
మార్చిలో ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం?
పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ నెలలో వేర్వేరు తేదీల్లో నిర్వహించే అవకాశం ఉందని అధికారులు మంగళవారం తెలిపారు. ఎన్నికల షెడ్యూల్‌ను మార్చి మధ్యలో ప్రకటించే అవకాశముందని వెల్లడించారు. అధికారుల ప్రకారం, ఎన్నికల సంఘం మార్చి మధ్యలోనే ఐదు రాష్ట్రాల ఎన్నికల తేదీలను ఒకేసారి ప్రకటించనుంది. పోలింగ్ ఏప్రిల్‌లో దశలవారీగా జరిగే అవకాశముంది. ఈ ఐదు అసెంబ్లీల పదవీకాలాలు మే, జూన్ నెలల్లో వేర్వేరు తేదీలకు ముగియనున్నాయి. పుదుచ్చేరి అసెంబ్లీ ఐదేళ్ల పదవీకాలం జూన్ 15న ముగియనుండగా, అస్సాం మే 20న, కేరళ మే 23న, తమిళనాడు మే 10న, పశ్చిమ బెంగాల్ మే 7న ముగియనున్నాయి.
ఎన్నికలకు సన్నద్ధతను సమీక్షించేందుకు ఎన్నికల సంఘం ఇప్పటికే సంబంధిత రాష్ట్రాల్లో పర్యటనలు ప్రారంభించింది. ప్రస్తుతం అస్సాంలో ఏర్పాట్లను పరిశీలిస్తోంది. చివరిసారి నిర్వహించిన ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో ఎనిమిది దశల్లో నిర్వహించగా, అస్సాంలో రెండు దశల్లో, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో ఒక్క దశలో ఎన్నికలు జరిగాయి.
ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా పుదుచ్చేరి ఫిబ్రవరి 14న తుది ఓటర్ల జాబితాను ప్రకటించింది. తమిళనాడు మంగళవారం తుది జాబితాను విడుదల చేయనుండగా, కేరళ ఫిబ్రవరి 21న, పశ్చిమ బెంగాల్ ఫిబ్రవరి 28న విడుదల చేయనున్నాయి. అస్సాంలో ప్రత్యేక సవరణ ప్రక్రియ అనంతరం ఫిబ్రవరి 10న తుది జాబితా ప్రకటించారు. ఇక గువాహటిలో అస్సాం రాజకీయ పార్టీలు మంగళవారం ఎన్నికల సంఘాన్ని కలిసి రాష్ట్రంలో ఎన్నికలను ఒకే దశలో లేదా గరిష్టంగా రెండు దశల్లో నిర్వహించాలని కోరాయి. ఈశాన్య రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతను సమీక్షించేందుకు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ నేతృత్వంలోని పూర్తి కమిషన్ బృందం అస్సాంలో పర్యటిస్తుంది. ఏప్రిల్ 14న జరిగే బిహూ పండుగను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల తేదీలను నిర్ణయించాలని కూడా రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘాన్ని కోరాయి.
ఇప్పటికే ప్రచారంలో పార్టీలు
ఎన్నికల షెడ్యూల్ రాకముందే ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల వాతావరణం ఏర్పడింది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఎంపీ అభిషేక్ బెనర్జీ నేతృత్వంలో టీఎంసీ ఎన్నికల సభలు, ర్యాలీలు నిర్వహిస్తోంది. బీజేపీ ఇప్పటికే అక్కడ ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షా సభలను నిర్వహించింది. అయితే కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయాలన్న ఆలోచనలో ఉంది. ఈ సారి టీఎంసీతో కలిసి పోటీలో నిలిచే అవకాశం లేదని వార్తలు వెలువడుతున్నాయి.
అస్సాంలో ఇప్పటికే ప్రధాని నరేంద్రమోడీ, సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రచారాన్ని హీటెక్కించారు. కాంగ్రెస్ ఎన్నికల ఇన్ చార్జ్ లను నియమించింది. అడపదడపా ఎన్నికల ర్యాలీలను గౌరవ్ గోగోయ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తోంది.
తమిళనాడులో డీఎంకే ఇప్పటికే ముమ్మరంగా ప్రచార ర్యాలీలను ప్రారంభించింది. ప్రభుత్వం ఆయా వర్గాలను ఆకట్టుకోవడానికి సంక్షేమ పథకాలను కూడ ప్రకటిస్తోంది. టీవీకే, ఎన్డీయే కూటమిలో భాగమైన ఏఐడీఎంకే ఇప్పటికే ఒకరిపై ఒకరు విమర్శానాస్త్రాలు సంధించుకుంటున్నారు.
కేరళలో సీఎం విజయ్ ను కూడా తీవ్రంగా పోరాడుతున్నారు. తాము చేసిన అభివృద్ధే తమను గెలిపిస్తుందని, ఎల్డీఎఫ్ కూటమే మళ్లీ అధికారాన్ని కైవసం చేసుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ జరిగిన స్థానిక ఎన్నికల్లో బీజేపీ కూడా కొన్ని ప్రాంతాల్లో ప్రభావం చూపడం ఇటు యూడీఎఫ్ కు, ఎల్డీఎఫ్ కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అలాగే ఇప్పటికే ప్రధాని, అమిత్ షా ఓసారి కేరళలో నిర్వహించిన ర్యాలీల్లో పాల్గోన్నారు. పుదుచ్చేరిలో ఇటీవలే అమిత్ షా భారీ సభను నిర్వహించారు.
మొత్తానికి అన్ని పార్టీలు ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే ఎన్నికల క్షేత్రంలో దిగాయి. తమ ర్యాలీలను ముమ్మరం చేశాయి.
