Let's talk: editor@tmv.in
మార్చి నుంచే మండనున్న ఎండలు..

మార్చి నుంచే మండనున్న ఎండలు..

Dantu Vijaya Lakshmi Prasanna
6 మార్చి, 2026

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఏడాది వేసవి కాలం ప్రారంభ దశలోనే ఎండలు క్రమంగా ముదురుతున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. మార్చి మొదటి వారం నుంచే సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని అధికారులు తెలిపారు. మధ్యాహ్న సమయంలో బయటికి వెళ్లడం కష్టంగా మారే పరిస్థితులు ఏర్పడుతున్నాయని, ఏప్రిల్, మే నెలల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.

భారత వాతావరణ శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం, ఈ ఏడాది మార్చి నుంచే ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిని మించి నమోదయ్యే అవకాశముందని ఆయన పేర్కొన్నారు.

మార్చి నుంచి మే నెలల వరకు రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేస్తోంది. శ్రీకాకుళం, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాలు మినహా మిగతా ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉందని తెలిపారు. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.

ఇప్పటికే కోస్తా, రాయలసీమ ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలు దాటిపోతాయని ఐఎండీ స్పష్టం చేసింది. నిన్న ఒక్కరోజే కర్నూలులో అత్యధికంగా 38.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయింది. రేపటి నుంచి మరింత ఎక్కువ ఉండే ప్రమాదం పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలోని ములుగు, భూపాలపల్లి, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యపేట లాంటి జిల్లాలలో 40 డిగ్రీల టెంపరేచర్ నమోదు అవుతుందని హైదరాబాద్ వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. ఈ జిల్లాలకు ఆరెంజ్, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. ఇకపై మధ్యాహ్నం ప్రయాణాలు తగ్గించుకోవాలని కూడా సూచనలు చేసింది. అతి త్వరలోనే వడగాల్పులు కూడా ప్రారంభమవుతాయని తెలిపింది. ఈ నేపథ్యంలోనే వృద్ధులు, చిన్నారులు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేసింది వాతావరణ శాఖ.

వాతావరణ కేంద్రం వెల్లడించిన సమాచారం ప్రకారం, తెలంగాణలో రాబోయే మూడు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2నుంచి3 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉంది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా వచ్చే ఏడు రోజుల పాటు పొడి వాతావరణం కొనసాగుతుందని పేర్కొన్నారు. గత 24 గంటల్లో మహబూబ్‌నగర్‌లో 38.6 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అదే సమయంలో పటాన్‌చెరులో 15.4 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు నివేదికలో తెలిపారు.

ఎండల కారణంగా ప్రాణనష్టం జరగకుండా రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ప్రఖర్ జైన్ తెలిపారు. స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ ద్వారా ఎప్పటికప్పుడు అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పుల పరిస్థితిని పర్యవేక్షిస్తామని చెప్పారు. జిల్లా యంత్రాంగానికి రెండు రోజుల ముందుగానే ఉష్ణోగ్రతలు, వడగాలుల వివరాలు తెలియజేస్తామని తెలిపారు. అలాగే రియల్ టైమ్‌లో మండల అధికారులు, ప్రజలను అప్రమత్తం చేస్తామని వెల్లడించారు.

ఎండలపై సమాచారం కోసం ప్రజలు 24 గంటలు అందుబాటులో ఉండే విపత్తుల నిర్వహణ సంస్థ స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్లు 112, 1070, 18004250101 ను సంప్రదించాలని సూచించారు. ప్రజలకు వడగాల్పుల హెచ్చరిక సందేశాలు వచ్చినప్పుడు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఎండలతో పాటు క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో ఆకస్మికంగా భారీ వర్షాలు, పిడుగులు పడే అవకాశమున్నందున చెట్ల క్రింద నిలబడకుండా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

వేసవిలో ఎండ ప్రభావానికి గురికాకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు పాటించాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఇంటి పైకప్పులపై వైట్ పెయింట్ వేయడం, కూల్ రూఫ్ టెక్నాలజీ, క్రాస్ వెంటిలేషన్, థర్మోకోల్ ఇన్సులేషన్ వంటి చర్యలు ఇంటి ఉష్ణోగ్రతను తగ్గించడంలో సహాయపడతాయని తెలిపారు. ఇంటి పైకప్పులపై, పరిసరాల్లో మొక్కలు పెంచడం కూడా భవనాన్ని చల్లగా ఉంచుతుందని చెప్పారు.

అత్యవసర పరిస్థితులు తప్ప మధ్యాహ్న సమయంలో బయటికి వెళ్లకుండా ఉండాలని సూచించారు. బయటికి వెళ్లాల్సి వస్తే గొడుగు, టోపీ ఉపయోగించడం, తెలుపు రంగు పలుచటి కాటన్ దుస్తులు ధరించడం మంచిదని తెలిపారు. కళ్ళ రక్షణ కోసం సన్ గ్లాసెస్ ఉపయోగించాలని సూచించారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని సూచించారు.

డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఎక్కువగా నీరు తాగాలని, అవసరమైతే ఓఆర్ఎస్ , లస్సీ, నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీరు వంటి పానీయాలు తీసుకోవాలని ప్రఖర్ జైన్ సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కూడా ఆయన తెలిపారు.