


మానవాళికి సమ్రాట్ సంప్రతి మ్యూజియం చాలా ముఖ్యం: ప్రధాని మోడీ
ప్రపంచం అస్థిరత, అశాంతి అగ్నిజ్వాలల్లో మునిగిపోతున్న ఈ సమయంలో శాంతి, అహింస సందేశాన్ని అందించే స్థలంగా సమ్రాట్ సంప్రతి మ్యూజియం నిలుస్తుందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. గుజరాత్‌లోని కోబా గ్రామం సమీపంలో ఉన్న శ్రీ మహావీర్ జైన్ ఆరాధనా కేంద్రం ప్రాంగణంలో నిర్మించిన సమ్రాట్ సంప్రతి మ్యూజియాన్ని మహావీర్ జయంతి సందర్భంగా ఆయన మంగళవారం ప్రారంభించారు. ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో ఈ మ్యూజియం వారసత్వం, సందేశం కేవలం భారత్‌కే కాకుండా మానవాళికే ముఖ్యమని మోడీ పేర్కొన్నారు. భారతదేశం వైవిధ్యం, ఐక్యతను ఈ మ్యూజియం ప్రతిబింబిస్తోందని ఆయన అన్నారు. వేదాలు, పురాణాలు, ఆయుర్వేదం, యోగా వంటి సంప్రదాయాలను ఒకే చోట ప్రతిబింబించే ప్రయత్నం ఇది అని తెలిపారు. ఈ మ్యూజియం పేరు మౌర్య చక్రవర్తి అశోకుని మనవడు అయిన సమ్రాట్ సంప్రతి పేరిట నెలకోల్పారు. జైనమతాన్ని, అహింస సిద్ధాంతాన్ని వ్యాప్తి చేసిన రాజుగా ఆయన ప్రసిద్ధి పొందారు. తత్వశాస్త్రం, పాలన మధ్య అనుసంధానాన్ని సమ్రాట్ సంప్రతి సూచిస్తారని మోడీ అన్నారు. మ్యూజియంలో ఏర్పాటు చేసిన ఏడు గ్యాలరీలు భారతదేశ సాంస్కృతిక సంపదను ప్రతిబింబిస్తున్నాయని ఆయన చెప్పారు.
వారసత్వ సంరక్షణపై వ్యాఖ్యలు
భారతదేశంలోని తక్షశిల, నలంద యూనివర్సిటీ వంటి ప్రాచీన విద్యాకేంద్రాలు విదేశీ దండయాత్రల సమయంలో నాశనం కావడంతో విలువైన గ్రంథ సంపద నష్టపోయిందని ప్రధాని పేర్కొన్నారు. తరువాత కాలంలో ప్రజలు తరతరాలుగా పుస్తకాలను సంరక్షించారని అన్నారు. స్వాతంత్ర్యం తరువాత ఈ గ్రంథ సంపదను సంరక్షించడంపై గత ప్రభుత్వాలు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని ఆయన విమర్శించారు. ఈ లోపాలను ఇప్పుడు సరిదిద్దుతున్నామని చెప్పారు. ప్రాచీన పాండులిపుల(మనుషులు చేతితోనే రాసిన పుస్తకాలు)ను సంరక్షించి డిజిటల్ రూపంలో నిల్వ చేయడానికి ప్రభుత్వం ‘జ్ఞాన్ భారత్ మిషన్’ను ప్రారంభించిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న పాత పాండులిపులను సేకరించి భవిష్యత్ తరాలకు అందుబాటులో ఉంచుతామని చెప్పారు. భారత సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి ఆలయాల పునరుద్ధరణ, తీర్థక్షేత్రాల అభివృద్ధి, ఆయుర్వేదం, యోగా వంటి సంప్రదాయాల ప్రోత్సాహం వంటి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. విద్యార్థులు, పరిశోధకులు ప్రపంచం నలుమూలల నుంచి వచ్చి ఈ మ్యూజియాన్ని సందర్శించాలని ఆయన పిలుపునిచ్చారు.
గుజరాత్‌లో సెమీకండక్టర్ ప్లాంట్ ప్రారంభం
గుజరాత్‌లోని సానంద్‌లో కేన్స్ సెమీకాన్ సంస్థ ఏర్పాటు చేసిన సెమీకండక్టర్ అసెంబ్లీ, టెస్టింగ్ యూనిట్‌ను కూడా ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ ప్లాంట్ ప్రారంభంతో ప్రపంచ మార్కెట్లో విశ్వసనీయ సెమీకండక్టర్ సరఫరాదారుగా భారత్ పాత్ర మరింత బలపడుతుందని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా భారత్‌లో బలమైన సెమీకండక్టర్ వ్యవస్థ ఏర్పడుతుందని, ఇది స్వయం సమృద్ధి లక్ష్యానికి కీలక అడుగు అని తెలిపారు. భారత్ 2021లో ప్రారంభించిన ఇండియా సెమీ కండక్టర్ మిషన్ దేశానికి విశ్వాసాన్ని కలిగించే కార్యక్రమమని పేర్కొన్నారు. తాజా బడ్జెట్‌లో సెమీకండక్టర్ మిషన్–2ను కూడా ప్రారంభించామని చెప్పారు. సానంద్‌లోని ఈ ప్లాంట్ ద్వారా రోజుకు లక్షల సంఖ్యలో చిప్‌లు తయారవుతాయని అధికారులు తెలిపారు. ఈ యూనిట్ ద్వారా కాలిఫోర్నియాలోని కంపెనీలకు ఇంటెలిజెంట్ పవర్ మాడ్యూల్స్ సరఫరా చేయనున్నట్లు ప్రధాని చెప్పారు. ఈ ప్రాజెక్టుతో సానంద్, సిలికాన్ వ్యాలీ మధ్య సాంకేతిక అనుసంధానం ఏర్పడిందని ఆయన వ్యాఖ్యానించారు.
సరఫరా గొలుసులపై గ్లోబల్ ప్రభావం
ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సంఘర్షణలు చిప్స్, అరుదైన ఖనిజాలు , ఇంధన రంగాల సరఫరా గొలుసులను తీవ్రంగా ప్రభావితం చేశాయని ప్రధాని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో భారత్ భవిష్యత్ టెక్నాలజీ, ఇంధన భద్రత కోసం బలమైన పునాది వేస్తోందని తెలిపారు.
‘పాక్స్ సిలికా’లో భారత్ భాగస్వామ్యం
భారత్ ఇటీవల అమెరికా ఆధ్వర్యంలో ప్రారంభమైన పాక్స్ సిలికా అనే వ్యూహాత్మక కూటమిలో చేరిందని చెప్పారు. ఈ కూటమి ముఖ్యంగా సెమీకండక్టర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అరుదైన ఖనిజాల సరఫరా గొలుసులను భద్రపరచడంపై దృష్టి సారిస్తోంది. దేశంలో కీలక ఖనిజాల స్వావలంబన కోసం నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్ ప్రారంభించామని ప్రధాని తెలిపారు. ఖనిజాల తవ్వకం, ఉత్పత్తి పెంపు, పునర్వినియోగాన్ని ప్రోత్సహించేందుకు రూ.1,500 కోట్ల పథకం అమలు చేస్తున్నట్లు చెప్పారు.
‘రేర్ ఎర్త్ కారిడార్’ ప్రణాళిక
ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ వంటి తీర రాష్ట్రాలను కలుపుతూ రేర్ ఎర్త్ కారిడార్ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఖనిజ తవ్వకం నుంచి తయారీ వరకూ సమగ్ర విలువ గొలుసు (వాల్యూ చైన్) ఏర్పడేలా ఈ ప్రణాళిక రూపొందించారని తెలిపారు. ఈ దశాబ్దాన్ని భారత్ ‘టేకేడ్’గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రధాని అన్నారు. ఈ కాలంలో తీసుకునే టెక్నాలజీ నిర్ణయాలు భారత్ భవిష్యత్ నాయకత్వాన్ని బలపరుస్తాయని చెప్పారు.
సెమీకండక్టర్ రంగంలో భారీ పెట్టుబడులు
2021లో ప్రారంభించిన ఇండియా సెమీకండక్టర్ మిషన్ కింద దేశంలోని పది రాష్ట్రాల్లో సుమారు రూ.1.60 లక్షల కోట్ల ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని తెలిపారు. బడ్జెట్‌లో ప్రకటించిన సెమీకండక్టర్ మిషన్ -2 ద్వారా ఉత్పత్తి రంగంలో పూర్తి స్వావలంబన లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. భవిష్యత్ అవసరాల కోసం దేశంలో త్వరలో 85,000కుపైగా సెమీకండక్టర్ డిజైన్ నిపుణులను తయారుచేయనున్నట్లు ప్రధాని వెల్లడించారు. ‘చిప్స్-టు-స్టార్టప్’ కార్యక్రమం కింద 400కుపైగా విశ్వవిద్యాలయాలు, స్టార్టప్‌లకు ఆధునిక డిజైన్ సాధనాలను అందిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం భారత సెమీకండక్టర్ మార్కెట్ సుమారు రూ.4.5 లక్షల కోట్లుగా ఉందని, ఇది త్వరలో రూ.9 లక్షల కోట్లకు పైగా చేరే అవకాశముందని ప్రధాని చెప్పారు. దేశానికి అవసరమైన ఎక్కువ చిప్‌లను దేశంలోనే తయారు చేయడమే లక్ష్యమని స్పష్టం చేశారు.
