణంగా ఆ రోజున స్వామివారికి నిర్వహించే పలు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. ఇందులో భాగంగా మంగళవారం నాటి అష్టదళ పాదపద్మారాధన సేవతో పాటు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలు నిలిపివేశారు. ఈ సేవలకు సంబంధించి ముందుగానే టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు తదుపరి సూచనలను త్వరలోనే ప్రత్యేకంగా తెలియజేస్తామని అధికారులు స్పష్టం చేశారు.

తిరుమలకు వచ్చే భక్తులు ఈ సమయ మార్పులను గమనించి అందుకు అనుగుణంగా తమ యాత్ర ప్రణాళిక చేసుకోవాలని టీటీడీ ప్రజా సంబంధాల అధికారి విజ్ఞప్తి చేశారు. గ్రహణ సమయం ముగిసి ఆలయ శుద్ధి కార్యక్రమాలు పూర్తయ్యే వరకు భక్తులు సహకరించాలని కోరారు.