
మార్చి 10 నాటికి అస్సాం సీట్ల పంపకాన్ని ఎన్డీయే ఖరారు చేస్తుంది: సీఎం హిమంత బిశ్వ
అస్సాం అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ, అధికార ఎన్డీయే కూటమిలో సీట్ల పంపకం ఒప్పంద వ్యవహారం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే సీట్ల పంపిణీ ఒక కొలిక్కి వచ్చిందని గతంలో ప్రకటించిన ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, తాజాగా ఈ ప్రక్రియ పూర్తి కావడానికి మార్చి 10 నాటికి ఖరారు చేయాలని నిర్ణయించారు. గువాహటిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కూటమిలోని భాగస్వామ్య పక్షాలతో చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని వెల్లడించారు.
బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (బీపీఎఫ్)తో చర్చలు ఒకటి రెండు రోజుల్లో ముగుస్తాయని, అసోం గణ పరిషత్ (ఏజీపీ)తో మార్చి 9 లేదా10 నాటికి తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. ఆ తర్వాత అధికారికంగా కూటమి ప్రకటన చేయగలమని ఆశాభావం వ్యక్తం చేశారు. రాభా హసోంగ్ జౌథో సంగ్రామ్ సమితితో సీట్ల పంపకం ఇప్పటికే పూర్తయిందని స్పష్టం చేశారు.
రాజ్యసభ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నందున ఎన్డీయే భాగస్వాములు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని, అందుకే కొంత ఆలస్యం జరుగుతోందని సీఎం వివరించారు. రాష్ట్రంలో ఎన్డీయేలో భాగస్వాములుగా ఉన్న పార్టీలు బీజేపీ, ఏజీపీ, యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ (యూపీపీఎల్), బీపీఎఫ్ లతో పాటు ఆర్‌హెచ్‌జేఎస్‌ఎస్, జనశక్తి పార్టీలు ఉన్నాయి. అయితే ఆర్‌హెచ్‌జేఎస్‌ఎస్, జనశక్తి పార్టీలకు అసెంబ్లీలో ఎమ్మెల్యేలు లేరు.
126 సభ్యుల అసెంబ్లీలో బీజేపీకి 64 మంది ఎమ్మెల్యేలు ఉండగా, ఏజీపీకి 9, యూపీపీఎల్‌కి 7, బీపీఎఫ్‌కి 3 స్థానాలు ఉన్నాయి. ప్రతిపక్షంలో కాంగ్రెస్‌కు 26 మంది, ఏఐయూడీఎఫ్ కు 15 మంది, సీపీఐ(ఏం)కు ఒక ఎమ్మెల్యే, ఒక స్వతంత్ర సభ్యుడు ఉన్నారు.
వరుసగా మారుతున్న గడువులు
సీట్ల సర్దుబాటు విషయంలో ముఖ్యమంత్రి గడువును మార్చడం ఇది నాలుగోసారి. మొదట జనవరి 15 నాటికి పూర్తి చేస్తామన్న ఆయన, తర్వాత ఫిబ్రవరి 22న సీట్ల పంపకం పూర్తయిందని ప్రకటించిన సీఎం, అంతకుముందు జనవరి 7న ఫిబ్రవరి 15 నాటికి ఒప్పందం ఖరారు చేస్తామని చెప్పారు. ఇప్పుడు తాజాగా మార్చి 10వ తేదీని లక్ష్యంగా పెట్టుకున్నారు.
నియోజకవర్గాల పునర్విభజన ప్రభావం
2023లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన కారణంగా పలు స్థానాల సరిహద్దులు మారాయి. కొన్ని జనరల్ స్థానాలు రిజర్వ్‌డ్‌గా, మరికొన్ని రిజర్వ్ స్థానాలు జనరల్‌గా మారడం కూడా సీట్ల పంపిణీలో సంక్లిష్టతకు కారణమైంది. మార్చి-ఏప్రిల్ నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశముండగా, మార్చి 10 నాటికి కూటమి సీట్ల అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు.
