Let's talk: editor@tmv.in
మార్చి 13న పీఎం–కిసాన్ విడుదల

మార్చి 13న పీఎం–కిసాన్ విడుదల

Pinjari Chand
11 మార్చి, 2026

ప్రధాని నరేంద్రమోడీ మార్చి 13న ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం–కిసాన్) పథకం కింద 22వ విడత నిధులను విడుదల చేయనున్నారు. అస్సాంలోని గువాహటి నుంచి ఈ మొత్తాన్ని డిజిటల్ విధానంలో రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ విడతలో దేశవ్యాప్తంగా సుమారు 9.32 కోట్ల మంది రైతులకు రూ.19,000 కోట్లు నేరుగా బదిలీ కానున్నాయని వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారి తెలిపారు. 2019 ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ పథకం కింద ప్రతి రైతుకు సంవత్సరానికి రూ.6,000ను మూడు విడతలుగా అందిస్తున్నారు. సాధారణంగా ఈ విడతలు ఫిబ్రవరి/మార్చి, జూన్/జూలై, అక్టోబర్ నెలల్లో విడుదల అవుతాయి. రాబోయే ఖరీఫ్ విత్తనాల సీజన్‌కు ముందు ఈ నిధులు విడుదల కావడంతో రైతులు విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు వంటి వ్యవసాయ అవసరాల కోసం ఉపయోగించుకునే అవకాశముందని అధికారులు తెలిపారు.

ఇప్పటివరకు విడుదలైన విడతల్లో

19వ విడత – 2025 ఫిబ్రవరిలో రూ.22,000 కోట్లు (9.8 కోట్ల రైతులకు)

20వ విడత – 2025 ఆగస్టులో రూ.20,500 కోట్లు (9.7 కోట్ల రైతులకు)

21వ విడత – 2025 నవంబరులో రూ.18,000 కోట్లు (9 కోట్ల రైతులకు)

21వ విడత వరకు మొత్తం సుమారు రూ.4.09 లక్షల కోట్లు రైతుల ఖాతాల్లో జమయ్యాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇది వ్యవసాయ రంగంలో ప్రభుత్వానికి ఉన్న ప్రధాన డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ) పథకాలలో ఒకటిగా కొనసాగుతోంది.