Let's talk: editor@tmv.in
మానవత్వం చిరునవ్వు చిందించే రోజు

మానవత్వం చిరునవ్వు చిందించే రోజు

Dantu Vijaya Lakshmi Prasanna
13 నవంబర్, 2025

ప్రపంచం వేగంగా మారుతోంది… యంత్రాలు మన పని చేస్తున్నాయి, కానీ మనసులు మాత్రం మానవత్వాన్ని కోల్పోతున్నాయి. ఆన్‌లైన్‌లో వేల స్నేహితులు ఉన్నా, మన హృదయం ఒంటరితనంలో మునిగిపోతోంది. అత్యాధునిక సాంకేతిక యుగంలో మనిషి చేరువైనంతగా భావాలు, అనురాగం, దయ మాత్రం దూరమవుతున్నాయి. ఇలాంటి సమయంలో నవంబర్ 13 ప్రపంచ దయా దినోత్సవం (వరల్డ్ కైండ్ నెస్ డే) మనకు ఒక విషయాన్ని గుర్తుచేస్తుంది. మనిషి కావడం అంటే కేవలం జీవించడం కాదు, ఇతరుల కోసం సానుభూతి చూపడం కూడా అని అర్ధం.

ప్రతీ ఒక్కరి జీవితంలో చిన్నచిన్న కరుణ క్షణాలే పెద్ద మార్పు తెస్తాయి. ఒక చిరునవ్వు, ఒక సాయం చేసే చేయి, ఒక మనసుతో పలికిన మాట, ఇవే చీకటిని చెదరగొట్టే దీపాలుగా మారతాయి. ఈ ప్రపంచం యుద్ధాలతో, అసహనంతో, విభేదాలతో నిండిపోతున్నప్పుడు, ఒక చిన్న దయా చర్యే మానవత్వాన్ని మళ్లీ వెలిగించగల శక్తి. పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు, ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (నవంబర్ 13) సమాజము లో దయాగుణము గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము…

ప్రపంచ సానుభూతి (దయ) దినోత్సవం: గాయపడిన ప్రపంచాన్ని మాన్పే చిన్న మానవత్వం

1990ల మధ్యలో, స్మాల్ కైండ్నెస్ మూవ్‌మెంట్ అనే సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలను ఆహ్వానిస్తూ, వారు తమ దేశాల్లో ప్రారంభించిన దయా కార్యక్రమాల గురించి పంచుకునేలా ఒక సదస్సు నిర్వహించింది. ఆ సదస్సు ఎంతో విజయవంతమైంది, అందుకే 1997లో మరో సదస్సు కూడా జరిగింది. ఈ సదస్సులు వరల్డ్ కైండ్ నెస్ మూవ్‌మెంట్ అభివృద్ధికి బలాన్ని ఇచ్చాయి. చివరకు, 1998లో వరల్డ్ కైండ్ నెస్ డే ని వరల్డ్ కైండ్ నెస్ మూవ్‌మెంట్‌ అధికారికంగా ప్రకటించింది.

1997లో జపాన్‌లో జరిగిన టోక్యో సదస్సులో, జపాన్ వివిధ దేశాల దయా సంస్థలను ఒకచోట చేర్చి, ప్రపంచవ్యాప్తంగా ఒక గ్లోబల్ కైండ్ నెస్ మూవ్‌మెంట్ అవసరాన్ని ప్రాధాన్యతగా చూపించింది. అనంతరం, 2000 నవంబర్‌లో సింగపూర్‌లో వరల్డ్ కైండ్ నెస్ మూవ్‌మెంట్ ప్రారంభించబడింది. ప్రపంచంలోని అనేక దేశాలు నవంబర్ 13న వరల్డ్ కైండ్ నెస్ డేని జరుపుకుంటున్నాయి. చాలా దేశాలు వరల్డ్ కైండ్ నెస్ మూవ్‌మెంట్‌ సభ్యదేశాలుగా ఉన్నాయి.

ప్రపంచం లో నేటి పరిస్థితి: మానవత్వం అవసరం ..

సాంకేతిక పరిజ్ఞానం, సంపద, శక్తి ఇవన్నీ పెరుగుతున్నా, మానవత్వం మాత్రం తగ్గిపోతోంది. ఇటీవల ఉక్రెయిన్, గాజా, సూడాన్ వంటి దేశాలలో యుద్ధాలు, నిరపరాధులపై దాడులు ప్రపంచానికి చూపించాయి. దయ లేకుంటే మానవత్వం ఎంత నాశనం అవుతుందో ఈ సంఘటనలు తెలియజేస్తాయి. దయ అంటే కేవలం “సహాయం” కాదు. ఇతరుల బాధను మనసుతో అనుభవించడం. ఉక్రెయిన్‌ యుద్ధ సమయంలో అనేక దేశాలు తమ తలుపులు శరణార్థులకు తెరిచాయి, ఆహారం పంపాయి, పిల్లలకు విద్య అందించాయి. అది రాజకీయ సహాయం కాదు. అది మానవతా సేవ. ఇళ్లు కోల్పోయిన పిల్లలు, శరణార్థి శిబిరాల్లో తల్లులు, ఒంటరితనంలో వృద్ధులు వీరందరూ ఒకే అభిలాషతో ఉన్నారు. “ఎవరైనా మన బాధను గమనించాలి.” ఈ సమయంలో, ఒక చిన్న తోడ్పాటు, ఒక కరుణా చూపు అనేకమందికి ఆశగా మారుతోంది.

ప్రస్తుత ప్రపంచ యుద్ధాల ప్రభావం, ప్రజలు అనుభవిస్తున్న నష్టాలు, ప్రపంచ దేశాల సహాయం

ప్రపంచం నేడు సాంకేతికంగా, వైజ్ఞానికంగా ఎంతో ముందుకు వెళ్లినా… యుద్ధాల వల్ల మానవత్వం వెనక్కి వెళ్తోంది. యూరప్‌, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా ప్రాంతాల్లో జరుగుతున్న యుద్ధాలు లక్షలాది మందిని నిరాశ్రయులను చేశాయి. ఇజ్రాయెల్–పాలస్తీనా, ఉక్రెయిన్–రష్యా, సూడాన్–ఎథియోపియా లాంటి దేశాల మధ్య జరుగుతున్న ఘర్షణలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకూ, సామాజిక శాంతికీ పెద్ద ముప్పుగా మారాయి.

ఈ యుద్ధాల్లో అత్యధికంగా నష్టపోతున్నది సాధారణ ప్రజలే. యుద్ధ భూముల్లో బాంబులు, తుపాకులు కురుస్తున్నప్పుడు నిరపరాధులైన మహిళలు, చిన్నారులు, వృద్ధులు ప్రాణాలు కోల్పోతున్నారు. లక్షల మంది తమ ఇళ్లను, ఊర్లను వదిలి శరణార్థులుగా ఇతర దేశాలకు పారిపోతున్నారు. ఉక్రెయిన్‌లో వేలాది మంది విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు జీవనాధారాన్ని కోల్పోయారు. ఇజ్రాయెల్‌–పాలస్తీనా ప్రాంతంలో పిల్లలు పాఠశాలకు వెళ్లడం మానేశారు. ఆసుపత్రులు ధ్వంసమవడంతో చికిత్స లేక ప్రజలు బాధపడుతున్నారు. ఆహారం, నీరు, విద్యుత్‌ లేని పరిస్థితుల్లో జీవించడం వాళ్లకు భయంకర అనుభవమైంది. అదేవిధంగా యుద్ధాల ప్రభావం ఆర్థికంగా కూడా తీవ్రమైంది. చమురు ధరలు పెరగడంతో ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరిగింది. పేద దేశాలు మరింత కష్టాల్లో పడ్డాయి. రైతులు పంటలు పండించలేకపోతున్నారు, వ్యాపారాలు మూతపడుతున్నాయి, నిరుద్యోగం పెరుగుతోంది. మానసికంగా ప్రజల్లో భయం, ఆందోళన పెరిగి సమాజంలో అస్థిరత పెరుగుతోంది. వారికి కావాలిసింది మనవతతో ఆదరించే ఒక చెయ్యి. హక్కున చేర్చుకునే మానవత్వం .

ప్రజలు కోరుకుంటున్నది ఏమిటి?

యుద్ధాల వల్ల నలిగిపోయిన ప్రజలకు ఒకే కోరిక శాంతి . వారికి కావలసింది భద్రత, ఆహారం, వైద్యం, నివాసం. తాము ప్రేమించే వాళ్లతో సురక్షితంగా జీవించే హక్కు కావాలి. పిల్లలు తిరిగి పాఠశాలకు వెళ్లి చదువుకోవాలి, రైతులు పొలాల్లో పని చేయాలి, ఉద్యోగులు భయపడకుండా బయటకు వెళ్లాలి. ఈ సాధారణ జీవితం ఇప్పుడు వారికి కలలా మారింది. ప్రజలు కోరేది యుద్ధం కాకుండా చర్చలు, పరస్పర అవగాహన. వారు ప్రపంచ నేతలకు ఒక విజ్ఞప్తి చేస్తున్నారు, “మేము బాంబుల శబ్దం కాదు, పక్షుల కిలకిలారావం వినాలనుకుంటున్నాం” అని అడుగుతున్నారు. సాయం చేసే చేతుల కోసం ఎదురుచూస్తున్నారు. కనీసం జీవించే హక్కు కోసం నిరంతరం పోరాడుతున్నారు.

ప్రపంచ దేశాల సహాయం

ప్రస్తుతం ఐక్యరాజ్యసమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థ , రెడ్‌ క్రాస్‌ వంటి సంస్థలు శరణార్థులకు ఆహారం, మందులు, నివాసం వంటి సహాయం అందిస్తున్నాయి. అమెరికా, యూరోప్‌, భారతదేశం, జపాన్‌, కెనడా వంటి దేశాలు కూడా యుద్ధ ప్రాంతాలకు మానవతా సహాయం పంపిస్తున్నాయి.

భారతదేశం “ఆపరేషన్‌ గంగా”, “ఆపరేషన్‌ దోస్త్‌” వంటి కార్యక్రమాల ద్వారా ఉక్రెయిన్‌, టర్కీ లాంటి దేశాల ప్రజలకు సహాయం అందించింది. వైద్య బృందాలు, ఆహార పదార్థాలు, అత్యవసర మందులు పంపి మానవత్వానికి నిలువెత్తు ఉదాహరణగా నిలిచింది.

అదేవిధంగా ప్రపంచ దేశాలు శాంతి చర్చలు జరిపేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి భద్రతామండలి అనేక సమావేశాలు ఏర్పాటు చేసి, యుద్ధ విరమణ కోసం పిలుపునిస్తోంది. యుద్ధం అనేది ఎప్పటికీ ఎవరికీ మేలు చేయదు. అది కేవలం విధ్వంసం, కన్నీళ్లు, బాధలను మాత్రమే మిగులుస్తుంది. ప్రపంచం అంతా ఒక కుటుంబమని మనం గుర్తించాలి. మతం, జాతి, భూభాగం కోసం పోరాడటం కన్నా మానవత్వం కోసం కృషి చేయడం నిజమైన విజయం. ప్రజలు కోరుకునేది ఒక్కటే శాంతి, సురక్షిత జీవితం, పరస్పర ప్రేమ. అది అందించగలిగితేనే ఈ ప్రపంచం నిజమైన అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుంది.

ఇటీవల పెరుగుతున్న ప్రకృతి విపత్తులు, మానవాళి ఎదుర్కొంటున్న సవాళ్లు భారత సహాయ చర్యలు

ఇటీవల సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి విపత్తులు గణనీయంగా పెరిగాయి. వాతావరణ మార్పులు, అతి వర్షాలు, ఎండల తీవ్రత, సముద్ర మట్టం పెరగడం వలన అనేక దేశాలు ముప్పులో ఉన్నాయి. హరికేన్లు, వరదలు, భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనలు, సునామీలు వంటి విపత్తులు వరుసగా చోటుచేసుకోవడం ప్రజల జీవనాన్ని పూర్తిగా దెబ్బతీస్తోంది.

ఇటీవలి కాలంలో జపాన్‌, ఫిలిప్పీన్స్‌, బంగ్లాదేశ్‌, ఇండోనేషియా, టర్కీ, నేపాల్‌ లాంటి దేశాలు భారీ నష్టాన్ని చవిచూశాయి. టర్కీలో జరిగిన భూకంపం వలన లక్షలాది మందికి ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. ఇండోనేషియాలో వరదలు, జపాన్‌లో తుఫాన్లు, యూరప్‌లో అగ్నిప్రమాదాలు, ఇవన్నీ మానవజాతికి పెద్ద హెచ్చరికలుగా మారాయి.

భారతదేశం కూడా అనేక ప్రకృతి విపత్తులను ఎదుర్కొంటోంది. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లో వరదలు తరచూ సంభవిస్తున్నాయి. హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ లలో కొండచరియలు, వర్షాల వలన మానవ నష్టం పెరిగింది. కరువు పరిస్థితులు, వర్షాభావం రైతుల జీవనాధారాన్ని సవాలు చేస్తున్నాయి.

ప్రజలు ఇలాంటి విపత్తుల్లో ఆహారం, త్రాగునీరు, నివాసం, వైద్య సహాయం కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. చాలామంది తమ ఇళ్లు కోల్పోయి ప్రభుత్వ శిబిరాల్లో జీవిస్తున్నారు. పిల్లలు పాఠశాలలు మానేశారు, రైతులు పంటలు నాశనం కావడంతో కష్టాల్లో కూరుకుపోయారు. భారతదేశం ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు జాతీయ విపత్తు ప్రతిస్పందన బలగం ఎన్ డి ఆర్ ఎఫ్ ను ఏర్పాటు చేసింది. ఈ బలగం దేశవ్యాప్తంగా తక్షణమే స్పందించి ప్రాణరక్షణ, ఆహార పంపిణీ, వైద్య సేవలు వంటి సహాయం అందిస్తోంది. ఇది మానవతకు మరో రూపం. ఉదాహరణకు, 2023లో మణిపూర్‌, హిమాచల్‌లో వచ్చిన వరదల సమయంలో ఈ బృందాలు నదుల్లో చిక్కుకున్న వందలాది మందిని రక్షించాయి. తుఫాన్‌ “రేమల్” సమయంలో ఆంధ్ర–ఒడిశా తీర ప్రాంతాల్లో ముందుగానే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం ద్వారా వేలాది ప్రాణాలను కాపాడారు.

అంతేకాక, భారత్‌ ఇతర దేశాలకు కూడాప్రపంచ దేశాలకు సహాయం అందిస్తోంది. 2023లో టర్కీలో జరిగిన భారీ భూకంపం తర్వాత “ ఆపరేషన్‌ దోస్త్‌ ” పేరుతో భారత ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలు అక్కడికి వెళ్లి శిథిలాల మధ్య చిక్కుకున్న వారిని రక్షించాయి. అలాగే, నేపాల్‌, శ్రీలంక, మాల్దీవులు వంటి పొరుగు దేశాలకు వరదలు, తుఫాన్ల సమయంలో మానవతా సహాయం అందిస్తోంది.

ప్రపంచ దేశాల పరిస్థితి

ఇప్పటి పరిస్థితిలో చాలా దేశాలు అంతర్జాతీయ సహాయం కోసం ఎదురు చూస్తున్నాయి. వాతావరణ మార్పు ఫలితంగా సైక్లోన్లు, హీట్‌వేవ్స్‌ తీవ్రత పెరిగింది. ఆఫ్రికా దేశాలు కరువు కారణంగా ఆకలి, నీటి కొరతతో బాధపడుతున్నాయి. యూరప్‌లో అగ్నిప్రమాదాలు విస్తరించాయి. అమెరికాలో హరికేన్లు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి.

ప్రపంచ సంస్థలు యుఎన్ఐసిఇఎఫ్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వంటి సంస్థలు ఆహారం, మందులు, నీరు, నివాసం వంటి సహాయం అందిస్తున్నాయి. కానీ విపత్తుల పరిమాణం పెరుగుతుండటంతో ఈ సహాయం చాలదని నిపుణులు చెబుతున్నారు.ఇవన్నీ మానవతా దృక్పదం తో చేసే సహాయక చర్యలగానే భావించాలి.

ప్రకృతి విపత్తులు మానవ కృత్యాల ఫలితమే అని చెప్పవచ్చు. అడవుల నరికి వేయడం, కాలుష్యం, ఇంధన వినియోగం పెరగడం వలన భూమి వేడి పెరిగి వాతావరణ సమతుల్యత దెబ్బతింటోంది.ప్రకృతి పట్ల గౌరవం చూపడం, పర్యావరణాన్ని కాపాడటం మన బాధ్యత. అలాగే ప్రభుత్వాలు ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, సహాయక బలగాల సామర్థ్యం పెంచడం ద్వారా ప్రాణనష్టాన్ని తగ్గించగలవు.

భారతదేశంలో కూడా వరదలు, భూకంపాలు, మహమ్మారుల సమయంలో అనేకమంది యువత వాలంటీర్లు సేవ చేశారు. మానవత్వం మునిగిపోతోందని అనుకున్నా, దయ దానిని మళ్లీ నిద్రలేపింది.

కరోనా - మానవత్వం మళ్లీ జాగృతం చేసిన సమయం

కరోనా మహమ్మారి మనుషుల మధ్య దూరాన్ని పెంచినా, మన హృదయాల మధ్య బంధాన్ని మరింత బలపరిచింది. వైద్యులు రాత్రింబవళ్లు ప్రాణాలను పణంగా పెట్టి సేవ చేశారు. యువత ఆహారం పంచారు. అన్యులు కూడా అన్యులకే ఆధారమయ్యారు. అవి కేవలం సేవాకార్యాలు కాదు. మానవతా ఉద్యమం. ఆ కాలం మనకు నేర్పింది, దయే నిజమైన ఔషధం సహకారమే మనుగడకు బలమైన ఆధారం అని …

ధనం, హోదా, శక్తి అన్నీ రెండో స్థానంలోనే, మనిషి ప్రాణం, సానుభూతి, ప్రేమ మాత్రమే అసలైన విలువలు. కరోనా మనందరికీ గుర్తుచేసింది. ఏమిటంటే జీవితాన్ని రక్షించేది కేవలం మందులు కాదు, మనసులోని కరుణ ఎదుటివారికి పంచడం.

నిజమైన సహకార భావం

దయ అంటే కేవలం “సహాయం” కాదు. ఇతరుల బాధను మనసుతో అనుభవించడం. ఉక్రెయిన్‌ యుద్ధ సమయంలో అనేక దేశాలు తమ తలుపులు శరణార్థులకు తెరిచాయి, ఆహారం పంపాయి, పిల్లలకు విద్య అందించాయి. అది రాజకీయ సహాయం కాదు. అది మానవతా సేవ.

ప్రపంచం నేర్చుకున్న పాఠాలు

ప్రతి విపత్తు తర్వాత ఒక సందేశం మిగిలింది. మనమందరం ఒకరికి ఒకరు అవసరమే.” ఆర్థికంగా బలమైన దేశాలు పేద దేశాలకు వ్యాక్సిన్లు పంచాయి, చిన్న సంస్థలు పెద్ద హృదయంతో ముందుకు వచ్చాయి.ఇంటర్నెట్‌ ద్వేషాన్ని వ్యాప్తి చేస్తే కూడా, దయను పంచే వేల మంది ఉన్నారు. పిల్లలకు చదువు అందించే ఫౌండేషన్లు, ఆకలితో ఉన్నవారికి భోజనం అందించే గ్రూపులు, ప్రకృతి కోసం చెట్లు నాటే యువత, ఇవి అన్నీ “దయా దినోత్సవం” యొక్క నిజమైన ఉదాహరణలు.

భారతదేశంలో ఎప్పుడైనా ఉగ్రదాడులు జరిగినప్పుడు ప్రజలు అనుభవించే బాధ, భయం మాటల్లో చెప్పలేనిది. నిరపరాధుల ప్రాణాలు కోల్పోవడం దేశమంతటా విషాదాన్ని నింపుతుంది. కానీ అటువంటి క్లిష్ట సమయంలో భారత జాతి ఏకమవుతుంది. మతం, భాష, ప్రాంతం అనే తేడాలు మరిచి అందరూ ఒకటిగా నిలుస్తారు. రక్తదానం, ఆహారం, వైద్య సహాయం తో నిస్సహాయం గా వున్నవారికి మద్దతు ఇస్తారు. ప్రతి పౌరుడూ తమ వంతు బాధ్యతగా చూస్తారు. దేశమంతా “మనదే ఈ బాధ, మనదే ఈ పోరాటం” అనే భావనతో స్పందిస్తుంది. ఉగ్రవాదం మనుషుల హృదయాలను గాయపరచవచ్చేమో కానీ భారత జాతి ఏకతను మాత్రం ఎప్పటికీ దూరంచేయలేదు. ఇలాంటి ఉగ్రదాడులు జరిగినప్పుడు ప్రజలు అనుభవించే నిస్సహాయత, బాధ మనసును కలచివేస్తుంది. కానీ అటువంటి క్లిష్ట సమయంలో దేశమంతా ఒకటై సానుభూతితో ముందుకు వస్తుంది. ఆ సానుభూతి, ఆ ఐక్యతే దేశానికి బలాన్నిస్తుంది. ఎందుకంటే సానుభూతి గాయాన్ని మానుస్తుంది, ఐక్యత ఆత్మవిశ్వాసాన్ని పునరుద్ధరిస్తుంది.

మనసుతో వినండి. ఇతరుల బాధను అర్థం చేసుకోండి. ప్రత్యామ్నాయం ఆశించకుండా తోడ్పాటు ఇవ్వండి. చిన్న సహాయం కూడా మార్పు తెస్తుంది. దయతో మాట్లాడండి. మాటలతో గాయపరచొద్దు, నమ్మకం నింపండి. ప్రకృతిపై కరుణ చూపండి. భూమిని రక్షించడం భవిష్యత్తును రక్షించడం లాంటిది. పిల్లలకు సానుభూతి నేర్పండి. కొత్త తరం మనసు గెలిచే విలువలు నేర్చుకోవాలి

కరుణతో మమేకమైన మనసే నిజమైన శక్తి

ఉక్రెయిన్‌లో యుద్ధం, ఆఫ్రికాలో ఆకలి, కరోనా మహమ్మారి, వరదలతో నిండిన ప్రపంచం ఇవన్నీ ఒకే మాట చెబుతున్నాయి. మానవజాతి నిలబడేది బలంతో కాదు, కరుణతోనే. మన హృదయం ప్రేమతో నిండితే, భూమి మళ్లీ శాంతితో నిండుతుంది. దయ అనేది భాష, మత, దేశ భేదాలను దాటే మానవతా సంగీతం. మనమందరం ఒక్క చిన్నమానవత చూపినా ఈ ప్రపంచం అంతా వెలుగుగా మారుతుంది.

మానవత్వం చిరునవ్వు చిందించే రోజు - Tholi Paluku