
మార్చి 12న ఐపీఎల్ తొలి విడత షెడ్యూల్!
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 19వ సీజన్ షెడ్యూల్ విడుదలకు ముహూర్తం ఖరారైంది. మొదటి 20 రోజులకు సంబంధించిన మ్యాచ్‌ల వివరాలను మార్చి 12వ తేదీ లోపు ప్రకటించనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా వెల్లడించారు. అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా, భద్రతా కారణాల రీత్యా ఈసారి షెడ్యూల్‌ను విడతల వారీగా విడుదల చేయాలని బోర్డు నిర్ణయించింది. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల హోమ్ మ్యాచ్‌ల నిర్వహణపై ఎన్నికల ప్రభావం పడే అవకాశం ఉన్నందున అధికారులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
మే 31 వరకు క్రికెట్ పండుగ
మార్చి 28న ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీ మే 31 వరకు సుమారు రెండు నెలల పాటు అలరించనుంది. ఈ సీజన్‌లో ప్రతి జట్టు 16 మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉందన్న ఊహాగానాలు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరోసారి టైటిల్‌ను నిలబెట్టుకోవాలని పట్టుదలతో ఉండగా, విరాట్ కోహ్లీ, ఎం.ఎస్. ధోనీ వంటి దిగ్గజ ఆటగాళ్లను మైదానంలో చూసేందుకు ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
చిన్నస్వామి స్టేడియంలో ఫైనల్ పోరు
గతేడాది ఐపీఎల్ విజేతగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. ఈసారి బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియం ఐదు హోమ్ మ్యాచ్‌లకు వేదిక కానుంది. అంతేకాకుండా ఈ సీజన్ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌తో పాటు ఒక ప్లే-ఆఫ్ మ్యాచ్ కూడా బెంగళూరులోనే నిర్వహించనున్నట్లు కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సంతోష్ మీనన్ ధృవీకరించారు. అయితే ఆర్‌సీబీకి చెందిన మిగిలిన రెండు హోమ్ మ్యాచ్‌లు మాత్రం ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో గల షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనున్నాయి.
ఏడాది తర్వాత ముస్తాబవుతున్న బెంగళూరు
గత ఐపీఎల్ సీజన్ (2025)లో ఆర్‌సీబీ టైటిల్ గెలిచిన వేడుకల సందర్భంగా చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. ఈ విషాద ఘటన నేపథ్యంలో గతేడాది జూన్ నుంచి ఈ స్టేడియంపై నిషేధం కొనసాగింది. ఫలితంగా మహిళల ప్రపంచకప్, ఇటీవల ముగిసిన పురుషుల టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లకు ఈ స్టేడియం ఆతిథ్యం ఇవ్వలేకపోయింది. ఇప్పుడు సుదీర్ఘ విరామం తర్వాత ఐపీఎల్ ఫైనల్ వంటి మెగా మ్యాచ్‌తో ఈ చారిత్రక స్టేడియం మళ్ళీ క్రికెట్ కేళీకి సిద్ధమవుతోంది.
తొలి మ్యాచ్‌పై ఉత్కంఠ.. పుకార్లకి చెక్
సీజన్ ఆరంభ పోరు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్‌సీబీ, సీఎస్‌కే జట్ల మధ్య జరగనుందంటూ సామాజిక మాధ్యమాల్లో కొన్ని స్క్రీన్ షాట్లు వైరల్ అయ్యాయి. అయితే సీనియర్ జర్నలిస్ట్ అమోల్ కర్హద్కర్ వీటిని ఖండించారు. అధికారిక షెడ్యూల్ రాకముందే ప్రచారంలో ఉన్న ఆ స్క్రీన్ షాట్లు నకిలీవని ఆయన స్పష్టం చేశారు. స్టేడియం పునఃప్రారంభం అవుతున్న నేపథ్యంలో తొలి మ్యాచ్ ఇక్కడే ఉండొచ్చన్న అంచనాలు ఉన్నప్పటికీ, బోర్డు ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
