Let's talk: editor@tmv.in
మార్కాపురంలో ఘోర బస్సు ప్రమాదం..14 మంది సజీవ దహనం

మార్కాపురంలో ఘోర బస్సు ప్రమాదం..14 మంది సజీవ దహనం

Pinjari Chand
27 మార్చి, 2026

పూర్తిగా కాలిపోయిన మృతదేహాలు అక్కడివారిని కన్నీరు పెట్టించాయి. మృతదేహాల్లో బయటకు తేలిన ఎముకలను చూసి సాటి ప్రయాణకుల గుండెలు ద్రవించాయి. మౌనంగా అశ్రువులు చెంపలపై ధారాలు కట్టాయి. వారి హాహాకారాలు ప్రమాద వాతావరణాన్ని మరింత శోకంలోకి నెట్టాయి. ఈ దృశ్యాలు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలో గురువారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో చోటు చేసుకున్నాయి. అప్పటివరకు గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులను మృత్యువు మంటల రూపంలో కబళించింది. జగిత్యాల నుంచి నెల్లూరు జిల్లా కలిగిరి వైపు వెళ్తున్న 'హరికృష్ణ ట్రావెల్స్ కు చెందిన ప్రైవేటు బస్సు, రాయవరం గ్రామం వద్ద ఎదురుగా వస్తున్న కాంక్రీటు చిప్స్ లోడ్‌తో ఉన్న టిప్పర్ లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి బస్సులోని డిజిల్‌ ట్యాంక్ ఒక్కసారిగా పేలిపోవడంతో నిమిషాల వ్యవధిలోనే బస్సు అగ్నిగోళంలా మారింది. ఈ దారుణ ఘటనలో 14 మంది ప్రయాణికులు మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు.

మృత్యువుతో పోరాటం - సాక్ష్యాల కథనం

ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 41 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. తెల్లవారుజామున 5:30 నుంచి 6 గంటల మధ్య ప్రయాణికులంతా నిద్రమత్తులో ఉండగా ఈ ప్రమాదం సంభవించింది. మృతుల్లో ఐదుగురు బస్సు ముందు వరుసలో కూర్చున్న వారు కాగా మరో ఎనిమిది మంది వెనుక సీట్లలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. డ్రైవర్ స్టీరింగ్ వ్హీల్ ఇరుక్కుపోవడం, అజాగ్రత్త కారణంగా తన లైన్ తప్పి టిప్పర్‌ను ఢీకొట్టడం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగిందని మార్కాపురం ఇన్చార్జి ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడించారు. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన వారి కథనం గుండెల్ని పిండేస్తోంది. బస్సు ఒక్కసారిగా పెద్ద శబ్దంతో ఢీకొనగానే పొగ, మంటలు వ్యాపించాయి. చీకటిగా ఉండటంతో ఏం జరుగుతుందో తెలియక ప్రయాణికులు ఆర్తనాదాలు చేశారు. ఒక యువకుడు ఎమర్జెన్సీ విండో ద్వారా ఒక మహిళను సురక్షితంగా బయటకు తీయగా, మరికొందరు కిటికీల అద్దాలు పగలగొట్టి ప్రాణాలు కాపాడుకున్నారు.

పిన్నీ.. మనం చచ్చిపోతాం

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ మహిళ తన అనుభవాన్ని వివరించింది. ‘మేం ముగ్గురం కలిసి ప్రయాణిస్తున్నాం. ఉదయం ఉదయగిరికి చేరుకోవాల్సి ఉంది. ఒక్కసారిగా మేమంతా పడిపోయాం. ఏమైందో అర్థం కాకముందే పొగ కమ్మేసింది. అప్పుడు మా వెంట ఉన్న బాలుడు ‘పిన్నీ..మనం చచ్చిపోతాం’ అన్నాడు. మేమిద్దరం బయటపడ్డాం, కానీ ఆ బాలుడి ఆచూకీ దొరకలేదని ఆమె కన్నీరుమున్నీరయ్యింది.

మరో యువకుడు మాట్లాడుతూ ‘ఏం జరిగిందో తెలియదు. నేను నిద్రలోనే ఉన్నాను. ఒక్కసారిగా నేలపై పడిపోయాను. నా శరీరంపై మంటలు కనిపించాయని భయం, భయంగా చెప్పాడు. ఘటన సమయంలో సుమారు ఉదయం 5.30 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగిందని మరో ప్రయాణికుడు తెలిపాడు. తాను, మరో వ్యక్తి కిటికీ పగులగొట్టి బయటకు వచ్చామని, తాను నిజామాబాద్ నుంచి పామూరు వెళ్తున్నానని చెప్పాడు. ఇంకో మహిళా ప్రయాణికురాలు ఆసుపత్రిలో ఏడుస్తూ పై బెర్త్‌లో నిద్రపోతున్నాను. ఒక్కసారిగా దిగిపోయాను. మంటల్లో ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఎవరో నన్ను బయటకు లాగారని తన అనుభవాన్ని రోదిస్తూ చెప్పింది.

అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు

మొదటి సీట్లో కూర్చున్న యువకుడు మాట్లాడుతూ మంటలు దగ్గరికి వచ్చేవరకు అక్కడ ఏం జరుగుతుందో నాకు ఏమీ అర్థం కాలేదు. పొగ ఎక్కువగా పీల్చడంతో ఊపిరి ఆడలేదు. వేడి పెరగడంతో మేల్కొన్నాను. అప్పటికే చుట్టూ మంటలు కనిపించాయి. అక్కడ అంతా చీకటిగా అనిపించిందని వివరించాడు. బస్సు నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంత దూరం వెళ్లినా ఎవరూ కనిపించలేదని, లోపల ప్రయాణికులు ప్రాణాల కోసం ఒకరిపై ఒకరు ఎక్కుతూ పరుగులు తీసినట్లు తెలిపాడు. మరో ప్రయాణికుడు మాట్లాడుతూ నేను ఫోన్ చూస్తున్నాను. మధ్యలో కూర్చున్నాను. ఎమర్జెన్సీ డోర్ తెరిచి ఒక మహిళను బయటకు తీశాను అని చెప్పాడు. బస్సులో మంటలు వేగంగా వ్యాపించడంతో లోపల చిక్కుకున్న వారు బయటకు రాలేక అగ్నికి ఆహుతయ్యారు. రోడ్డుపై పూర్తిగా కాలిపోయిన మృతదేహాలు అక్కడి భయానక పరిస్థితిని కళ్లకు కట్టాయి.

ఘటనా స్థలాన్ని పరిశీలించిన మంత్రులు

ఈ ఘటనపై ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ప్రమాదంలో చనిపోయిన వారికి రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.2లక్షలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం కూడా బాధితులకు ఆర్థిక సహాయం ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోడీ మరణించిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. హోం మంత్రి వంగలపూడి అనిత, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించి, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా రోడ్డు భద్రతా నియమాలను మరింత కఠినతరం చేస్తామని ప్రకటించారు.

ప్రస్తుతం అధికారులు డిప్యూటీ కలెక్టర్ కార్యాలయంలో కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి సహాయక చర్యలను సమన్వయం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ పి. రాజబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని మెరుగైన చికిత్స కోసం ఒంగోలు ఆసుపత్రికి తరలించారు. ఈ దుర్ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా విచారం వ్యక్తం చేస్తూ, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే భారీ పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.

కంట్రోల్‌ రూం ఏర్పాటు

మార్కాపురం సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంపై మార్కాపురం ఆర్డిఓ ఆఫీసు లో కమాండ్ కంట్రోల్ రూమ్, ఒంగోలు కలెక్టరేట్ లో 1077 నెంబర్ తో కమాండ్ కంట్రోల్ రూమ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పూర్తి సమాచారం కొరకు పై నెంబర్లను సంప్రదించలని అధికారులు పేర్కోన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో వరుస బస్సు ప్రమాదాలు.. ఆరు నెలల్లో 45 మంది మృతి

ఆంధ్రప్రదేశ్‌లో గత ఆరు నెలల్లో చోటుచేసుకున్న నాలుగు ఘోర బస్సు ప్రమాదాలు కలిపి కనీసం 45 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. ఈ ప్రమాదాల్లో రెండింటిలోనే 33 మంది సజీవ దహనమవ్వడం ఆందోళన కలిగిస్తోంది. గురువారం తెల్లవారుజామున మార్కాపురం జిల్లా రాయవరం గ్రామం సమీపంలో జరిగిన తాజా ప్రమాదంలో 14 మంది మృతి చెందగా, 22 మంది గాయపడ్డారు. ఉదయం 5.30 నుంచి 6 గంటల మధ్య ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కాంక్రీట్ చిప్స్‌తో వెళ్తున్న టిప్పర్ లారీని ఢీకొట్టింది. ఢీకొట్టిన ప్రభావంతో డీజిల్ ట్యాంక్ పేలి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.

• ఇదే విధంగా జనవరి 22న నంద్యాల జిల్లా సిరివెల్ల మెట్ట గ్రామం వద్ద హైదరాబాద్‌ వైపు వెళ్తున్న ప్రైవేట్ బస్సు లారీని ఢీకొట్టి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు, డ్రైవర్ మృతి చెందగా, స్థానికుల సహాయంతో 30 మందికి పైగా ప్రయాణికులను రక్షించారు.

• 2025 డిసెంబర్ 12న అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘాట్ రోడ్డుపై బస్సు లోయలో పడిపోవడంతో తొమ్మిది మంది మృతి చెందగా, 23 మంది గాయపడ్డారు.

• అక్టోబర్ 24, 2025న కర్నూలు జిల్లా చిన్న టేకూరు గ్రామం వద్ద బెంగళూరు వెళ్తున్న స్లీపర్ బస్సు ముందుగా ప్రమాదానికి గురైన ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో భారీ మంటలు చెలరేగి 19 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు.

అధికారుల స్పందన

మార్కాపురం ఘటనపై రాష్ట్ర రవాణా కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా మాట్లాడుతూ, బస్సు అసలు లక్షద్వీప్‌లో రిజిస్టర్ అయిందని, తర్వాత మార్పులు చేసి అరుణాచల్ ప్రదేశ్‌లో మళ్లీ రిజిస్టర్ చేసినట్లు తెలిపారు. ఇది 99 శాతం ప్రమాదమే. బస్సుకు సంబంధించిన పత్రాలు సక్రమంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా గత 7-8 నెలల్లో స్లీపర్ బస్సు ప్రమాదాల్లో సుమారు 145 మంది మరణించినట్లు నివేదికలు చెబుతున్నాయని ఆయన తెలిపారు. కర్నూలు ఘటన తర్వాత అధికారులు సుమారు 200 బస్సులను తనిఖీ చేసి, 90 బస్సులకు నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. వాహన యజమానులు ఎక్కువ పర్మిట్ ఫీజులను తప్పించుకునేందుకు ఈశాన్య రాష్ట్రాలు లేదా కేంద్ర పాలిత ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారని ఆయన తెలిపారు. ఇక రాష్ట్ర రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ బస్సు ప్రమాదాలను నియంత్రించేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇలాంటి ప్రమాదాలు జరగడం చాలా బాధాకరం. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ప్రత్యేక నిఘా ఉంచుతాం. త్వరలో బస్సు యజమానులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిపారు.