
మార్చిలో రిటైల్ ద్రవ్యోల్బణం 3.4 శాతంగా నమోదు
దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం స్వల్పంగా పెరిగింది. గత ఫిబ్రవరి నెలలో 3.21 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం, మార్చి నాటికి 3.4 శాతానికి చేరుకుందని కేంద్ర గణాంక శాఖ వెల్లడించింది. వినియోగదారుల ధరల సూచీ ఆధారంగా వెలువడిన ఈ గణాంకాలు దేశ ఆర్థిక స్థితిగతులపై మధ్యప్రాచ్య ఉద్రిక్తతల ప్రభావాన్ని స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా ఆహార వస్తువుల బాస్కెట్‌లో ధరల పెరుగుదల 3.47 శాతం నుంచి 3.87 శాతానికి చేరడం గమనార్హం. తాజా లెక్కల ప్రకారం, పట్టణాలతో పోలిస్తే పల్లెటూర్లలోనే ధరల మంట ఎక్కువగా ఉంది. పట్టణాల్లో ధరల పెరుగుదల 3.11 శాతంగా ఉంటే, గ్రామాల్లో అది 3.63 శాతానికి చేరింది.
యుద్ధం తెచ్చిన సెగ
ఇరాన్‌పై అమెరికా నావికా దళ ఆంక్షలు, అంతర్జాతీయ వాణిజ్య మార్గాల్లో అంతరాయాలు గ్లోబల్ సప్లై చైన్‌ను దెబ్బతీశాయి. దీనివల్ల ఇంధన ధరలు పెరగగా, మార్చి నెలలో బంగారం ధరలు (ముడి బంగారం) సుమారు 11 శాతం తగ్గడం ద్రవ్యోల్బణం భారీగా పెరగకుండా అడ్డుకుంది. అయినప్పటికీ వెండి ఆభరణాల ధరలు 148.61 శాతం, బంగారం-ప్లాటినం ఆభరణాల ధరలు 45.92 శాతం మేర పెరిగి సామాన్యుడిని ఆశ్చర్యపరిచాయి.
వెల్లుల్లి, ఉల్లి ధరలు తగ్గినా.. భోజనం ప్రియమే!
సాధారణంగా ధరలు పెరుగుతుంటాయి కానీ, ఈ మార్చి నెలలో మాత్రం వంటింట్లో వాడే కీలక వస్తువులైన వెల్లుల్లి, ఉల్లిపాయలు, బంగాళదుంపల ధరలు గతంతో పోలిస్తే బాగా తగ్గాయి. వెల్లుల్లి ధర 10.18 శాతం, ఉల్లిపాయలు 27.76 శాతం, బంగాళదుంపలు 18.98 శాతం మేర తగ్గడం గృహిణులకు పెద్ద ఊరటనిచ్చింది. అయితే ఇవి తగ్గినప్పటికీ పాలు, నూనెలు వంటి ఇతర ఆహార పదార్థాలు, పానీయాల ధరలు మొత్తం మీద 3.87 శాతం పెరగడంతో భోజనం ఖర్చు కాస్త భారంగానే మారింది. దీనికి తోడు కరెంటు, గ్యాస్ బిల్లులు కూడా 1.65 శాతం పెరగడం సామాన్యుడి జేబుపై ప్రభావం చూపుతోంది.
కొత్త పద్ధతిలో లెక్కింపు
మారుతున్న జీవనశైలికి అనుగుణంగా ప్రభుత్వం ధరల పెరుగుదలను లెక్కించే పద్ధతిని మార్చింది. పదేళ్ల క్రితం నాటి పాత లెక్కల (2012) స్థానంలో, ఇప్పుడు 2024ను కొత్త ప్రాతిపదికగా తీసుకుంది. మునుపటితో పోలిస్తే ఆహారంపై పెట్టే ఖర్చు కంటే ఇతర సౌకర్యాలపై పెట్టే ఖర్చు పెరిగిందని భావించి, ఆహార వస్తువుల ప్రాధాన్యతను (వెయిటేజీ) 45.9 శాతం నుండి 36.75 శాతానికి తగ్గించింది. కాలం చెల్లిన ఆడియో క్యాసెట్లు, వీసీఆర్ వంటి వాటిని ఈ జాబితా నుండి తీసేసి, వాటి స్థానంలో ఇప్పుడు వాడుతున్న ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు, మెమొరీ కార్డ్‌ల వంటి డిజిటల్ వస్తువులను చేర్చింది. ఇక ఇల్లు, వైద్యం, సమాచార సేవల ధరలు పెద్దగా పెరగకుండా నిలకడగా ఉండటం సామాన్యులకు ఊరటనిచ్చే విషయం.
ఆర్‌బీఐ అప్రమత్తం.. ఆందోళనలో ఇన్వెస్టర్లు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశించుకున్న 4 శాతం మధ్యకాలిక లక్ష్యం కంటే ద్రవ్యోల్బణం వరుసగా 12వ నెలలోనూ తక్కువగానే ఉన్నప్పటికీ, భవిష్యత్తుపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. "భారత ఆర్థిక పునాదులు బలంగా ఉన్నాయి. అయితే అంతర్జాతీయ ఉద్రిక్తతలు పెరిగితే సరఫరా వ్యవస్థలో ఆటంకాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ప్రస్తుత పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నాం" అని ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా పేర్కొన్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గానూ సగటు ద్రవ్యోల్బణం 4.6 శాతంగా ఉండవచ్చని ఆర్‌బీఐ అంచనా వేసింది.
