Let's talk: editor@tmv.in
మార్చి 1న ఏపీకి రానున్న సి.జె.ఐ జస్టిస్ సూర్యకాంత్

మార్చి 1న ఏపీకి రానున్న సి.జె.ఐ జస్టిస్ సూర్యకాంత్

Panthagani Anusha
27 ఫిబ్రవరి, 2026

భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ మార్చి 1వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఏర్పాటు చేసిన పలు అధికారిక కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ పర్యటనలో జస్టిస్ సూర్యకాంత్‌తో పాటు మరో ఏడుగురు న్యాయమూర్తులు కూడా హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

షెడ్యూల్ ప్రకారం జస్టిస్ సూర్యకాంత్ మార్చి 1 మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా గుంటూరు జిల్లాకు బయలుదేరి వెళ్తారు. గుంటూరులో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు ఎన్టీఆర్ హౌస్‌ను కూడా ఆయన సందర్శించనున్నారు. ఇక తన పర్యటన ముగించుకుని అదే రోజు సాయంత్రం తిరిగి గన్నవరం విమానాశ్రయం నుంచి న్యూఢిల్లీకి పయనమవుతారు.

మరోవైపు న్యాయమూర్తి పర్యటన దృష్ట్యా కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఏర్పాట్లను ముమ్మరం చేశారు. విమానాశ్రయంలో న్యాయమూర్తికి నిర్వహించే స్వాగత, వీడ్కోలు కార్యక్రమాలపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. న్యాయమూర్తుల కాన్వాయ్ కదలికలకు ఎటువంటి అంతరాయం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రోటోకాల్ విషయంలో ఎక్కడా లోపాలు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇక భద్రతా పరంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.