Let's talk: editor@tmv.in
మార్చి 28 నుంచి ఐపీఎల్

మార్చి 28 నుంచి ఐపీఎల్

Shaik Mohammad Shaffee
9 మార్చి, 2026

క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్ కౌంట్‌డౌన్ మొదలైంది . టాటా ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 28న అట్టహాసంగా ప్రారంభం కానుంది. వాస్తవానికి ఈ టోర్నీని మార్చి 26 నుంచే ప్రారంభించాలని భావించినప్పటికీ, అస్సాం, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రెండు రోజుల పాటు వాయిదా వేశారు. దీంతో మార్చి 28 నుంచి మే 31 వరకు సుమారు రెండు నెలల పాటు క్రికెట్ అభిమానులను ఈ మెగా టోర్నీ అలరించనుంది.

బెంగళూరు వేదికగా తొలి సమరం

ఈసారి ఐపీఎల్ తొలి మ్యాచ్‌కు బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియం వేదిక కానుంది. గత సీజన్ విజేతగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో సొంత గడ్డపై ఆరంభ పోరులో తలపడనుంది. మొత్తం 10 జట్ల మధ్య 74 మ్యాచ్‌ల పాటు సాగే ఈ మెగా టోర్నీని ఐదు వారాల స్వల్ప వ్యవధిలో అత్యంత వేగంగా నిర్వహించేలా షెడ్యూల్‌ను రూపొందించారు. కొత్త సమీకరణాలతో బరిలోకి దిగుతున్న జట్ల మధ్య పోరు ఆసక్తికరంగా మారనుంది.

మినీ వేలం తర్వాత సరికొత్త జోరు

డిసెంబర్ 2025లో జరిగిన మినీ వేలం తర్వాత స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, ఎం.ఎస్. ధోనీ, రోహిత్ శర్మ తమ సరికొత్త వ్యూహాలతో సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా ధోనీ ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ తొలి మ్యాచ్ ఎవరితో ఆడుతుందనే దానిపై సోషల్ మీడియాలో భారీ చర్చ నడుస్తోంది. అటు కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా తమ జోరు చూపేందుకు సిద్ధమంటూ సంకేతాలిస్తోంది. పూర్తిస్థాయి షెడ్యూల్ త్వరలోనే విడుదల కానుండటంతో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల దృష్ట్యా భద్రతా పరమైన ఇబ్బందులు లేకుండా బీసీసీఐ ఈ మార్పులు చేపట్టింది.