
మానవ-వన్యప్రాణి ఘర్షణ నివారణకు 'హనుమాన్' ప్రాజెక్ట్: డిప్యూటీ సీఎం
మానవులు, ఏనుగుల మధ్య పెరుగుతున్న సంఘర్షణను నివారించడంతో పాటు అటవీ జంతువులను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సంరక్షణ అందించే లక్ష్యంతో రాష్ట్ర అటవీ శాఖ రూపొందించిన 'హనుమాన్ ప్రాజెక్టు వివరాలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ సమీక్షించారు. 11 అంశాలతో కూడిన ఈ ప్రాజెక్ట్‌ను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆయనకు వివరించారు. ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లడానికి అంశాల వారీగా నిర్దిష్ట కాలపరిమితి అవసరమని మంత్రి స్పష్టం చేశారు. అదేవిధంగా జంతువుల సంచార సమాచారం ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేసేందుకు వీలుగా అధునాతన టెక్నాలజీతో కూడిన కొత్త యాప్‌ను మార్చి 3వ తేదీలోపు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఈ ప్రాజెక్టుపై సమన్వయం కోసం నవంబర్ 3వ వారంలో సమీక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ప్రాజెక్టులోని ప్రతి అంశానికి కాలపరిమితి పెట్టుకోవాలని ముఖ్యంగా ఏనుగుల వల్ల దెబ్బతింటున్న పంటల స్థానంలో ప్రత్యామ్నాయాలు, వాటికి రైతులను ఒప్పించే అంశాలపై దృష్టి సారించాలన్నారు. చిత్తూరు జిల్లాలో మామిడి తోటలు ఎక్కువగా ఉండడం వల్ల ఏనుగుల తాకిడి ఎక్కువగా ఉంటుంది అలాంటి ప్రాంతాల్లో పంటల్లో మార్పులు తీసుకురావడానికి పంచాయతీరాజ్, వ్యవసాయ, ఉద్యానవన శాఖలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. రైతుల ఆదాయంపై ప్రభావం పడకుండా ఉండేందుకు తేనెటీగల పెంపకం, ఎకో టూరిజం అభివృద్ధి వంటి ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపై కూడా దృష్టి పెట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఇప్పటికే అమల్లో ఉన్న 'గజ ప్రజా యాప్' స్థానంలో నూతన సాంకేతికతతో తమ పరిసర ప్రాంతాల్లో సంచరించే జంతువుల సమాచారం అందించేలా ప్రత్యేక యాప్‌ను సిద్ధం చేయాలన్నారు. కేంద్రం నుంచి అనుమతి వచ్చిన ఏనుగుల రేడియో కాలర్ వ్యవస్థను అత్యధిక ప్రయోజనం ఉండే ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని, ఒంటరి ఏనుగుల సమాచారం సేకరించాలని సూచించారు.
మరో ముఖ్యమైన అంశంగా హనుమాన్ ప్రాజెక్టులో భాగంగా పట్టణాల్లో మాదిరిగానే గ్రామాల్లోనూ జనావాసాల్లోకి వచ్చే పాముల నుంచి ప్రజలకు హాని కలగకుండా ఉండేందుకు 'సర్ప మిత్ర' వాలంటీర్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి పంచాయతీ పరిధిలో వాలంటీర్లను ఎంపిక చేసి శిక్షణ ఇవ్వనున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. గ్రామ స్థాయిలో ముందుకు వచ్చే సర్ప మిత్ర వాలంటీర్లకు అటవీ శాఖ నుంచి ప్రోత్సాహకాలు అందించాలని ఉప ముఖ్యమంత్రి [పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలమనేరు పర్యటనకి విచ్చేసిన పవన్ కళ్యాణ్ జిల్లా అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు, జనసేన, టీడీపీ, బీజేపీ నేతల సాదర స్వాగతం మధ్య ప్రజల నుంచి, జనసేన శ్రేణుల నుంచి అర్జీలు స్వీకరించి, వారి సమస్యలు తెలుసుకున్నారు.
