
మార్కాపురం బస్సు ప్రమాదం: బాధితుల మృతదేహాలు అప్పగింత
ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలోని రాయవరం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం మిగిల్చిన విషాదం నుంచి బాధితుల కుటుంబాలు ఇంకా కోలుకోలేకపోతున్నాయి. మంటల్లో సజీవ దహనమై గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న 14 మంది బాధితులను శాస్త్రీయ పద్ధతిలో గుర్తించే ప్రక్రియ శనివారంతో ముగిసింది. డీఎన్ఏ పరీక్షల ద్వారా మృతదేహాలను ధృవీకరించిన అనంతరం, పోలీసులు మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ప్రాంగణం ఆర్తనాదాలతో మిన్నంటింది.
మార్చి 26 తెల్లవారుజామున ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కాంక్రీటు చిప్స్ లోడ్‌తో ఉన్న టిప్పర్ లారీని బలంగా ఢీకొన్న ఘటనలో ఐదు నెలల పసికందుతో సహా 14 మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే. మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో ఎవరిని గుర్తించడం సాధ్యం కాలేదు. దీంతో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు ఫోరెన్సిక్ బృందాలు రంగంలోకి దిగాయి. గుంటూరు రీజినల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నిపుణులు, 22 మంది రక్త సంబంధీకుల నుంచి నమూనాలు సేకరించి డీఎన్ఏ విశ్లేషణ నిర్వహించారు. శుక్రవారం రాత్రి ఫలితాలు వెలువడటంతో శనివారం ఉదయం నుంచి పోలీస్ ఎస్కార్ట్ మధ్య అంబులెన్సుల్లో మృతదేహాలను బాధితుల స్వగ్రామాలకు తరలించారు.
స్టీరింగ్ జామ్ కాలేదు.. అంతా నిర్లక్ష్యమే!
మరోవైపు ఈ ఘోర ప్రమాదంపై పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. బస్సు డ్రైవర్ వాదిస్తున్నట్లుగా ‘స్టీరింగ్ జామ్’ అవ్వలేదని సాంకేతిక నిపుణులు నిర్ధారించారు. జిల్లా ఎస్పీ రాజు తెలిపిన వివరాల ప్రకారం డ్రైవర్ అతివేగంగా బస్సును తప్పుడు దిశలోకి తీసుకెళ్లి కాంక్రీటు చిప్స్ లోడ్‌తో ఉన్న టిప్పర్ లారీని బలంగా ఢీకొట్టడం వల్లే సెకన్ల వ్యవధిలో అగ్నిప్రళయం సంభవించింది. ఇదిలా ఉండగా ప్రమాదానికి ముందే బస్సులో యాంత్రిక లోపాలున్నాయని యర్రగొండపాలెం వద్ద గంటపాటు నిలిచిపోయినప్పుడు ప్రయాణికులు హెచ్చరించినా డ్రైవర్ బేఖాతరు చేసినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు పేర్కొన్నారు.
నిలకడగా క్షతగాత్రుల పరిస్థితి
ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడి ఒంగోలు, మార్కాపురం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న 22 మంది బాధితుల ఆరోగ్యం ప్రస్తుతం స్థిరంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఇద్దరికి కాళ్లకు శస్త్రచికిత్సలు నిర్వహించామని, కోలుకున్న వారిని దశలవారీగా డిశ్చార్జ్ చేస్తామని అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చింది.
