
మానవ హక్కుల దినోత్సవం - మానవత్వానికి వెలుగు
ప్రపంచం ఎన్నో యుద్ధాలు, వర్ణవివక్షలు, అన్యాయాలు, దోపిడీలు, హింసలతో నిండిన చరిత్రను దాటి ముందుకు సాగుతోంది. అయినప్పటికీ మానవత్వం అనే విలువ ఎప్పుడూ నశించలేదు. ప్రపంచవ్యాప్తంగా ప్రజల శాంతి, స్వేచ్ఛ, సమానత్వం, గౌరవం కోసం ఏర్పడిన మానవ హక్కుల ఉద్యమం నేడు అంతర్జాతీయ సమాజానికి బలంగా మారింది. కాని ప్రస్తుతం కొన్ని సంఘటనలు దానికి వ్యతిరేకంగా మారుతున్నాయి.
మనిషి పుట్టుకతోనే అమూల్యమైన గౌరవం, స్వేచ్ఛ, భద్రత, ప్రేమ అనే వరాలను అందుకున్నాడు. అయితే ప్రపంచం ఎదుర్కొన్న హింసలు, యుద్ధాలు, అన్యాయాలు, వివక్షలు ఈ విలువలను ఎన్నోసార్లు దెబ్బతీశాయి. అలాంటప్పుడు ప్రజల ఆర్తనాదాలను, కన్నీటి కథలను, అసమానతల బాధలను ప్రపంచం వినేలా చేసిన రోజు డిసెంబర్ 10 మానవ హక్కుల దినోత్సవం. ఇది కేవలం ఒక తేదీ కాదు. ప్రతి మనిషి హృదయంలో గౌరవాన్ని వెలిగించే వెలుగు. ప్రతి వ్యక్తి కన్నీటిలో ఆశను, పీడనలో స్వేచ్ఛను, బాధలో న్యాయాన్ని వెలిగించే ఒక ఉదయం. ఈ రోజు మనకు గుర్తు చేస్తుంది. మనిషి విలువ ఏ సరిహద్దులతోనూ కొలవబడదు, అతని గౌరవమే నిజమైన ప్రపంచ సంపద అని..
1948లో ఐక్యరాజ్యసమితి ప్రకటించిన ప్రపంచ మానవ హక్కుల ప్రకటన మానవ హక్కుల చరిత్రలో మహత్తర ఘట్టం. సుమారు రెండు సంవత్సరాల తరువాత దీన్ని 1950 లో అధికారికంగా ప్రకటించారు. ఈ తేదీని స్మరించుకునే రోజే మానవ హక్కుల దినోత్సవంగా ప్రపంచమంతా జరుపుకుంటోంది. ప్రతి మనిషి పుట్టుకతోనే సంపూర్ణ గౌరవం కలిగిఉంటాడనే భావానికి ప్రపంచవ్యాప్తంగా ఒకే స్వరం రూపం ఇచ్చే రోజు ఇదే.
మానవ హక్కుల దినోత్సవం ఎందుకు అవసరమైంది?
20వ శతాబ్దంలో జరిగిన రెండు ప్రపంచ యుద్ధాలు కోటానుకోట్ల జీవితాలను చిక్కుల్లో పెట్టాయి. హోలోకాస్ట్ వంటి క్రూరహింసలు, వర్ణవివక్ష విధానాలు, కాలనీ రాజ్యాల దోపిడి ఇవన్నీ ఒక విషయం నేర్పాయి. ఈ యుద్దాలే “మానవత్వాన్ని రక్షించడానికి ఒక గ్లోబల్ ఒప్పందం అవసరం.” అని తెలిపాయి. యుద్ధరంగాలలో జరిగిన మానవ నష్టాలు, జాతి, వర్ణ, మత వివక్ష, బానిసత్వం, దోపిడి, పిల్లలు, మహిళలు, మైనారిటీలపై హింస, మానసిక, శారీరక, రాజకీయ అత్యాచారాల నేపథ్యం ప్రపంచానికి ఒక పాఠాన్ని నేర్పింది. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం లేకుండా మానవత్వం నిలవదు. అందుకే ఐక్యరాజ్యసమితి ముందుకు వచ్చి ప్రపంచానికి ఒక బలమైన పునాది అందించింది. అదే ప్రపంచ మానవ హక్కుల ప్రకటన.
ప్రపంచ మానవ హక్కుల ప్రకటన (యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్). ఈ ప్రకటన ప్రపంచంలోని ప్రతి మనిషి సమానంగా, స్వేచ్ఛగా, గౌరవంతో జీవించే హక్కులను తెలియజేసింది. 1950లో ఒక తీర్మానం ద్వారా ఐరాస డిసెంబర్ 10న మానవ హక్కుల దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించింది. తరువాత ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, సంస్థలు, విద్యాసంస్థలు జరుపుకునే అంతర్జాతీయ దినోత్సవంగా మారింది. యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ మొత్తం 30 హక్కులను ప్రకటించింది. ఇవి ప్రపంచ జనులందరికీ వర్తిస్తాయి. ఇది ఏ దేశానికి చెందిన చట్టం కాదు, కానీ అన్ని దేశాల చట్టాలకూ ప్రేరణ.
ప్రపంచ మానవ హక్కుల ప్రకటనను కొందరు “ప్రపంచ పౌర హక్కుల మానిఫెస్టో” అని కూడా పేర్కొంటారు. యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ లోని ముఖ్యమైన హక్కులు - జీవన హక్కు, స్వేచ్ఛ హక్కు, వివక్ష రహిత జీవనం, విద్య హక్కు, ఉద్యోగం, సముచిత వేతనం హక్కు, ఆరోగ్యసేవలకు హక్కు, శాంతియుత జీవన హక్కు, అభిప్రాయ స్వేచ్ఛ, మత స్వేచ్ఛ, నిర్బంధం, హింస నుండి రక్షణ
మానవ హక్కుల ప్రాముఖ్యత
మానవ హక్కులు ఎందుకు అవసరమంటే, ఇవి ప్రతి మనిషికి గౌరవంతో జీవించే హామీ ఇస్తాయి. దీనికి దేశం చిన్నదా పెద్దదా, పేదదా ధనికదా సంబంధం లేదు. అన్నీ దేశాల ప్రజలకు ఇది వర్తిస్తుంది. ఈ హక్కు మనిషి సామాజిక సమానత్వం కాపాడుతుంది, ప్రభుత్వం, అధికారుల దుర్వినియోగాన్ని నియంత్రిస్తుంది, వ్యక్తిగత స్వేచ్ఛ రక్షిస్తుంది, మైనారిటీలు, బలహీన వర్గాలకు రక్షణ, హింస, అన్యాయం తగ్గిస్తుంది. దీని ద్వారా శాంతి, అభివృద్ధి, న్యాయపరమైన వ్యవస్థలు బలపడతాయి.
భారతదేశంలో మానవ హక్కుల రక్షణ
భారత రాజ్యాంగం ప్రపంచంలో అత్యంత సమగ్రంగా మానవ హక్కులను రక్షించే పుస్తకంగా నిలుస్తుంది. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల ప్రధానమైన ఆర్టికల్స్ ఇందులో పొందుపరిచారు.
• ఆర్టికల్ 14 – సమానత్వ హక్కు
• ఆర్టికల్ 19 – స్వేచ్ఛ హక్కులు (మాట, సమావేశం, మతం మొదలైనవి)
• ఆర్టికల్ 21 – జీవన హక్కు
• ఆర్టికల్ 23, 24 – బానిసత్వం, బాల కార్మికత్వం నిషేధం
మన ఈ రాజ్యాంగమే మానవ హక్కులను దుర్వినియోగం కాకుండా కాపాడుతుంది. అలాగే జాతీయమానవ హక్కుల సంఘం, రాష్ట్ర మానవ హక్కుల సంఘాలు ప్రజల హక్కుల రక్షణకు ఏర్పాటుచేయబడ్డాయి.
జాతీయ మానవ హక్కుల సంఘం
భారతదేశంలో మానవ హక్కులను సంరక్షించడానికి, రక్షించడానికి, ప్రమోటు చేయడానికి 1993లో ఏర్పాటు చేసిన స్వతంత్ర సంస్థ. ఈ సంఘం ప్రజలపై జరిగే హక్కుల ఉల్లంఘనలను పరిశీలిస్తుంది. ప్రభుత్వాలకు సూచనలు ఇస్తుంది. అలాగే న్యాయం అందించడానికి చర్యలు తీసుకుంటుంది.
రాష్ట్ర మానవ హక్కుల సంఘాలు
ప్రతి రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన సంస్థలు. ఇవి రాష్ట్రంలో జరిగే మానవ హక్కుల ఉల్లంఘనలను పరిశీలించి, బాధితులకు న్యాయం అందించేందుకు పనిచేస్తాయి. ఈ సంఘాలు జాతీయ మానవ హక్కుల సంఘం లాగే స్వతంత్రంగా పని చేస్తాయి. రాష్ట్ర ప్రభుత్వాలకు సిఫార్సులు చేస్తాయి. అలాగే చైల్డ్ రైట్స్ కమిషన్, విమెన్ కమిషన్ ఇవన్నీ మానవ హక్కులను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
ప్రస్తుత ప్రపంచ పరిస్థితి - ఇంకా ఉన్న సవాళ్లు
ప్రపంచ వ్యాప్తంగా సాంకేతికత అభివృద్ధి చెందుతున్నా, మానవ హక్కులకు ఇంకా అనేక సమస్యలు ముందున్నాయి. ఉదాహరణకి, యుద్ధాలు, శరణార్థుల సంక్షోభం. అంటే ఉక్రెయిన్, గాజా, ఆఫ్రికా, సిరియా వంటి ప్రాంతాల్లో లక్షలాది మంది నిరాశ్రయులవుతున్నారు. అక్కడి పిల్లలు యుద్ధ భయంతో చదువు కోల్పోతున్నారు. మహిళలు లైంగిక హింసకు గురవుతున్నారు. ఇవన్నీ మానవ హక్కుల హీనస్థితిని సూచిస్తున్నాయి.
ఇప్పటి ప్రపంచంలో డేటా ప్రైవసీ కూడా ఒక మానవ హక్కే.
డేటా దోపిడీ, టెక్నాలజీ మోసాలు, ఆన్‌లైన్ హింస, ఫేక్ న్యూస్ ఇవి ప్రజల స్వేచ్ఛ, మానసిక భద్రతకు ప్రమాదాలు.అలాగే కొన్ని దేశాలలో మహిళలు ఇంకా అసురక్షితులుగానే ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా గృహహింస, ఆమ్లదాడులు, సామాజిక వివక్ష, వివాహ బలవంతాలు లాంటివి మహిళలు ఎదుర్కొంటున్నారు. ఇంకా అనేక మానవ హక్కుల ఉల్లంఘనలను ఎదుర్కొంటున్నారు. కొన్ని దేశాలలో పేదరికం, నిరుద్యోగం కారణంగా పిల్లలు ఫ్యాక్టరీల్లో పని చేస్తున్నారు. వీధుల మీద బానిసలుగా జీవనం చేస్తున్నారు. అక్రమ రవాణాలో చిక్కుకుంటున్నారు. ఇది ప్రపంచానికి మచ్చ. వాతావరణ మార్పులు కొత్తగా మానవ హక్కులకు సవాలు విసురుతున్నాయి.
కాలుష్యం, వరదలు, ఎండలు, పొడిగాలుల పేద ప్రజల జీవన హక్కును ప్రమాదంలోకి నెడుతున్నాయి. “వాతావరణ న్యాయం అంటే మానవ న్యాయమే”.” ఇప్పుడు ఇది ప్రపంచ నినాదంగా మారింది. ఈ రోజున ప్రభుత్వాలు అవగాహన కార్యక్రమాలు, పాఠశాలల్లో కార్యక్రమాలు, మీడియా చర్చలు, ఎన్జీవోలు ర్యాలీలు, అవార్డులు, సదస్సులు, జరిగి ప్రజల్లో హక్కులపై అవగాహన పెరుగుతుంది.
మన హక్కులు - మన బాధ్యతలు
హక్కులు కావాలంటే, కర్తవ్యాలు కూడా పాటించాలి. ప్రతి మనిషి చేయవలసిన బాధ్యతలు కొన్ని ఉన్నాయి. ఇతరుల హక్కులను గౌరవించడం, మహిళలు, పిల్లలు, వృద్ధులను రక్షించడం లాంటివి. వివక్షను పరిగణనలోకి తీసుకుని ప్రతిఘటించడం, సామాజిక సేవలలో పాల్గొనడం, హింస, అన్యాయం జరిగితే స్పందించడం, రాజ్యాంగ విలువలను గౌరవించడం, మన హక్కులు మన బాధ్యతలతోనే జీవం పొందుతాయి.
మానవ హక్కుల దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఒక ముఖ్యమైన మార్గం ఏమిటంటే, ఈ తీర్మానం ప్రపంచంపై, సమాజంపై ప్రతి వ్యక్తి జీవితంపై చూపిన ప్రభావాన్ని అభినందించడానికి కొంత సమయం కేటాయించడం. అంటే ప్రాంతీయ స్థాయిలో ఆరోగ్యం, శ్రేయస్సును ప్రోత్సహించడానికి జరుగుతున్న ధార్మిక కార్యక్రమాలలో పాలుపంచుకోవడం, మానవ హక్కుల దినోత్సవం గురించి ప్రచారం చేయడం, చాలా మందికి మానవ హక్కుల దినోత్సవం గురించి తెలియదు, కాబట్టి అవగాహన పెంచడానికి సహాయం చేయడం గొప్ప ప్రారంభం అవుతుంది. విద్యార్థులు పోస్టర్‌లు తయారు చేసి, పాఠశాలలో ఒక చిన్న కార్యక్రమాన్ని నిర్వహించవచ్చు. ఆఫీస్ లేదా గిడ్డంగి కార్మికులు బ్రేక్‌రూమ్‌లో నోటీసులు పెట్టవచ్చు లేదా మానవులందరి హక్కులకు మద్దతుగా ఈ రోజును పాటించాలని ప్రజలకు గుర్తు చేస్తూ కంపెనీ ఇమెయిల్ పంపవచ్చు. ఇతరులు మానవ హక్కుల దినోత్సవం గురించి ఒక వీడియో తయారు చేయవచ్చు, స్నేహితులతో పంచుకోవచ్చు.
ఈ ప్రపంచ లక్ష్యం కోసం పనిచేసే డజన్ల కొద్దీ సంస్థలలో ఒకదానికి విరాళం ఇవ్వడం ద్వారా లేదా మంచి పోరాటం చేస్తున్న ఆ సంస్థలకు సహాయం చేయడానికి మీరే స్వయంగా విరాళాల సేకరణను నిర్వహించడం ద్వారా ప్రపంచంలో మార్పు తీసుకురావడానికి ఈ రోజును ఒక వేదికగా తీసుకోండి.
ఉదాహరణకి అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ రాజకీయం లేదా మతంతో సంబంధం లేకుండా, మానవ హక్కులను ప్రతి ఒక్కరూ అనుభవించే ప్రదేశంగా ప్రపంచాన్ని మార్చడానికి ప్రజలను సమీకరిస్తుంది. రైట్ ఫర్ రైట్స్ అంటూ పోరాడుతుంది. అలాగే హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్థ మానవ హక్కుల దుర్వినియోగాన్ని పరిశోధించి, ఆపై నివేదించడానికి పనిచేస్తుంది. ఈ బృందంలో 70 దేశాల నుండి వచ్చిన 450 కంటే ఎక్కువ మంది వ్యక్తులు ఉన్నారు. వీరు చట్టం, వ్యాపారం, విధానం మరిన్నింటికి సహాయం చేస్తారు.ఇలాంటి సంస్థలతో భాగస్వామ్యం అవ్వడం ఒక మంచి ప్రయత్నం అవుతుంది.
మానవ హక్కుల భవిష్యత్తు
భవిష్యత్తులో మానవ హక్కుల రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నియంత్రణ, డిజిటల్ భద్రత, వాతావరణ న్యాయం, లింగ సమానత్వం, వికలాంగుల హక్కులు, పేదరిక నిర్మూలన వంటివి ముఖ్య పాత్రలు పోషించబోతున్నాయి.
మానవ హక్కుల దినోత్సవం మనిషి పట్ల గౌరవానికి ప్రతీక. ప్రతి వ్యక్తి పుట్టుకతోనే స్వేచ్ఛ, భద్రత, గౌరవం, న్యాయం పొందే హక్కు కలిగి ఉన్నాడని ప్రపంచానికి గుర్తు చేసే రోజే ఇది. విభేదాలు తొలగి మనుషుల మధ్య అనురాగం పెరిగే ప్రపంచం కావాలంటే, మానవ హక్కులను కాపాడటం ఒక బాధ్యత కాదు, అది మనిషి తనకు తాను ఇచ్చే శబ్దంలాంటి ప్రతిజ్ఞ అని అందరూ బావించాలి. డిసెంబర్ 10 మనకు ఎప్పటికీ గుర్తు చేస్తుంది. “మానవ హక్కులు ఒక దేశానికే కాదు, మొత్తం మానవాళికే చెందుతాయి.”
2025లో థీమ్:
“Our Everyday Essentials”
అంటే “మన ప్రతిరోజు అవసరాలు” .
ఈ థీమ్ ద్వారా ప్రపంచ మానవ హక్కుల ప్రకటన మన రోజువారీ జీవితంలో ఎంత ముఖ్యమైనదో, ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న సవాళ్లను అది ఎలా పరిష్కరించగలదో అనే విషయాన్ని ప్రధానంగా చూపిస్తుంది.
