Let's talk: editor@tmv.in
మార్చి 16 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

మార్చి 16 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

Gaddamidi Naveen
25 ఫిబ్రవరి, 2026

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సోమవారం సమావేశమై శాసనసభ బడ్జెట్ సమావేశాలను మార్చి 16 నుంచి నిర్వహించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని సమాచార, ప్రజాసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమావేశానంతరం మీడియాకు వెల్లడించారు. సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమవుతాయని, మార్చి 20న రాష్ట్ర బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.

ఇక మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది ఇలా...

• మార్చి 31లోపు హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును ఎల్ అండ్ టి సంస్థ నుంచి పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని నిర్ణయించింది.

• ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం ప్రమాద బీమా పథకాన్ని అమలు చేయనుంది. ప్రమాద మరణం సంభవించిన పక్షంలో కుటుంబానికి రూ.1.2 కోట్లు ఆర్థిక సహాయం అందించనుంది. అదనంగా, ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసం రూ.528 కోట్ల నిధితో ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటు చేసి, ప్రభుత్వం, ఉద్యోగులు సమానంగా వాటా చెల్లించే విధంగా క్యాష్‌లెస్ ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. 3.56 లక్షల ఉద్యోగులు, 2.88 లక్షల పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు కలిపి 17.07 లక్షల మందికి ఈ పథకం వర్తిస్తుంది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు 652 ప్రైవేట్ ఎంపానెల్ ఆసుపత్రుల్లో 1998 రకాల చికిత్సలు ఉచితంగా అందుబాటులో ఉంటాయి.

• మ‌హ‌బూబాబాద్ జిల్లా మ‌హ‌బూబాబాద్ మండ‌లం గుమ్మ‌డూరులో జేఎన్టీయూ అధ్వర్యంలోని ఇంజనీరింగ్ కాలేజీకి 70 ఎక‌రాలు, శాత‌వాహ‌న యూనివ‌ర్సిటీ ఆధ్వ‌ర్యంలో ఇంజినీరింగ్ కాలేజీ నిర్మాణానికి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండ‌లం ఉమ్మాపూర్‌లో 36 ఎక‌రాలు. మరో 21 అసెంబ్లీ నియోజకవర్గాలకు కొత్తగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి భూముల కేటాయింపు ఏర్పాటు చేయనున్నారు.

• భ‌ద్రాచ‌లంలో గ్రీన్‌ఫీల్డ్ మినీ స్టేడియం నిర్మాణానికి 5 ఎక‌రాల భూమి కేటాయింపు.

• తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఆధ్వ‌ర్యంలో శ్రీ‌ వేంక‌టేశ్వ‌ర‌స్వామి దివ్య క్షేత్రం నిర్మాణానికి ఖ‌మ్మం అర్బ‌న్ మండ‌లం ధంస‌లాపురం గ్రామంలో 20 ఎక‌రాలు కేటాయించింది. క‌రీంన‌గ‌ర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో పంచ‌ముఖ ఆంజ‌నేయ స్వామి ఆల‌యం నిర్మాణానికి 3.12 ఎక‌రాల దేవాదాయ శాఖ‌కు కేటాయించింది.

• క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా 300 మెగావాట్ల విద్యుత్తు వినియోగించే డేటా సెంటర్లకు రెన్యుబుల్ ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ జారీ జరిచేసింది.

ఈ నిర్ణయాలు రాష్ట్ర ప్రగతికి, ఉద్యోగుల భద్రతకు మైలురాళ్లుగా నిలుస్తాయని మంత్రిమండలిలో పేర్కొన్నారు.