Let's talk: editor@tmv.in
మానవ అక్రమ రవాణ నిరోధానికి కఠిన చట్టం తీసుకురావాలి:ఆప్

మానవ అక్రమ రవాణ నిరోధానికి కఠిన చట్టం తీసుకురావాలి:ఆప్

Pinjari Chand
4 డిసెంబర్, 2025

దేశంలో పెరిగిపోతున్న మానవ అక్రమ రవాణా నిరోధానికి కఠిన చట్టం తీసుకురావాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) రాజ్యసభ సభ్యుడు అశోక్ కుమార్ మిత్తల్ డిమాండ్ చేశారు. దేశంలో పిల్లలు, మహిళలు కనిపించకుండా పోవడం పై బుధవారం ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యసభలో జీరో అవర్‌లో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ జాతీయ నేర నిర్ధారణ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) గణాంకాల ప్రకారం దేశంలో 47 వేల మంది అమాయక పిల్లలు ఇంకా కనిపించకుండా పోయారని, వారి ఆచూకీ తెలియడం లేదని తెలిపారు. ఇంకా ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే సుమారు 1.97 లక్షల మంది మహిళలు ఇప్పటికీ కనిపించకుండా పోయారని ఎన్‌సీఆర్‌బీ డేటా చెబుతోందని ఆయన అన్నారు. ఇవి అధికారిక లెక్కలు మాత్రమేనని, పోలీస్ స్టేషన్‌కు చేరని కేసులు లక్షల్లో ఉంటాయని అన్నారు.

సుప్రీంకోర్టు కూడా ఇటీవల భారతదేశంలో ప్రతి 8 నిమిషాలకో పిల్లవాడు కనిపించకుండా పోతున్నాడని పేర్కొందని గుర్తు చేశారు. ఈ పిల్లలు ఎక్కడికి పోతారు? ఈ మహిళలు ఎక్కడికి వెళతారు? నిజం ఏమిటంటే ఇది కేవలం కనిపించకుండా పోవడం మాత్రమే కాదు, ఇది నీచమైన సంఘటిత మానవ అక్రమ రవాణా కుట్ర అని మిత్తల్ ఆరోపించారు. ఈ అపహరించబడిన అమాయక పిల్లలను, మహిళలను బిచ్చగాళ్లుగా, వేశ్యావృత్తిలోకి, వెట్టిచాకిరీలోకి నెట్టివేస్తున్నారని, అవయవ వ్యాపారంతో నరకంలోకి కూడా తోసివేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సంక్షోభాన్ని అరికట్టేందుకు మూడు సూచనలు

• ఇలాంటి కనిపించకుండా పోవడం కేసులను మానవ అక్రమ రవాణా కేసులుగానే పరిగణించాలి. మానవ అక్రమ రవాణా నివారణ, పునరావాసం కోసం కేంద్రం కఠిన చట్టం తీసుకురావాలి.

• కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలో జాతీయ స్థాయి ‘కనిపించని వ్యక్తుల ట్రాకింగ్ పోర్టల్’ ఏర్పాటు చేయాలి. ఇందులో ఫేషియల్ రికగ్నిషన్ వంటి ఆధునిక సాంకేతికత ఉపయోగించి దేశంలో ఎక్కడైనా కనిపించని పిల్లలు, మహిళలను గుర్తించే విధంగా చేయాలి.

• జనగణనలో కనిపించని, ఆచూకీ తెలియని వ్యక్తుల కోసం ప్రత్యేక కాలమ్ పెట్టాలి. వాళ్లను లెక్కించకపోతే ఎలా వెతుకుతాం? అని ప్రశ్నించారు.

ఇదే జీరో అవర్‌లో వివిధ పార్టీల ఎంపీలు తమ రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు ప్రస్తావించారు.

మూడు లక్షల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి: సంతోష్ కుమార్ ,సీపీఐ, ఎంపీ (కేరళ)

దేశంలోని కాలేజీలు, యూనివర్సిటీల్లో సుమారు 3 లక్షల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, 6.5 లక్షల మంది ఉపాధ్యాయులు కాంట్రాక్టు/అడ్‌హాక్ పద్ధతిలో పనిచేస్తూ ఉద్యోగ భద్రత, తగిన జీతం లేక ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని తక్షణమే భర్తీ చేయాలని, కాంట్రాక్టు ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరారు.

రోడ్ల సౌకర్యం కల్పించాలి: నబమ్ రేబియా, బీజేపీ ఎంపీ (అరుణాచల్ ప్రదేశ్)

ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన ఫేజ్-4లో ఈశాన్య రాష్ట్రాలకు 250+ జనాభా ప్రమాణం విధించడం వల్ల అరుణాచల్ ప్రదేశ్‌లో కేవలం 84 గ్రామాలకు మాత్రమే అర్హత ఉందని, 500కు పైగా గ్రామాలు రోడ్డు సౌకర్యం లేకుండా మిగిలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అరుణాచల్‌కు కనీసం 100+ జనాభా ప్రమాణం వర్తింపజేయాలని, లెఫ్ట్ తీవ్రవాద ప్రాంతాలకు వర్తించే నియమం ఇక్కడ కూడా అమలు చేయాలని కోరారు.

దివ్యాంగ్ జన్ పదం వాడాలి: తిరుచ్చి శివ, డీఎంకే ఎంపీ (తమిళనాడు)

ప్రధాని నరేంద్ర మోడీ 2014-15లో ‘వికలాంగులు’ బదులు ‘దివ్యాంగ్‌జన్’ అనే పదం ప్రవేశపెట్టారని, కానీ ఐక్యరాజ్యసమితి వికలాంగుల కమిటీ ఈ పదాన్ని అవమానకరంగా పరిగణించిందని తెలిపారు. అధికారికంగా దివ్యాంగ్‌జన్ లేదా ది డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ (విభిన్న సామర్థ్యం ఉన్నవారు) అనే పదాన్ని వాడాలని కోరారు.

కల్తీ పై ఉక్కుపాదం మోపాలి:ప్రియాంక చతుర్వేది, శివసేన (యూబీటీ) నేత

దేశవ్యాప్తంగా ఆహారం, మందుల్లో కల్తీ పెరిగిపోతోందని, శిశువుల మరణానికి కారణమైన కల్తీ కాఫ్ సిరప్‌లు, నాసిరకం మందులు, క్యాన్సర్‌కు దారితీసే కల్తీ ఆహార పదార్థాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు, శిక్షలు విధించాలని కోరారు.