Let's talk: editor@tmv.in
మాతృ భాషపై మమకారమే భవిష్యత్‌కు బాట : సీఎం చంద్రబాబు

మాతృ భాషపై మమకారమే భవిష్యత్‌కు బాట : సీఎం చంద్రబాబు

Panthagani Anusha
6 జనవరి, 2026

గుంటూరులోని శ్రీ సత్యసాయి ఆధ్యాత్మిక కేంద్రంలో మూడు రోజుల పాటు కన్నుల పండువగా జరిగిన ‘3వ ప్రపంచ తెలుగు మహాసభలు’ సోమవారం నాటితో ఘనంగా ముగిశాయి. ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో ‘అనురాగ సంగమం’ పేరుతో నిర్వహించిన ఈ వేడుకలకు దేశ విదేశాల నుంచి సుమారు 52 దేశాల ప్రతినిధులు తరలివచ్చారు. ముగింపు వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ వేడుకల జ్ఞాపకార్థం భారత తపాలా శాఖ రూపొందించిన ‘ప్రత్యేక స్మారక కవర్’ను ఆవిష్కరించారు.

అనంతరం సభను ఉద్దేశిస్తూ మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగు భాషాభిమానం ప్రజల్లో వెల్లువెత్తుతోందని సంతోషం వ్యక్తం చేశారు. సాధారణంగా సినిమా ఈవెంట్లకు కనిపించే భారీ జనసందోహం ఇవాళ మాతృభాష కోసం నిర్వహించిన సభలకు రావడం అభినందనీయమన్నారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన ఎన్టీఆర్ పేరుతో ఈ వేదికను ఏర్పాటు చేయడం మనందరికీ గర్వకారణమని పేర్కొన్నారు . నాడు కవిత్రయం నుంచి అష్టదిగ్గజాల వరకు నేడు విశ్వనాథ, సినారె వంటి జ్ఞానపీఠ పురస్కార గ్రహీతల వరకు అందరూ తెలుగు వైభవాన్ని చాటారని కొనియాడారు. వేమన, సుమతీ శతకాల నుంచి అన్నమయ్య భక్తి సంకీర్తనల వరకు తెలుగు భాషా సంపద అనన్య సామాన్యమైందని గుర్తు చేశారు. భాషను గ్రాంథికం నుంచి వ్యవహారికంలోకి తెచ్చిన గిడుగు రామ్మూర్తి కృషిని తెలుగు పత్రికా రంగం ద్వారా భాషకు సేవలందించిన రామోజీరావు సేవలను ఈ సందర్భంగా ఆయన స్మరించుకున్నారు. వేల ఏళ్ల చరిత్ర కలిగిన తెలుగు భాష, ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల మందికి పైగా మాట్లాడుతున్నారని ఇది మన భాషా శక్తికి నిదర్శనమని ఆయన కొనియాడారు.

భాషా పరిరక్షణ దిశగా ఒక కీలక నిర్ణయాన్ని ప్రకటిస్తూ తెలుగు జాతికి ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు జ్ఞాపకార్థం రాజమండ్రిలో ఒక ప్రత్యేక తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. భాషా సంరక్షణకు కట్టుబడి ఉన్నామని తెలుగు వెలుగులను పంచిన మహానుభావుల విగ్రహాలను రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టించి వారిని స్మరించుకుంటామని హామీ ఇచ్చారు. మాతృభాషలో చదువుకున్న వారే అత్యంత ప్రతిభావంతులుగా రాణిస్తారని తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నప్పటి నుంచే తెలుగుపై మమకారం కలిగేలా చూడాలని పేర్కొన్నారు.

అదేవిదంగా సాంకేతికత (టెక్నాలజీ) పెరిగినంత మాత్రాన తెలుగు భాషకు ఎటువంటి ముప్పు లేదని సీఎం స్పష్టం చేశారు. కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు మన భాషను కాపాడుకోవడానికి ప్రచారం చేయడానికి మరింత ఉపయోగపడతాయని వివరించారు. 30 ఏళ్ల క్రితం ఐటీ రంగంలో మనం తీసుకున్న నిర్ణయాల వల్లే నేడు తెలుగు యువత ప్రపంచ స్థాయిలో రాణిస్తున్నారని గుర్తు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల అభ్యున్నతే తన లక్ష్యమని, తెలుగు జాతి ఎక్కడ ఉన్నా ఐక్యంగా ఉండాలని ఆకాంక్షించారు.

చివరగా 4వ ప్రపంచ తెలుగు మహాసభలను వచ్చే ఏడాది మారిషస్‌లో నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించడంతో సభికుల హర్షధ్వానాలతో ప్రాంగణం మారుమోగింది. దేశ భాషలందు తెలుగు లెస్స" అన్న నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకుని తెలుగు భాషా వైభవాన్ని ప్రపంచవ్యాప్తం చేయాలని పిలుపునిచ్చారు.

మాతృ భాషపై మమకారమే భవిష్యత్‌కు బాట : సీఎం చంద్రబాబు - Tholi Paluku