Let's talk: editor@tmv.in
మాదాపూర్ - హైటెక్ సిటీలో ట్రాఫిక్ కష్టాలకు చెక్!

మాదాపూర్ - హైటెక్ సిటీలో ట్రాఫిక్ కష్టాలకు చెక్!

Gaddamidi Naveen
15 ఫిబ్రవరి, 2026

మాదాపూర్, హైటెక్ సిటీ పరిసరాల్లో నిత్యం వేధిస్తున్న ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రభుత్వం ఒక సమగ్ర కార్యాచరణను వేగవంతం చేసింది. శనివారం సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ జి. శ్రీజన, జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, ట్రాఫిక్ పోలీసులు, ఇతర లైన్ డిపార్ట్‌మెంట్ అధికారులు కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు.

మాధాపూర్, హైటెక్ సిటీ ప్రధాన రహదారిపై ఉన్న లెమన్ ట్రీ హోటల్–ట్రైడెంట్ హోటల్–శిల్పారామం మార్గంలో జరుగుతున్న రహదారి విస్తరణ పనులను అధికారులు పరిశీలించారు. ఈ పనుల్లో భాగంగా యుటిలిటీ లైన్ల మార్పిడి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. రోజుకు సుమారు 1.3 లక్షల మంది ప్రయాణికులు ఈ మార్గాన్ని ఉపయోగిస్తున్నందున మున్సిపల్, వాటర్ బోర్డ్, పోలీస్, సాగునీటి, విద్యుత్, టీజీఐఐసీ శాఖలు సమన్వయంతో పనులను ముందుకు తీసుకెళ్తున్నాయి.

లేక్ పార్క్ ప్రాంతంలో మురుగునీరు చేరకుండా ఉండేందుకు 1000 మి.మీ సామర్థ్యంతో నిర్మిస్తున్న సీవర్ పైప్‌లైన్ పనులు తుదిదశకు చేరుకున్నాయి. అదేవిధంగా దుర్గం చెరువు పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మురుగునీటిని 5 నుంచి 7 ఎంఎల్‌డీ శుద్ధి కేంద్రాలకు మళ్లించడం, వరద నీటి కాల్వల నిర్మాణం, అలాగే రహేజా మైండ్‌స్పేస్ పరిధిలో శుద్ధి చేసిన నీటిని వంద శాతం వినియోగం తప్పనిసరి చేయడం వంటి చర్యలు అమల్లోకి తెచ్చారు. ఈ చర్యలతో ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా సహకారం అందుతుందని అధికారులు తెలిపారు.