
మామిడి రైతులను ఆదుకోండి
మామిడి రైతులు, పరిశ్రమలు పరస్పర సహకారంతో ముందుకు సాగాలని, రైతులకు చెల్లించాల్సిన మద్దతు ధర విషయంలో ఆలస్యం చేయకుండా నిర్ణీత సమయాన్ని నిర్దేశించుకుని ముందుకు వెళ్లాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి చిత్తూరు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి మండలి రాంప్రసాద్ రెడ్డి మామిడి గుజ్జు పరిశ్రమల యజమానులను కోరారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని నాగార్జున ఐఏఎస్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధ్యక్షతన మామిడి పరిశ్రమల యజమానులతో సమీక్షా సమావేశం సందర్బంగా ఆయన ప్రసంగించారు.
రూ.4 సబ్సిడీతో రూ.183 కోట్లు జమ
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మామిడి రైతుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపుతున్నారని మంత్రి మండలి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. కేజీ మామిడికి రూ.4 మద్దతు ధర ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాలో మామిడి పంట పండించిన రైతులకు రూ.4 సబ్సిడీ మేర మొత్తం రూ.183 కోట్ల రూపాయలను రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లాలో 31,929 మంది రైతులకు రూ.4 సబ్సిడీ చొప్పున మొత్తం రూ.146.84 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం జమ చేసిందని వెల్లడించారు.
గతంలో మామిడి దిగుబడి అధికంగా ఉండడంతో డిమాండ్ తగ్గి రైతులకు ఆశించిన ధర రాలేదన్నారు. ధర లేని కారణంగా రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం కేజీ మామిడికి రూ.4 మద్దతు ధర ప్రకటించగా ప్రొసెసింగ్ యూనిట్లు రూ.8 చెల్లించాలని ఆదేశించిందని మంత్రి గుర్తు చేశారు.
పరిశ్రమలు ధాతృత్వాన్ని ప్రదర్శించాలి
"ప్రొసెసింగ్ యూనిట్లు రైతుల క్షేమాన్ని గుర్తుంచుకుని, వారి పట్ల ధాతృత్వంతో ధరలు చెల్లించాలి," అని మంత్రి సూచించారు. పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు, వసతులు కల్పించి వేగంగా ముందడుగు వేస్తుందని హామీ ఇచ్చారు. జిల్లాలోని గుజ్జు పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, విద్యుత్ ఛార్జీ సమస్యలు, మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు.
మద్దతు ధర చెల్లింపులో జాప్యం తగదు: ఎంపీ
చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు మాట్లాడుతూ, గుజ్జు పరిశ్రమలు రైతుల ఉత్పత్తుల పై, రైతులు పరిశ్రమలపై ఆధారపడి ఉన్నారన్నారు. రైతుల ఇబ్బందుల దృష్ట్యా ప్రభుత్వం రూ.4 సబ్సిడీ మంజూరు చేసిందని అయితే గుజ్జు పరిశ్రమలు మద్దతు ధరలు చెల్లించడంలో జాప్యం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పరిశ్రమలు రైతులకు చెల్లించదగ్గ ధర,చెల్లింపు తేదీల సమగ్ర వివరణను జిల్లా కలెక్టర్‌కు వీలైనంత త్వరగా ప్రతిపాదించాలని ఆయన కోరారు.
ఇతర రాష్ట్రాల కంటే తక్కువ ధర
జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలో జూన్, జూలై మాసాలలో రైతుల నుండి 2.40 లక్షల మెట్రిక్ టన్నుల మామిడిని గుజ్జు పరిశ్రమలకు సమీకరించడం జరిగిందన్నారు. అయితే జిల్లాలోని కొన్ని గుజ్జు పరిశ్రమలు రైతులకు చెల్లిస్తున్న మద్దతు ధరలు తమిళనాడులోని కృష్ణగిరిలో చెల్లిస్తున్న దానికంటే తక్కువగా ఉండడం గమనార్హం అని తెలిపారు.
దీనిపై స్పందించిన పల్ప్ పరిశ్రమ ప్రతినిధులు, యూరోపియన్ దేశాలలో దిగుమతి సుంకాలు ఎక్కువ అవ్వడం వల్ల తాము ఇబ్బందులు పడుతున్నామని నిస్సహాయత వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి మండలి రాంప్రసాద్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీ మోహన్, అధికారులు, మామిడి పరిశ్రమల యజమానులు పాల్గొన్నారు.
